సర్వతోముఖ ఓటమి
బిహార్ శాసన సభ ఎన్నికలలో నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి బ్రహ్మాండమైన విజయంపట్ల ఆనదించడానికన్నా బీజేపీ ఓటమిని చూసి అమితానంద పడవలసిన దుస్థితిలో దేశ రాజకీయాలు ఉన్నాయి. సాధారణంగా విజయం ఆనందానికి కారణమవుతుంది. కాని బీహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం చాలామందికి అమితానందం కలిగించింది. ఏడాదిన్నర కాలం కిందట అభివృద్ధి ఆశలు చూపి, ‘అచ్ఛే దిన్ ‘ (మంచి రోజులు) అల్లంత దూరంలో ఉన్నాయని నమ్మించగలిగిన బీజేపీ బీహార్ ఎన్నికలలో బోల్తా పడింది. ఓటమి సంతోషకారణం […]
బిహార్ శాసన సభ ఎన్నికలలో నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి బ్రహ్మాండమైన విజయంపట్ల ఆనదించడానికన్నా బీజేపీ ఓటమిని చూసి అమితానంద పడవలసిన దుస్థితిలో దేశ రాజకీయాలు ఉన్నాయి. సాధారణంగా విజయం ఆనందానికి కారణమవుతుంది. కాని బీహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం చాలామందికి అమితానందం కలిగించింది. ఏడాదిన్నర కాలం కిందట అభివృద్ధి ఆశలు చూపి, ‘అచ్ఛే దిన్ ‘ (మంచి రోజులు) అల్లంత దూరంలో ఉన్నాయని నమ్మించగలిగిన బీజేపీ బీహార్ ఎన్నికలలో బోల్తా పడింది. ఓటమి సంతోషకారణం కావడం నిజానికి మంచి పరిణామం కాదు. బిహార్ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద అభిప్రాయ వ్యక్తీకరణ కింద జమకట్టడమూ సమంజసం కాదు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలో చీలికలు తీసుకురావడానికి అనుసరిస్తున్న విధానాలను, ప్రజల వ్యక్తిగత ఆహార అలవాట్లను తప్పుబట్టడం, రిజర్వేషన్ల కొనసాగింపుపై అనుమానాలు రేకెత్తించడం మొదలైన అంశాలను బిహార్ ప్రజలు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారు. మోదీ ప్రభుత్వం రేకిత్తించిన ఆశలకన్నా సంఘ్ పరివార్ రేపిన వివాదాలు బీహార్ ప్రజలనే కాక మొత్తం దేశాన్నే ఒక్క కుదుపు కుదిపాయి. ఈ క్రమంలోనే మోదీ ప్రవచించే అభివృద్ధి పంథా కన్నా సమ్మిళిత అభివృద్ధి సాధనకు నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి కట్టుబడి ఉందన్న విశ్వాసం ప్రజలకు కలిగింది. అందుకే బీజేపీని అవమానకరమైన రీతిలో ఓటమి పాలు చేశారు.
దీపావళికి నాలుగు రోజుల ముందు వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాలకు నరకాసుర వధను ప్రజలు పండగగా జరుపుకోవడానికి మధ్య పొంతన ఉంది. నరకాసురుడు భూదేవి కుమారుడు. తన కొడుకుల్లో ప్రజా కంటకుడైన నరకాసురుణ్ని భూదేవి (సత్యభామ రూపంలో) అంతం చేసింది. నరకాసురుడి భయానికి జనం ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి కూడా జంకే వారు. నరకాసుర సంహారం జరిగిందని తెలియగానే ప్రజలు దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. ఇప్పటికీ ఆ రోజు పండగే. అందుకే సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నించిన బీజేపీ బిహార్ లో ఘోర పరాజయం పాలు కావడం జనాన్ని ఆనందోత్సాహంలో ముంచెత్తుతోంది. ఈ ఫలితాలు బిహార్ కే పరిమితవైనవే అయినా ఆ ఆనందాతిరేకాల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. బిహార్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే అసహన ధోరణి నిరాఘాటంగా కొనసాగే ప్రమాదం తప్పేది కాదు. బిహార్ ఫలితాలు తాము అనుసరించిన విధానాలను బీజేపీ పునరాలోచించేట్టుగా చేశాయి.
