Telugu Global
Others

విధాన స్పష్టత లేకుండా మూడో ఫ్రంటా?

బిహార్ ఎన్నికల ఫలితాలు మళ్లీ మూడో ఫ్రంట్ ప్రయత్నాలకు ఊతమిచ్చాయి. మూడో ఫ్రంట్ లేదా మూడో ప్రత్యామ్నాయం అన్న మాటలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య సంఘటనకు సంబంధించిన పరిభాషలో భాగం. తృతీయ ప్రత్యామ్నాయం అన్న మాటను బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది వామపక్ష పార్టీలే. వారు దీనిని వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్ అనే వారు. బిహార్ ఫలితాల నేపథ్యంలో వినిపిస్తున్న మూడో ఫ్రంట్ లో వామపక్షాల ప్రస్తావనే లేదు.  స్వాతంత్ర్యానంతరం రెండు దశాబ్దాలపాటు […]

విధాన స్పష్టత లేకుండా మూడో ఫ్రంటా?
X

RV Ramaraoబిహార్ ఎన్నికల ఫలితాలు మళ్లీ మూడో ఫ్రంట్ ప్రయత్నాలకు ఊతమిచ్చాయి. మూడో ఫ్రంట్ లేదా మూడో ప్రత్యామ్నాయం అన్న మాటలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య సంఘటనకు సంబంధించిన పరిభాషలో భాగం. తృతీయ ప్రత్యామ్నాయం అన్న మాటను బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది వామపక్ష పార్టీలే. వారు దీనిని వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్ అనే వారు. బిహార్ ఫలితాల నేపథ్యంలో వినిపిస్తున్న మూడో ఫ్రంట్ లో వామపక్షాల ప్రస్తావనే లేదు.

స్వాతంత్ర్యానంతరం రెండు దశాబ్దాలపాటు అన్ని రాష్ట్రాలలోనూ, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలోనూ కాంగ్రెసే అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగింది. ఆ దశలో అనేక ప్రతిపక్ష పార్టీలున్నా ఏ పార్టీకీ కాంగ్రెస్ ను గద్దె దించగలిగిన శక్తి లేదు. కాంగ్రెస్ ను పదవీచ్యుతం చేయాలన్న కోర్కె మాత్రం ప్రతిపక్షాలకు దండిగా ఉండేది. ఈ స్థితిలో సోషలిస్టు నాయకుడు డా. రాం మనోహర్ లోహియా ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆ ప్రయత్నాలు 1967లో ఫలించి హిందీ మాట్లాడే రాష్ట్రాలలో సం యుక్త విధాయక్ దళ్ (ఎస్.వి.డి.) మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామానికి స్ఫూర్తి నిస్సందేహంగా లోహియాదే. సంయుక్త విధాయక్ దళ్ మత్రివర్గాలలో బిహార్, పంజాబ్ రాష్ట్రాలలో భారతీయ జన సంఘ్ తో పాటు సీపీఐ కూడా భాగస్వామి. దీన్ని బట్టి కాంగ్రెస్ ను గద్దె దించడం అన్న ఏకైక లక్ష్యమే ప్రతిపక్షాల ఐక్యతకు దారి తీసింది. అప్పుడు ప్రత్యామ్నాయం అన్న మాటే కాని మూడో ప్రత్యామ్నాయం అన్న మాట లేదు. ప్రతిపక్షాల ఐక్యత ఏ రూపు దిద్దుకుంటుందో గమనించే అవకాశం లోహియాకు రాలేదు. ఎస్.వి.డి. మంత్రివర్గాలు ఏర్పడిన ఏడెనిమిది నెలలకే లోహియా మృతి చెందారు. విచ్చలవిడి కులరాజకీయాలను ఆయన అంగీకరించే వారు కాదు.

లోహియాది విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయన శుద్ద గాంధేయవాది. స్వాతంత్ర్యానికి ముందు నెహ్రూకు వీరాభిమాని. ఆ తర్వాత విధానాల ఆధారంగానే నెహ్రూను గట్టిగా వ్యతిరేకించారు. ఆ నిష్ఠ ప్రస్తుతం మూడో ప్రత్యామ్నాయం కోసం పరితపిస్తున్న వారిలో ఏ మాత్రం లేదు. ఎస్.వి.డి. మంత్రివర్గాలలో అప్పటి ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ మీద అసమ్మతితో వెలికి వచ్చిన వారూ ఉన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. వారి విధానాలు మారలేదు. కేవలం జెండాలు మారాయి.

