Telugu Global
Others

సీమ పుండుపై కారం.. క్యాన్సర్ ఆస్పత్రి గుంటూరుకు!

చంద్రబాబు కక్ష కట్టి తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రాయలసీమవాసులు ఆగ్రహిస్తున్న వేళ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్‌లో స్థానికతను ఎత్తివేసి సీమ విద్యార్థుల్లో ప్రభుత్వం అలజడి రేపింది. పద్మావతి మెడికల్ కాలేజ్‌ స్థానికతను 13 జిల్లాలకు అమలు చేయడం ద్వారా 150 మెడికల్ సీట్లలో రాయలసీమ విద్యార్థులకు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీనిపై వివాదం నడుస్తుండగానే తిరుపతి క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకు తరలించాలని […]

సీమ పుండుపై కారం.. క్యాన్సర్ ఆస్పత్రి గుంటూరుకు!
X

చంద్రబాబు కక్ష కట్టి తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రాయలసీమవాసులు ఆగ్రహిస్తున్న వేళ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్‌లో స్థానికతను ఎత్తివేసి సీమ విద్యార్థుల్లో ప్రభుత్వం అలజడి రేపింది. పద్మావతి మెడికల్ కాలేజ్‌ స్థానికతను 13 జిల్లాలకు అమలు చేయడం ద్వారా 150 మెడికల్ సీట్లలో రాయలసీమ విద్యార్థులకు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీనిపై వివాదం నడుస్తుండగానే తిరుపతి క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై మాజీ ఎంపీ చింతమోహన్ తీవ్రంగా స్పందించారు.

తిరుపతి క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరు తరలిస్తామని విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారని.. ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చింతా మోహన్ చెప్పారు . యూపీఏ హయాంలో తిరుపతి రుయా ఆస్పత్రికి అనుబంధంగా రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మాణం, నిర్వాహణ కోసం కేంద్రం 120 కోట్లు విడుదల చేసింది. 2014 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర మంత్రి జయరాంరమేష్ రుయా ఆస్పత్రి ఆవరణలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకు తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని చింతామోహన్ ఆరోపించారు. తాను రాయలసీమ వాడినేనని, కంఠంలో ప్రాణముండగా సీమకు అన్యాయం జరగనివ్వనని చెబుతున్న చంద్రబాబు ఈ అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ చర్యను రాయలసీమ నేతలే కాకుండా కోస్తా జిల్లాల నేతలు కూడా తప్పుపడుతున్నారు . ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని రాయలసీమ నేతలు హెచ్చరిస్తున్న వేళ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి ఇలా కవ్వింపు చర్యలకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం కలిసి ఉండడం టీడీపీ నేతలకు ఇష్టం లేదా అని కోస్తా జిల్లాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సంస్థలను రాయలసీమకు కేటాయించకపోవడం అటుంచితే… అక్కడ ఏర్పాటు అవుతున్న సంస్థలను కూడా తరలిస్తామని చెప్పడం ఏం రాజకీయమని అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  10 Nov 2015 9:13 AM IST
Next Story