స్వచ్ఛ భారత్ అంటే చరిత్రను మార్చడమా?
సంఘ్ పరివార్ కుదురులోని వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పాఠ్య పుస్తకాల రచనను, చరిత్ర రచనను తమకు అనుకూలమైన రీతిలో మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాదనలను సంఘ్ పరివార్ వారు “సాంస్కృతిక కాలుష్యం” గా పరిగణిస్తారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజారిటీ ఉంది గనక గతంలో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఉన్న ఎన్.డీ.ఏ. ప్రభుత్వానికన్నా ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో ఎన్.సి.ఇ.ఆర్.టి. ప్రచురించే పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన అంశాలను […]
సంఘ్ పరివార్ కుదురులోని వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పాఠ్య పుస్తకాల రచనను, చరిత్ర రచనను తమకు అనుకూలమైన రీతిలో మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాదనలను సంఘ్ పరివార్ వారు “సాంస్కృతిక కాలుష్యం” గా పరిగణిస్తారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజారిటీ ఉంది గనక గతంలో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఉన్న ఎన్.డీ.ఏ. ప్రభుత్వానికన్నా ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో ఎన్.సి.ఇ.ఆర్.టి. ప్రచురించే పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన అంశాలను తిరగరాయడానికి పరిమితమైన వారు ఇప్పుడు చరిత్రకు, చరిత్ర రచనకు సంబంధించిన ఒక్కో వ్యవస్థను సమూలంగా తమదైన శైలిలో “ప్రక్షాళన” చేస్తున్నారు. కళలు, చరిత్ర, విద్యా విషయక సంస్థలలో చిన్న మార్పులు చేర్పుల పేరుతో దీర్ఘకాలిక ప్రభావం చూపే మార్పులు కొనసాగుతున్నాయి. భారత చరిత్ర పరిశోధనా మండలికి (ఐ.సి.హెచ్.ఆర్.) తమ కుదురుకు సంబంధించిన వై. సుదర్శన్ రావును నియమించిన తర్వాత ఆయన చరిత్రకే కొత్త భాష్యం చెప్తున్నారు. భారత్ ఫిలిం, టీవీ సంస్థకు అనర్హుడిని అధిపతిగా నియమిచారన్న వాదనతో ఆ సంస్థకు చెందిన విద్యార్థులు వంద రోజులకు పైగా సమ్మె కట్టి ప్రభుత్వ వైఖరి మారకపోవడంతో విసుగొచ్చి సమ్మె చాలించారు.
సుదర్శన్ రావు నాయకత్వంలోని భారత చరిత్ర పరిశోధనా మండలి ఇటీవల తాము ప్రచురించే “ఇండియన్ హిస్టారికల్ రివ్యూ” పత్రిక సలహా మండలిని రద్దు చేసింది. అంటే ఈ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారన్న మాట. ఈ సలహా మండలిని రద్దు చేయడం వల్ల ప్రసిద్ధ చరిత్రకారులు రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటి వారికి ఐ.సి.హెచ్.ఆర్.లో స్థానం లేకుండా పోయింది. ఐ.సి.హెచ్.ఆర్. 1974 నుంచి ” ఇండియన్ హిస్టారికల్ రివ్యూ” ను ద్వైవార్షిక పత్రికగా వేలువరిస్తోంది. ఈ పత్రిక చాలా గౌరవ ప్రదమైంది. థమ్సన్ రాయిటర్స్ జాబితాలో కూడా ఈ పత్రిక చేరింది. ఈ సలహా మండలిని రద్దు చేయడం వల్ల ఐ.సి.హెచ్.ఆర్. పాలక మండలిలో ఇప్పుడు 18 మంది చరిత్రకారులు మాత్రమే మిగిలారు.
“ఇండియన్ హిస్టారికల్ రివ్యూ” సలహా మండలిలో మన దేశంలోని చరిత్రకారులే కాక విదేశాలకు చెందిన ప్రముఖ చరిత్రకారులు కూడా ఉండడం ఆనవాయితీ. షికాగో యూనివర్సిటీ్కి చెందిన సతీశ్ చంద్ర, ముజఫ్ఫర్ ఆలం, అరిజోనా యూనివర్సిటీకి చెందిన రిచర్డ్ ఎం ఈటన్, లండన్ స్కూల్ ఆ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ కు చిందిన బి ఆర్ టోమిసన్, అమృత్సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ జె.ఎస్. గ్రెవాల్ మొదలైన వారు ఉండే వారు.
సలహా మండలి సభ్యులు ఈ పత్రికను ప్రచురించడంలో క్రియాశీలమైన పాత్ర పోషించక పోయినా వారు కొన్ని గ్రంథాలను సమీక్షించే వారు. ప్రసిద్ధ చరిత్రకారులు సలహా మండలిలో ఉండడం వల్ల ఆ పత్రిక గౌరవం పెరుగుతుంది. సలహా మండలి రద్దు చేయాలన్న ప్రతిపాదనను ఐ.సి.హెచ్.ఆర్. కార్యదర్శి గోపీనాథ్ రవీంద్రన్ వ్యతిరేకించారు. అంటే రేపో మాపో వీలైతే ఆయనకూ ఉద్వాసన తప్పక పోవచ్చు. లేదా బలవంతాన రాజీనామా చేసే పరిస్థితి రావచ్చు. రవీంద్రన్ “ఇండియన్ హిస్టారికల్ రివ్యూ” పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తారు. రవీంద్రన్ దిల్లీలోని జామియా మిలియ ఇస్లామియా యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఐ.సి.హెచ్.ఆర్. అధిపతి వై. సుదర్శన్ రావు మాత్రం సలహా మండలిని మార్చడం పత్రిక సంపాదక వర్గానికి ఉన్న హక్కు అంటున్నారు. “ఇందులో అసాధారణమైంది గానీ, తప్పు గానీ ఏమీ లేదు” అని ముక్తాయించారు.
