పోటీపడుతున్నారా...పొంచి ఉంది ముప్పు
వేగం…టెక్నాలజీ…అభివృద్ధి అంటే ఇవే కదా…ఒక దేశం అభివృద్ధి చెందుతుంటే ఇవి రెండూ తప్పకుండా పెరుగుతాయి. మరి దేశంలో ఈ రెండూ పెరిగిపోతే అక్కడ నివసించే మనుషుల్లో ఎలాంటి మార్పు వస్తుంది…ఈ ప్రశ్నకు జపాన్ రచయిత్రి బనానా యోషిమొటో చెబుతున్న సమాధానం…ఒంటరితనం పెరిగిపోతుందని. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకాల రచయిత్రి బనానా. 1988లో ఆమె రాసిన మొదటి నవల కిచెన్ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయింది. వేగవంతమైన జీవితంలో పడి కొట్టుకుపోతున్న జపాన్ యువతకి తన రచనలు, జీవితం […]
వేగం…టెక్నాలజీ…అభివృద్ధి అంటే ఇవే కదా…ఒక దేశం అభివృద్ధి చెందుతుంటే ఇవి రెండూ తప్పకుండా పెరుగుతాయి. మరి దేశంలో ఈ రెండూ పెరిగిపోతే అక్కడ నివసించే మనుషుల్లో ఎలాంటి మార్పు వస్తుంది…ఈ ప్రశ్నకు జపాన్ రచయిత్రి బనానా యోషిమొటో చెబుతున్న సమాధానం…ఒంటరితనం పెరిగిపోతుందని. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకాల రచయిత్రి బనానా. 1988లో ఆమె రాసిన మొదటి నవల కిచెన్ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయింది. వేగవంతమైన జీవితంలో పడి కొట్టుకుపోతున్న జపాన్ యువతకి తన రచనలు, జీవితం అంటే ఏమిటో కాస్తయినా చెప్పాలని ఆమె ఆశిస్తున్నారు. తాను ఇప్పుడు యవ్వనంలో ఉండిఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్నంటూ జపాన్‌లో నెలకొని ఉన్న విపరీత సామాజిక పరిస్థితులను వివరిస్తున్నారు. వేగం, టెక్నాలజీ…మనదేశం కూడా ఈ దిశగానే పరుగులు తీస్తోంది. ఇప్పటికే మన యువత సైతం మానసిక ఒంటరితనానికి గురవుతున్నారు. అందుకే బనానా మాటలు మనమున్న పరిస్థితులకూ ఎంతోకొంత అద్దం పడుతున్నాయి.
బనానా అసలు పేరు మహోకో. అరటి పువ్వులోని ద్విలింగ లక్షణాలు నచ్చి ఆమె తన పేరుని బనానాగా మార్చుకున్నారు. అలాగే తన రచనల్లోనూ స్త్రీ పురుషులను వారి జెండర్‌ని బట్టి వివిధ అంశాల్లో విడగొట్టి చూడడాన్ని వ్యతిరేకించారామె. ఆమె ఆలోచనల్లోని కొన్ని అంశాలు ఆమె మాటల్లోనే-
- మగ ఆలోచలు, ఆడ ఆలోచనలు…ఇలా విడగొట్టడం భావ్యం కాదు. ఆలోచనలకు, మనసులకు లింగవివక్ష ఉండదు….మనిషిలోని అంతరంగానికి ఈ వివక్షని అంటగట్టలేము. నా కాలేజి రోజుల్లో నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు. అమ్మాయిల్లో అబ్బాయిల ఆలోచనలు, అలాగే అబ్బాయిలు అమ్మాయిల్లా ఆలోచించడం నేను గమనించాను. అందుకే మనిషి ఎలా కనబడుతున్నాడు అనే విషయం కంటే అతను లేదా ఆమెలో ఉన్న స్వీయ లక్షణాలను చూడటం, వ్యక్తిగా గుర్తించడం మంచిదని నేను భావిస్తాను. నా రచనలు నా ఆలోచనలను ప్రతిబింబిస్తాయి.
- జపాన్లో యువతరం పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది (గత ఏడాది రోజుకి సగటున 70 ఆత్మహత్యలు జరిగాయి). ఇప్పుడు జపాన్ ప్రజల్లో అన్నీ పోగట్టుకున్న భావన బలంగా ఉంది. ఇప్పుడు నేను యువతిగా ఉండి ఉంటే నేనూ ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. నేను పూర్తిగా ఈ పరిస్థితిని ఆపేయగలనని చెప్పడం లేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి నా రచనని చదివి కనీసం పదినిముషాలు లేదా ఒక రాత్రి ఆత్మహత్యని వాయిదా వేసుకోవచ్చేమో. అయితే అందువలన వారి ఆలోచనలు మారే అవకాశం కలుగుతుందేమో అనేదే నా ఆశ.
