చనిపోవడానికి గది దొరికే హాస్టల్
ఎవరైనా జీవితం కొనసాగించడానికి హాస్టల్లో ఉంటారు. కానీ వారణాసిలో ఉన్న ముక్తి భవన్ అనే హాస్టల్లాంటి ఓ భవన సముదాయంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే గది దొరుకుతుంది. పూర్వకాలం నుండి కాశీలో, గంగానది సమీపంలో ప్రాణాలు పోతే మోక్షం లభిస్తుందనే నమ్మకం హిందువుల్లో ఉంది. అలా ఆశించే, అవసాన దశలో అక్కడకు చేరుతుంటారు చాలామంది. అన్ని బాధ్యతలు తీరాక, పరమేశ్వరుని సన్నిధిలో మోక్షం పొందాలనే కోరికతో వెళతారు కనుకనే కాశీకి వెళ్లినవారు తిరిగి రారనే నానుడి […]
ఎవరైనా జీవితం కొనసాగించడానికి హాస్టల్లో ఉంటారు. కానీ వారణాసిలో ఉన్న ముక్తి భవన్ అనే హాస్టల్లాంటి ఓ భవన సముదాయంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే గది దొరుకుతుంది. పూర్వకాలం నుండి కాశీలో, గంగానది సమీపంలో ప్రాణాలు పోతే మోక్షం లభిస్తుందనే నమ్మకం హిందువుల్లో ఉంది. అలా ఆశించే, అవసాన దశలో అక్కడకు చేరుతుంటారు చాలామంది. అన్ని బాధ్యతలు తీరాక, పరమేశ్వరుని సన్నిధిలో మోక్షం పొందాలనే కోరికతో వెళతారు కనుకనే కాశీకి వెళ్లినవారు తిరిగి రారనే నానుడి ఉంది. వారణాసిలో అలాంటి వారికి ఆశ్రయం ఇస్తోంది ముక్తి భవన్. సాధారణంగా ఏ హాస్టలైనా, హోటలైనా గదిని అద్దెకు ఇచ్చేటపుడు… ఎన్నాళ్లు ఉంటారు… అనే ప్రశ్న వస్తుంది. కానీ ముక్తి భవన్‌లో గదిని కోరేవారిని ఎన్నాళ్లు బతికుంటారు…. అనే ప్రశ్న వేయాల్సిన పరిస్థితి. వినేందుకు వింతగా, విషాదంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఇక్కడ గది తీసుకున్న తరువాత రెండువారాల్లోగా ఆ వ్యక్తి మరణించాలి. అలా కాకపోతే ఆ గదిని ఖాళీ చేయించి మరొకరికి ఇచ్చేస్తారు. ఆత్మహత్యలు, మెర్సీ కిల్లింగ్ లాంటివి కాదు…… వ్యాధులతోనూ, వృద్ధాప్యంతోనూ మరణానికి అత్యంత చేరువలో ఉన్నవారు మాత్రమే, ప్రశాంతంగా మరణించడానికే ఇక్కడ గదిని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉన్న వృద్ధులకు గదిని ఇవ్వరు.
ముక్తి భవన్‌లో పన్నెండు గదులుంటాయి. ఓ చిన్న గుడి, పూజారీ ఉంటారు. బంధువులు, సన్నిహితులు లేనివారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ముక్తిభవన్ హాస్టల్ మేనేజర్ భైరవ్‌నాథ్ శుక్లా అక్కడ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంటారు. ఆయన 44 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. వారి కుటుంబం సైతం ముక్తిభవన్ కాంపౌండ్లో ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటోంది.
ఏటా వేలమంది ముక్తిభవన్‌కి వస్తుంటారు. చలికాలం ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే మరణాల సంఖ్య కూడా అ ధికంగా ఉంటుంది. వేసవిలో తగ్గుతుంది. ఇక్కడ మరణించిన వారి అంత్యక్రియలకు సంబంధించిన సంస్కారాలను నిర్వహించేవారు అందుబాటులో ఉంటారు. ఏదిఏమైనా ముక్తిభవన్లో కనిపించే దృశ్యాలు మనిషి అంతిమదశలోని జీవన చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. జీవితంలోని చివరిమజిలీని ఆమోదించితీరాల్సిన అనివార్యతని సైతం అక్కడ చూడవచ్చు.