ఐ.సి.హెచ్.ఆర్. కు సుదర్శన్ రావు నేతృత్వం వహించడం మొదలైన తర్వాత ఇలాంటి భారీ మార్పులు ఏవో జరగొచ్చునన్నది ఊహించిన విషయమే. ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు సవ్యసాచి భట్టాచార్య సెప్టెంబర్ లో రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాకు నిర్దిష్టమైన కారణాలు చెప్పకపోయినా ఐ.సి.హెచ్.ఆర్. పయనిస్తున్న దిశ ఆయనకు నచ్చలేదని పత్రికలలో వార్తలొచ్చాయి. ఆయన స్థానంలో ప్రొఫెసర్ దిలీప్ చక్రవర్తి నియమితులయ్యారు.
అంతకు ముందు అక్టోబర్ ఆరంభంలో ప్రభుత్వం ప్రతిష్ఠాకరమైన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, గ్రంథాలయం పునర్వ్యవస్థీకరణ ప్రారంభించింది. ఈ సంస్థ చరిత్ర, సామాజిక శాస్త్రాలలో చాలా ప్రతిష్ఠాకరమైంది. ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించడం అంటే ప్రభుత్వం దృష్టిలో దేశ చరిత్రను తిరగ రాయడమే. బీజేపీ నెహ్రూ మీద దుమారం రేపిన వైనాన్ని పరిశీలిస్తే నెహ్రూ మ్యూజియం రూపు రేఖా విలాసాలు ఎలా మారతాయో సులభంగానే ఊహించవచ్చు. భారత చరిత్రలో నెహ్రూకు సంబంధించిన సకల విషయాలను “ప్రక్షాళన” చేయడం కూడా మోదీకి ప్రీతిపాత్రమైన స్వచ్ఛ భారత్ లో భాగం కాబోలు! నెహ్రూ మ్యూజియంను పరిరక్షించడం నెహ్రూ మీద ఇష్టాయిష్టాలకు పరిమితం చేయడం దారుణం. దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను బేరీజు వేయడంలో తప్పులేదు. ఆయన చేసిందల్లా పొరపాటేనని వాదించే వారిని ఎటూ నిలవరించలేక పోవచ్చు. కాని నెహ్రూ తీన్ మూర్తి భవన్ లో నివసించారన్న వాస్తవాన్ని విస్మరించడం సాధ్యం కాదేమో! నెహ్రూ మ్యూజియంను భారత ప్రజాస్వామ్య పరిణామంలో పాత్ర నిర్వహించారనుకుంటున్న వారికి కూడా స్థానం కల్పించే “పరిపాలనా మ్యూజియం” గా మార్చాలని ప్రయత్నించడం నెహ్రూకు తీన్ మూర్తి భవన్ తో ఉన్న బంధాన్ని తెంపేసే ప్రయత్నమే.
నెహ్రూ దృక్పథంలో ఉన్న చరిత్రను తెరమరుగు చేయడానికి స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఇంతకు ముందు స్థానం దక్కని వారిని ప్రతిష్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చరిత్రను విరూపం చేయడమే. చరిత్రను తమ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చడానికి సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే. బిజేపీకి అనువైనట్టుగా చరిత్రను మార్చడానికి ఉద్దేశపూర్వక ఎత్తుగడలు సాగుతున్నాయి. సింధు నాగరికతకు ముందు కేవలం హిందువులు మాత్రమే ఉండే వారని చెప్పడానికి సాహసిస్తున్నారు. ఘర్ వాపసి, లవ్ జిహాద్, ముస్లింల మీద దాడులు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే గత చరిత్రకు ఏ రంగు పులమాలని చూస్తున్నారో స్పష్టమవుతుంది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మ దినాన్ని నిర్వహించడం వెనక ఉన్నదేమిటో సులువుగానే పసిగట్టొచ్చు.
నెహ్రూ స్మారక మ్యూజియం ఇంతవరకు పక్షపాత రహితంగానే వ్యవహరించింది. ఇక మీదట అది చరిత్రలో భాగంగా కూడా కనిపించకపోవచ్చు. నెహ్రూ స్మృతి దినోత్సవాలను నిర్వహించడానికి ఆ సంస్థను వినియోగించుకున్న సందర్భాలు ఉండొచ్చు. కాని ఆ ప్రాంగణంలోంచి కాంగ్రెస్ వ్యతిరేక ధ్వనులు కూడా ప్రతిధ్వనించాయి. లేని చరిత్రను సృష్టించే క్రమంలోనే ఇదంతా జరుగుతోంది. దిల్లీలోని షాజహాన్ రోడ్డు పేరు దశరథ్ మాంఝీ గాను, ఔరంగజేబ్ రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చడం కూడా వక్రీకరణల ద్వారా చరిత్రను పునర్లిఖించడంలో భాగమే. నెహ్రూకు సంబంధించిన పత్రాలను జాతీయ ప్రాచ్య లిఖిత భండాగారానికి మార్చాలని ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తలపెట్టింది. నెహ్రూ మ్యూజియం, లైబ్రరీలోని విలువైన సామాగ్రిని చిందరవందర చేయడం, స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములు కాని వారిని ఆ ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని అనుకోవడం భావి తరాలకు అసలైన చారిత్రక ఆధారాలు దొరక్కుండా చేయడమే. పాలక వర్గాలకు నచ్చిన అంశాలకే చరిత్రను పరిమితం చేయడమే. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనేమో!
– ఆర్వీ రామారావ్