Telugu Global
CRIME

ఈ ఖాకి దందా రూ. 500 కోట్లు! తెరవెనుక పెద్దోళ్లు?

ఖాకి చొక్కామాటున వందల కోట్లు కూడబెట్టిన కరీంనగర్ క్రైం బ్రాంచ్ ఏఎస్‌ఐ మోహన్ రెడ్డి కేసులో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోహన్‌రెడ్డి తీగ లాగడంతో ఏకంగా బడా పోలీస్ అధికారుల డొంక కదులుతోంది. పదేళ్లుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న మోహన్ రెడ్డి ఎందరో పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో తాగేశారు. అయితే తన వ్యాపారంలో చాలామంది పోలీసు అధికారులు పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ విచారణలో మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఇటీవల మోహన్ […]

ఈ ఖాకి దందా రూ. 500 కోట్లు! తెరవెనుక పెద్దోళ్లు?
X

ఖాకి చొక్కామాటున వందల కోట్లు కూడబెట్టిన కరీంనగర్ క్రైం బ్రాంచ్ ఏఎస్‌ఐ మోహన్ రెడ్డి కేసులో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోహన్‌రెడ్డి తీగ లాగడంతో ఏకంగా బడా పోలీస్ అధికారుల డొంక కదులుతోంది. పదేళ్లుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న మోహన్ రెడ్డి ఎందరో పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో తాగేశారు. అయితే తన వ్యాపారంలో చాలామంది పోలీసు అధికారులు పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ విచారణలో మోహన్ రెడ్డి బయటపెట్టారు.

ఇటీవల మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక కెన్ క్రెప్ట్ విద్యాసంస్థల డైరెక్టర్ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ పోలీసు గుట్టు బయటపడింది. చనిపోయిన ప్రసాదరావు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు సమీప బంధువు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా మిగిలిన పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం…. మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో కరీంనగర్ ఎఎస్పీ జనార్దన్ రెడ్డి 90 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన డీఎస్పీలు రంగరావు, భాస్కరరాజులు చెరో 10 లక్షలు పెట్టుబడిపెట్టారు. డీఎస్పీలు బుచ్చిరాములు 20 లక్షలు, సాయి మనోహర్ 35 లక్షలు పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. సీఐడీ సీఐ ..ఆర్ ప్రకాశ్ 20 లక్షలు, సీఐ మల్లయ్య 20 లక్షలు, హెడ్ కానిస్టేబుల్ శంకర్ సింగ్ 10 లక్షలును మోహన్ రెడ్డి దందాలో పెట్టారు.

ఇలా కోట్లాది రూపాయలను అధిక వడ్డీకి ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా సొమ్ము చెల్లించలేకపోతే కానిస్టేబుళ్లు, హోంగార్డులను తీసుకెళ్లి బెదిరించేవారు. తప్పుడు కేసులు పెట్టి వేధించేవారు. ఉన్నతాధికారుల అండ కూడా ఉండడంతో మోహన్ రెడ్డి ఆగడాలకు హద్దుఅదుపు లేకుండా పోయింది. కేసును సీఐడీకి అప్పగించిన తర్వాత దాదాపు వంద మంది బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేశారు. వారిలో 45 మంది ఆస్తులు మోహన్ రెడ్డి బ్యాచ్ పేరు మీదకు మారిపోయినట్టు గుర్తించారు. మోహన్ రెడ్డి ఆస్తుల విలువ వందల కోట్లతో ఉన్నట్టు భావిస్తున్నారు. ఒకే చోట 65 ఎకరాల వ్యవసాయభూమిని గుర్తించారు. కేసు లోతు చాలా ఉండడంతో సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది. పలువురు రాజకీయ నాయకులకు కూడా మోహన్ రెడ్డి అప్పులిచ్చారు. ప్రతి చిన్న విషయానికి కూడా గగ్గోలు పెట్టే నేతలు కూడా మోహన్ రెడ్డి దందాపై మాత్రం నోరు మెదపడం లేదు.

First Published:  12 Nov 2015 2:32 AM GMT
Next Story