నిలబడితే...నాజూకుదనం
రోజులో నాలుగోవంతుకాలం నిలబడండి చాలు…మీ బరువు కంట్రోల్లో ఉంటుంది అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. అమెరికా క్యాన్సర్ సొసైటీ, టెక్సాస్, జార్జియా యూనివర్శిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010-15 మధ్యకాలంలో డల్లాస్ లోని కూపర్ క్లినిక్‌కి వచ్చిన ఏడువేలమంది పెద్దవయసు పేషంట్లను ప్రశ్నించి, ఆ వివరాల ఆధారంగా పరిశోధకులు ఈ నిర్దారణకు వచ్చారు. వీరిలో చాలామంది శ్వేత జాతీయులు, విద్యావంతులు. వీరంతా మంచి ఆరోగ్యవంతులే. ఎవరికీ క్యాన్సర్, గుండెజబ్బుల్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు […]
రోజులో నాలుగోవంతుకాలం నిలబడండి చాలు…మీ బరువు కంట్రోల్లో ఉంటుంది అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. అమెరికా క్యాన్సర్ సొసైటీ, టెక్సాస్, జార్జియా యూనివర్శిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010-15 మధ్యకాలంలో డల్లాస్ లోని కూపర్ క్లినిక్‌కి వచ్చిన ఏడువేలమంది పెద్దవయసు పేషంట్లను ప్రశ్నించి, ఆ వివరాల ఆధారంగా పరిశోధకులు ఈ నిర్దారణకు వచ్చారు. వీరిలో చాలామంది శ్వేత జాతీయులు, విద్యావంతులు. వీరంతా మంచి ఆరోగ్యవంతులే. ఎవరికీ క్యాన్సర్, గుండెజబ్బుల్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు లేవు.
వారిని తమ ఫిట్‌నెస్‌కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ, రోజువారీ దినచర్యలో భాగంగా రోజులో ఎంతసమయం నిలబడి ఉంటారు అనే వివరాలు తెలుసుకున్నారు. వారు నిలబడే కాలాన్ని బట్టి వారిని ఐదు విభాగాలుగా విడగొట్టారు. రోజులో పనిచేస్తున్న కాలంలో పూర్తిగా నిలబడి ఉండేవారు, సగం సమయం, నాలుగింటా మూడొంతుల కాలం, పావువంతు కాలం, అసలు పనిసమయంలో ఏమాత్రం నిలబడని వారు… ఇలా…విభజించారు. రోజంతటిలో నిలబడి ఉండే సమయానికి, ఒబేసిటీకి ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు వారి బాడీ మాస్ ఇండెక్స్, శరీరంలో కొవ్వుశాతం, నడుము చుట్టుకొలతలను పరిగణనలోకి తీసుకున్నారు.
పనిసమయంలో పావువంతు కాలం నిలబడే వాళ్లలో ఒబేసిటి వచ్చే అవకాశాలు 32 శాతం తగ్గినట్టుగా గమనించారు. శరీరంలో కొవ్వుశాతాన్ని బట్టి దీన్ని నిర్ణయించారు. అలాగే సగం సమయం నిలబడి ఉండేవారిలో ఒబేసిటీ వచ్చే అవకాశం 59శాతం తగ్గినట్టుగా గమనించారు. అయితే పనిసమయంలో మూడొంతులు అంతకంటే ఎక్కువ కాలం నిలబడే ఉండేవారిలో ఒబేసిటీని తగ్గించే లక్షణాలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదంతా మగవారి విషయంలో.
మహిళల్లో ఈ తగ్గుదల వేరుగా ఉంది. పనిచేసే సమయంలో పావువంతు, సగంకాలం, మూడువంతుల కాలం..నిలబడిన మహిళల్లో వరుసగా 35,47,57శాతాల్లో ఒబేసిటి వచ్చే అవకాశాలు తగ్గినట్టుగా గమనించారు.
ఇక నిలబడటానికి, మెటబాలిక్ సిండ్రోమ్ (అధికరక్తపోటు, మధుమేహం, ఒబేసిటీ లాంటి ఐదు జీవనశైలి అనారోగ్య లక్షణాల్లో మూడు ఉండటం)కి ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు గుర్తించారు. అయితే నిలబడటం కారణంగా బరువు పెరుగుదల రిస్క్ తగ్గుతున్నదా లేదా బరువు అధికంగా ఉండటం కారణంగా ఎక్కువ సమయం నిలబడలేకపోవడం వలన అదే బరువుకి కారణంగా భావిస్తున్నామా అనే విషయాలను, తమ వద్ద ఉన్న డాటా ఆధారంగా తేల్చి చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.