సరిగ్గా ఏడాదిన్నర కింద లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో అదే బిహార్ లో బీజేపీ అఖండమైన విజయం సాధించి ఇప్పుడు శాసన సభ ఎన్నికలలో చతికల పడడం నిష్కారణమైన పర్యవసానం కానే కాదు. 2014 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 40 స్థానాలుంటే బీజేపీ 31 సీట్లు సాధించి అఖండ విజయం సాధించింది. 174 శాసన సభ నియోజక వర్గాల పరిధిలో అప్పుడు బీజేపీ మెజారిటీ ఓట్లు సంపాదించింది. దీనితో తమకు శాసన సభ ఎన్నికలలోనూ తిరుగు లేదనుకున్న బీజేపీ నాయకత్వం బరితెగించి చేసిన విధానాలు, ప్రచారం బెడిసికొట్టాయి. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మీద బీజేపీ వ్యక్తిగత నిందారోపణలకు దిగింది. నితీశ్ కుమార్ డి.ఎన్.ఏ.నే ప్రశ్నించింది. దీన్ని బిహార్ ప్రజలు తమను అవమానించడంగా భావించారు.
శాసన సభ ఎన్నికలలో బీజేపీ బిహార్ లో తమ పార్టీకి నాయకులే లేనట్టు నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే బిహార్ లో బీజేపీ నాయకులైనట్టు ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించడం లేదా ప్రకటించకుండా ఉండడం బీజేపీ అంతర్గత వ్యవహారం. కాని మహా కూటమి మాత్రం విజయం సాధిస్తే నితీశ్ కుమారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విష్పష్టంగా ప్రకటించడం వల్ల బీహారీలు నాయకులుగా ఉండాలా బయటి వారు నాయకులుగా ఉండాలా అని బేరీజు వేసుకున్న బిహార్ ప్రజలు బిహారీలే నాయకులుగా ఉండడం మేలనుకున్నారు. 2014లో మోదీ అఖండ విజయం తర్వాత దిల్లీ, బిహార్ లో బీజేపీ పరాజయం పాలైంది. అంతకు ముందు దిల్లీ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గణనీయమైన స్థానాలనే సంపాదించింది. కాని ఇటీవలి ఎన్నికల దగ్గరకొచ్చే సరికి మాజీ పోలీసు అధికారి కిరణ్ బేడీని తీరా ఎన్నికలు దగ్గరపడ్డ తర్వాత పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని అక్కడి జనం మెచ్చలేదు. దిల్లీలో ముఖ్య మంత్రి అభ్యర్థిని ప్రకటించినా బెడిసి కొట్టిందనుకున్న బీజేపీ బిహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా మోదీ, అమిత్ షా ముఖచిత్రాలే దర్శనం ఇచ్చాయి. ఈ వ్యూహం బీజేపీ ఓటమికి కారణం అయింది.
బిహార్ ఓటమి ఎంత తీవ్రమైంది అయిందంటే సైద్ధాంతికంగా బీజేపికి సన్నిహితమైన శివసేన కూడా ఈ ఓటమికి మోదీ బాధ్యత వహించాలని చెప్పేదాకా వెళ్లింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయినా ఈ వ్యాఖ్యలు చేయడం గమనించదగిన పరిణామమే.