1967 తర్వాత పదేళ్లకు మళ్లీ అనేక ప్రతిపక్షాలు కలిసి ఎమర్జెన్సీ నేపథ్యంలో 1977లో జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ ఏర్పాటు చేసి కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దె దింపాయి. జనతా ప్రభుత్వం మూడేళ్లు కూడా అధికారంలో కొనసాగలేదు. జనతా పార్టీలో ఉన్న పార్టీలు మళ్లీ దేని కుంపటి అది పెట్టుకున్నాయి. జనసంఘ్ బీజేపీగా రూపాంతరం చెందితే సోషలిస్టులు నిస్తేజంగా మారారు. ఆ తర్వాత సోషలిస్టు భావాలున్న మునుపటి జనతా పార్టీలోని వారు, కాంగ్రెస్ (ఎస్), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో 1988 అక్టోబర్ 11న జనతా దళ్ ఏర్పాటు చేశారు. జనతా దళ్ లో కుల తత్వం పెరిగిపోతోందన్న ఆరోపణతో ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ 1994లో సమతా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోషలిస్టులు తలో దారి తొక్కారు. ప్రస్తుతం సోషలిస్టు పార్టీ అన్న పేరే లేదు. మునుపు సోషలిస్టు సిద్ధాంతాలను అనుసరించిన ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తలో పార్టీలో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఫెర్నాండెజ్ చేష్టలుడిగి పోయారు. ఇదివరకు సోషలిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామనుకునే వారు కులసమీకరణల్లో మునిగి పోయారు.

1980ల చివరలో, 1990ల ఆరంభంలో రామజన్మ భూమి ఆందోళన పుణ్యమా అని బీజేపీ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. మతతత్వ రాజకీయాలు ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ దశలోనే కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ఆరంభమైనాయి. ఈ ప్రయత్నాలలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే మూడో ఫ్రంటును వామపక్ష-ప్రజాస్వామ్య ఐక్య సంఘటన అన్నారు.

2014 ఎన్నికలలో కాంగ్రెస్ గద్దె దిగడమే కాక నస్మరంతిగా మిగిలి పోయింది. ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలలోనూ హిమాచల్, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉంది. లేదా సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. పార్లమెంటులో కాంగ్రెస్ కు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దీన స్థితిలో ఉంది. అందువల్ల కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తొంది. ఈ దృష్టితో చూస్తే తాజాగా వినిపిస్తున్న మూడో ప్రత్యామ్నాయం అన్న మాట అర్థ రహితమైంది. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండడం కోసమే. విధానాల రీత్యా చూసినా బిహార్ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయం అంటున్న నాయకులెవరికీ నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం ఏదీ మిగల లేదు. మూడో ప్రత్యామ్నాయం పరమావధి అధికారం సంపాదించడం మాత్రమే.

“మేమందరం రాం మనోహర్ లోహియా శిష్యులం. అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఉద్యమించడం అన్నది లోహియా మాకు నేర్పిన పాఠం. ప్రస్తుతం బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. అధికారవర్గం.” అని నితీశ్ అన్న మాటల్లోనే బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

మునుపటి జనతాదళ్ లోని వివిధ రాజకీయ పార్టీలను ఐక్యం చేసి జనతా పరివార్ గా అవతరించడం కోసం చేసిన కృషి బెడిసి కొట్టింది. ములాయం సింగ్ యాదవ్ ను జనతా పరివార్ నాయకుడిగా ఎన్నుకున్నా ఆయనకు సంతృప్తి కలగ లేదు. ఈ ప్రయత్నాలు బిహార్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగాయి కనక తమ పార్టీకి బలం లేని బిహార్ లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలన్న ఆయన స్వార్థ బుద్ధే జనతా పరివార్ కోసం ప్రయత్నాలు సఫలం కాకపోవడానికి ప్రధాన కారణం. ఒంటెత్తు పోకడ అనుసరించినందుకు ములాయం తగిన మూల్యమే చెల్లించుకున్నారు.