- జపాన్ చాలా వేగంగా మారుతోంది. అత్యంత వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ వేగంతో పోటీపడలేని వారిని వెనక్కు నెట్టేస్తున్నారు. అలా పోటీపడలేక వెనకపడిపోయినవారు తామని తాము సమాజంలో ఇమడలేని ఏకాకులుగా భావిస్తున్నారు. ఇది వారిలో అశాంతి అసహనాలను కలిగిస్తోంది. జపాన్లోని అన్ని జనరేషన్ల జనం ఇప్పుడు ఈ అశాంతిని అనుభవిస్తున్నారు. ఎందుకంటే వేగం పోటీతత్వం అలా ఉన్నాయి.
- బనానా మాటలు విన్నతరువాత వేగం, టెక్నాలజీ మనుషులను ఏకాకులుగా ఎలా మార్చివేస్తుంది…అనేందుకు ఓ చిన్న వాస్తవ ఉదాహరణని చూద్దాం-
- పదేళ్ల క్రితం ఇంటర్ కలిసి చదువుకున్న ఎనిమిది మంది కుర్రాళ్లు చాలా స్నేహంగా కలిసిమెలసి ఉండేవారు. అంతా మధ్యతరగతికి చెందినవారే. అందరి కుటుంబ పరిస్థితులూ ఒక్కటే. ఇంటర్ తరువాత అందరూ బి టెక్‌లో చేరారు. అందులో నలుగురు మంచి ఉద్యోగాలు వచ్చి విదేశాలకు వెళ్లిపోయారు. ఇద్దరు బెంగళూరు వెళ్లి విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకరు తమ తండ్రి వ్యాపారంలో స్థిరపడ్డారు. ఒక్కరు మాత్రం పరిస్థితులు అనుకూలించక, తగిన తెలివితేటలు, వేగం చూపలేక ఓ చిన్నపాటి కాలేజిలో లెక్చరర్‌గా స్థిరపడ్డారు. ఇప్పుడు అతను విపరీతమైన మానసిక ఒంటరితనంలో ఉన్నాడు.
ప్రపంచంలో అంతా ముందుకు పరుగులు తీయకపోవచ్చు. కానీ తన ప్రపంచంలో ఉన్న మిగిలిన ఏడుగురు మాత్రం ఆ పరుగుపోటీలో విజయం సాధించారు. కనుక తన పోలిక వారితోనే. అందుకే తాను వెనుకబడిపోయినట్టుగా అతను ఫీలవుతున్నాడు. సబ్జక్టు నాలెడ్జి పెంచుకుని అతను మంచి లెక్చరర్‌గా రాణించే అవకాశం ఉన్నా, ఇప్పుడు అలాంటి కృషి చేయడానికి, అతని మనసు అంగీకరించడం లేదు. జీవితంలో తనకున్న ప్లస్‌లను గుర్తించే స్థితిలో అతను లేడు. పూర్తిగా ఓడిపోయాననే నిరాశతో ఉంటున్నాడు. ఏదోఒక రకంగా విదేశీ అవకాశం దొరికితే బాగుండునని ఎదురుచూస్తున్నాడు. తన స్నేహితులతో పంచుకునేందుకు అతనికి విషయాలు ఉండటం లేదు. వారి నుండి తాను విడిపోయిన భావాన్ని బాధని అనుభవిస్తున్నాడు. మొత్తానికి ఒక సగటు మనిషి సంతృప్తిగా బతకగల ఉద్యోగంలో ఉన్నా పూర్తి నిరాశా నిస్పృహల్లో, ఒంటరితనంలో ఉన్నాడు. తానెందుకూ పనికిరాను అనే భావంలో ఉన్నాడు. పరిశీలిస్తే మన చుట్టూ ఇలాంటి ఏకాకులు చాలామందే కనబడతారు. మనదేశంలో ఉన్న ఈ పరిస్థితులకూ, బనానా పేర్కొన్న జపాన్ పరిస్థితులకు పెద్దగా తేడా లేదనిపిస్తోంది కదూ!
-వి.దుర్గాంబ