గతంలో నితీశ్ నాయకత్వంలోని జె.డి (యు), బీజేపీ కలిసి బిహార్ లో అధికారంలో ఉన్నాయి. బీజేపీ ఆ ప్రభుత్వంలో ఉన్నంత కాలమే అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత నితీశ్ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందని బీజేపీ చేసిన ప్రచారమూ బెడిసికొట్టింది. 2010తో పోల్చి చూసినా బీజేపీ ఎక్కువ స్థానాలే కోల్పోయింది. అప్పుడు 91 స్థానాలుంటే ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి కేవలం 58 సీట్లు మాత్రమే సంపాదించింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న రాం విలాస్ పాశ్వాన్ రెండు స్థానాలు, కుష్వాహ రెండు సీట్లు, మాంఝీ ఒక్క స్థానం మాత్రమే సంపాదించారు. అంటే కుల సమీకరణలు కూడా బీజేపీని గట్టెక్కించలేక పోయాయి. యాదవులకు ప్రాబల్యం ఉన్న స్థానాల్లో ఆ వర్గానికి ఎక్కువ సీట్లు కట్టబెట్టినా ప్రయోజనం లేక పోయింది. మిత్ర పక్షాల ద్వారా ఇ.బి.సి.ల మద్దతు పొందాలన్న బీజేపీ ఆలోచనా ఫలితమివ్వలేదు. బిహార్‌లో మహా కూటమి గెలుపొందితే పాకిస్థాన్‌లో దీపావళి చేసుకుంటారని అమిత్‌షా అన్నారు. అయితే బిహార్‌లో బీజేపి ఓటమితో భారతదేశంలోనే ప్రజాస్వాన్ని కోరుకునేవాళ్లకి దీపావళి వచ్చినట్లైయింది.
అయిదు దశల్లో జరిగిన పోలింగును బట్టి చూసినా నాల్గో దశలో తప్ప బీజేపీకి మిగతా దశల్లో లెక్క తప్పింది. మొదటి దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరిగితే మహా కూటమి 44 స్థానాలను కైవసం చేసుకుంది. రెండో దశలో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినా 32 స్థానాల్లో 9 మాత్రమే సాధించగలిగింది. మూడవ దశ మొత్తం లాలూ హవా కొనసాగింది. నాల్గవ దశలో మాత్రం బీజేపీ 20 సీట్లు సంపాదించింది కాని మిత్రపక్షాల దన్ను లేదు. అయిదవ దశలో పోలింగ్ జరిగిన ప్రాంతాలలో 2014 లోక సభ ఎన్నికలలో జె.డి.(యు) మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడినట్టుగానే ఈ సారి ఘన విజయం సాధించింది.
పోటీ చేసిన సీట్లు గెలిచిన స్థానాలను బట్టి చూసినా బీజేపీ మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకన్నా వెనుబడి ఉంది. జె.డి.(యు) 101 స్థానాలకు పోటి చేసి 71 సీట్లు, ఆర్.జె.డి 101 స్థానాలకు పోటీ చేసి 80 సీట్లు, కాంగ్రెస్ 41 స్థానాలకు పోటి చేసి 27 స్థానాలు సంపాదిస్తే బీజేపీ 157 స్థానాలకు పోటి చేసి 53 సీట్లు అంటే 33 శాతం సీట్లు మాత్రమే సంపాదించింది. బీజేపీ నాయకత్వంలోని కూటమిలో పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్.జె.పి. పరిస్థితి మరీ ఘోరం. 42 స్థానాలకు పోటీ చేసి సాధించింది కేవలం రెండు సీట్లే. 12.5 శాతం దళిత ఓటర్లు ఉన్నారు గనక నితీశ్ మీద ఆగ్రహించిన మూణ్నాళ్ల మాజీ ముఖ్యమంత్రి వల్ల ప్రయోజనం ఉందనుకున్న బీజేపీ అంచనాలూ వమ్మయినాయి. మాంఝీ నేతృత్వంలోని అవామీ మోర్చా సెక్యులర్ కేవలం ఒక్క స్థానం మాత్రమే సాధించింది.
మోదీ, నితీశ్ ఇద్దరూ అభివృద్ధి మంత్ర జపమే చేసినా నితీశ్ చెప్పే సమ్మిళిత అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు. ఇతరేతర అంశాలతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించడానికి పశు మాంస భక్షణ, రిజర్వేషన్ల భవితవ్యంపై రేకెత్తించిన వివాదాలు, పెంచి పోషించిన అసహన ధోరణులు బీజేపీని చావు దెబ్బ తీశాయి. రెండు అభివృద్ధి నినాదాల మధ్య బిహార్ ప్రజలకు నితీశ్ నమూనాయే నచ్చింది.