(L-R) Samajwadi Party chief Mulayam Singh Yadav, Nitish Kumar, chief minister of Bihar, Sharad Yadav of the Janata Dal (United) party, Lalu Prasad Yadav of Rashtriya Janata Dal party pose for photographers ahead of a press conference in New Delhi on April 15, 2015. Six Indian left-leaning and regional political parties vowed to work together to take on Prime Minister Narendra Modi's right-wing Bharatiya Janata Party ahead of key Bihar state elections scheduled later in the year. AFP PHOTO / SAJJAD HUSSAIN

శరద్ యాదవ్, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యు), లాలూ నాయకత్వంలోని ఆర్.జె.డి., దేవ గౌడ నాయకత్వంలోని జె.డి.(సెక్యులర్), ఓం ప్రకాశ్ చౌతాలా నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్, చంద్ర శేఖర్ నాయకత్వంలోని సమాజ్ వాది జనతా పార్టీ (రాష్ట్రీయ), ములాయం నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ కలిసి జనతా పరివార్ గా అవతరించాలనుకున్నాయి. ములాయం దీనికి గండి కొట్టారు. ఈ సకల పార్టీలలో కనిపించే నాయకులు అందరూ ఒకప్పుడు సోషలిస్టు పార్టీతో సంబంధం ఉన్న వారే. అయితే ఇప్పుడు వీళ్లెవరికీ ఆ సిద్ధాంతాలతో పని లేదు. నిజం చెప్పాలంటే సిద్ధాంత ప్రాతిపదికే లేదు. ఉన్నదల్లా అధికారం సంపాదించడానికి కుల సమీకరణల కూడికలు తీసివేతలే.

బిహార్ పరిణామాల తర్వాత మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత వంటి వారితో పాటు రెండో సారి ఎన్.డి.ఏ. కూటమిలో చేరి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలికి రావడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మూడో ఫ్రంట్ (అదే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్) కు మద్దతివ్వొచ్చు. ఈ పార్టీలన్నీ సెక్యులరిజం మంత్రోచ్ఛాటన చేస్తుంటాయి. కాని ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చిన సందర్భాలు కొల్లలు. నితీశ్ అనువైనప్పుడు బీజేపీతో పొత్తు కలిపిన వారే. చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నారు. అంటే సెక్యులరిజానికి కట్టుబడడం కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం మాట్లాడుతున్న వారికి అంతగా పట్టింపు లేని వ్యవహారమే. చాలా వరకు ములాయం , లాలూ నిఖార్సుగా సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నారు. అద్వానీ రథ యాత్ర చేసినప్పుడు సమస్తిపూర్ లో అరెస్టు చేసింది లాలూ. ఇప్పుడు కూడా అదే రీతిలో “బీజేపీ కోల్ కతాకు చేరుకోవాలని చూసింది. కాని మేం బిహార్ లోనే ఆపేశం” అని లాలూ చమత్కార ధోరణిలో చెప్పారు.

“బలమైన ప్రతిపక్షం కావాలని దేశవ్యాప్తంగా జనంలో కోరిక ఉంది. ప్రజాస్వామ్య మనుగడకు కూడా అదే అవసరం” అన్న నితీశ్ కుమార్ మాటల్లోనూ బిహార్ విజయం దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష ఐక్యతకు దారి తీయాలన్న లక్ష్యం ఉంది. “నితీశే బిహార్ ముఖ్యమంత్రిగా ఉంటారు” అని పదే పదే ప్రకటించిన లాలూ తమ ప్రస్థానం ఇక్కడితో ఆగదనీ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక శక్తులను కూడగడతామని చెప్పారు. బీజేపీ విద్వేష పూరిత విధానాలను నిలవరించడానికి బలమైన రాజకీయ శక్తి నిస్సందేహంగా అవసరమే. కాని దానికి సిద్ధాంత ప్రాతిపదిక అవసరం. ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించడం అంతకన్నా ముఖ్యం. ఆ ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. 1977 లో లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ అవినీతి వ్యతిరేక పోరాటం పేర నడిపిన సంపూర్ణ విప్లవం విధానాలతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షాలను ఐక్యం చేయగలిగింది. అది విఫలం కావడానికి కారణం సిద్ధాంత రాహిత్యమే. వామపక్ష ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో ఉన్నది, తాజా ప్రయత్నాలలో లేనిది నిర్దిష్ట విధానాలే. అది సఫలమవుతుందన్న భరోసా లేదు.

-ఆర్వీ రామా రావ్

First Published:  10 Nov 2015 9:53 AM IST
Next Story