ఏపీ రాజధానిలో చైన్ స్నాచర్స్ చేతివాటం
రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు, అమరావతిలో గొలుసు దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. మహిళలు రోడ్లపై కనిపిస్తే చాలు.. చైన్ దొంగలు రెచ్చిపోతూ తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అసలేం చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారుతోంది. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి బందోబస్తు, వీవీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు ఈ చోరీలపై దృష్టిపెట్టకపోవడం, కనీసం నియంత్రించే దిశగా చర్యలు తీసుకకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పోలీసుల వైఖరిని ఉదాసీనంగా తీసుకుంటున్న చైన్ స్నాచర్లు వ్యూహాత్మకంగా గొలుసు దొంగతనాలను విచ్చలవిడిగా […]
రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు, అమరావతిలో గొలుసు దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. మహిళలు రోడ్లపై కనిపిస్తే చాలు.. చైన్ దొంగలు రెచ్చిపోతూ తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అసలేం చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారుతోంది. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి బందోబస్తు, వీవీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు ఈ చోరీలపై దృష్టిపెట్టకపోవడం, కనీసం నియంత్రించే దిశగా చర్యలు తీసుకకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పోలీసుల వైఖరిని ఉదాసీనంగా తీసుకుంటున్న చైన్ స్నాచర్లు వ్యూహాత్మకంగా గొలుసు దొంగతనాలను విచ్చలవిడిగా చేసుకుపోతున్నారు.
విజయవాడలో నెలకు 20 నుంచి 25 చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. గుంటూరులో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు గొలుసు దొంగల పట్ల అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీఎస్, బ్లూకోట్స్ టీమ్ లతోపాటు మఫ్టీల్లో నిఘా పెడుతున్నారు. చైన్ స్నాచింగ్ లు అధికంగా జరిగే ప్రాంతాల్లో కీలక సమయాల్లో పహారా కాస్తున్నారు. అయినా గుంటూరులో నెలకు 10 వరకు గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. కొద్దినెలల క్రితం రోజుకూ 3 నుంచి 4 చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగేవి. దీంతో ఆభరణాలు ధరించి బయటకు రావడానికి మహిళలు జంకే పరిస్థితి నెలకొంది.
గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ మొదలు పెట్టినప్పటి నుంచి విజయవాడ, గుంటూరు నగరాల్లో వీవీఐపీల పర్యటనలు అధికమయ్యాయి. దీంతో పోలీసులు వీవీఐపీల భద్రత, సభలు, సమావేశాలు, బందోబస్తులు, వివిధ పార్టీల ఆందోళన, ఇతర సేవల్లో పోలీసులు తరిస్తుండగా, దీన్నంతటిని క్యాష్ చేసుకునేలా చైన్ చోరులు తెగబడిపోతున్నారు.
రాజధాని అయ్యాక తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్నారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని ఒక్కో స్టేషన్ సీఐ ఆయన ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తుండడంతో సిబ్బంది సమస్యలు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం నగరంలో పోలీసులంతా బందోబస్తు హడావుడిలో ఉండగా, కేవలం గంట వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగులు జరగడంతో హాట్ టాపిక్ కు తెరతీసింది.
ఒకపక్క వీఐపీల సందడి, మరోపక్క రాజధాని హడావుడిలో తలమునకలవుతున్న పోలీసులకు సవాల్ గా మారుతున్న చైన్ స్నాచర్స్ ఆగడాలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు పోలీసులు ఏ తరహా చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారో వేచిచూడాల్సి ఉంది.