మహా కూటమిని ఏర్పాటు చేయడంలో నితీశ్, లాలూ కూడా త్యాగ నిరతి ప్రదర్శించారు. నితీష్ నాయకత్వంలోని జె.డి.(యు) కు గత శాసన సభలో 115 స్థానాలున్నా ఇతర రాజకీయ పార్టీలను కలుపుకు పోవడానికి జె.డి.(యు) కేవలం 101 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. లాలూది “ఆటవిక రాజ్యం” అని నిందించింది నిజానికి నితీశ్. ఈ పదబంధాన్నే బీజేపీ వాటంగా లాలూ మీద దుమ్మెత్తి పోయడానికి వాడుకుంది. సిద్ధాంత రీత్యా చూస్తే ఒకప్పుడు లాలూ, నితీశ్ ఒకే కుదురుకు చెందిన వారు. వారిద్దరూ సోషలిస్టులే. కాని ఆ తర్వాత ఇద్దరి మధ్య వైరం పెరిగింది. బీజేపీని నిలవరించడం కోసం లాలూ పాత శతృత్వాలను పక్కన పెట్టారు. ఐక్యతకు ఉన్న మహత్తు సమాజాన్ని చీలికలు వాలికలు చేసే విధానాలకు ఉండదన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహించలేక పోయింది. తమ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా నితీశే ముఖ్యమంత్రి అని లాలూ ఎన్నికల ఒప్పందం కుదిరినప్పుడు, ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు, తీరా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు కూడా ప్రకటించి పాత వైరాలకు తావు లేదని ఖండితంగా చెప్పారు. మతతత్వ వాదులను అడ్డుకోవాలంటే వ్యక్తుల మధ్య వైరం కుదరదని నితీశ్, లాలూ నిరూపించారు.
బిహార్ ఎన్నికల క్రమంలో గమనించదగిన మరో పరిణామం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నితీశ్ నాయకత్వంలోని మహా కూటమినే గెలిపించాలని బాహాటంగా బిహార్ ప్రజలకు విజ్ఞప్తి చేయడం. ఇది అపూర్వమైన పరిమాణం. అసహనం, సమాజాన్ని చీల్చడంలో ఉన్న ప్రమాదాన్ని పసి కట్టినందువల్లే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విజ్ఞప్తి చేశారు.
ప్రతికూల ప్రచారాలు ఫలించవని బిహార్ ఫలితాలు స్పష్టం చేశాయి. 2014 లోక సభ ఎన్నికలలో బీజేపీ ప్రచారంలో కనిపించిన సానుకూల అంశాలు ఈ సారి ఉదాహరణ ప్రాయంగానైనా లేవు. ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించడం మీద బీజేపీ చూపిన శ్రద్ధ ప్రజలకు విశ్వాసం కలిగించడంలో ప్రదర్శించలేదు. జనాన్ని విభజించే, అసహనం పెంచి పోషించే ప్రక్రియ దిల్లీ శాసన సభ ఎన్నికలలో ఫలితాలివ్వనట్టే బీహార్ ఎన్నికలలో బీజేపీకి తల బొప్పి కట్టేట్టు చేయడానికి మాత్రమే ఉపయోగపడింది.
జనం కోరుకున్నది కేవలం వాగ్దానాలు కాదు. తమ బతుకుల్లో మార్పే ప్రజలకు పరమావధి. ఆ పని మోదీ కన్నా నితీశ్ సమర్థవంతంగా చేయగలిగారు. గోవధ నిషేధాన్ని ఎవరూ అభ్యంతర పెట్టడం లేదు. చాలా రాష్ట్రాలలో ఇప్పటికే అది అమలులో ఉంది. కొన్ని రాష్ట్రాలలో నిషేధం లేకపోవడానికి నిర్దిష్టమైన కారాణాలున్నాయి. గోవధ నిషేధాన్ని ఆహార అలవాట్లను ఒకే గాట కట్టి దానికి మతం రంగు పులమడానికి బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టవలసినంత తీవ్రంగానే బెడిసి కొట్టింది. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
– ఆర్వీ రామారావ్