Telugu Global
Others

చంద్రబాబుకు లంక భూముల తలనొప్పి

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని లంక, అసైన్డ్ భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేయటం చర్చనీయాంశం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. మీడియాలో వచ్చిన కథనాల సారాంశంతో ఆగమేఘాలమీద రిజిస్ట్రేషన్ల ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి నివేదిక కోరారని సమాచారం. ఇది సబ్ రిజిస్ట్రార్ల మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి విజయవాడలో రిజిస్ట్రేషన్ల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆ సమావేశంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్ల అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. నిషేధిత భూములకు కూడా […]

చంద్రబాబుకు లంక భూముల తలనొప్పి
X

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని లంక, అసైన్డ్ భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేయటం చర్చనీయాంశం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. మీడియాలో వచ్చిన కథనాల సారాంశంతో ఆగమేఘాలమీద రిజిస్ట్రేషన్ల ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి నివేదిక కోరారని సమాచారం. ఇది సబ్ రిజిస్ట్రార్ల మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవల ముఖ్యమంత్రి విజయవాడలో రిజిస్ట్రేషన్ల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆ సమావేశంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్ల అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. నిషేధిత భూములకు కూడా ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వానికి చికాకులు తెచ్చి పెడుతున్నారని ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. నిన్న మొన్నటి వరకు ఏపీ రాజధాని భూముల వ్యవహారం, ఇటు బందరు పోర్టు, అటు విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయం, విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు కు కావాల్సిన భూముల వ్యవహారం టీడీపీ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. నేడు తాజాగా లంక, అసైన్డ్ భూముల వ్యవహారం తీవ్రదుమారం రేపడంతోపాటు ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది. లంక భూముల వ్యవహారంపై సీఎం జోక్యం చేసుకోవడంతో అప్రమత్తమైన రిజిస్ట్రేషన్ల ఐజీ అసలేం జరిగిందో నివేదిక అందజేయాలని గుంటూరు జోన్ డీఐజీ బి.సూర్యనారాయణను కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడికొండ, అమరావతి, గుంటూరు ఆర్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజులను పరిశీలించారు.
మంగళగిరిలో అత్యధికం..
మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యధికంగా ఈ లావాదేవీలు జరిగినట్లు డీఐజీతోపాటు గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ఓ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత తాడికొండ, అమరావతి, గుంటూరు ఆర్వో కార్యాలయాల్లో నామమాత్రంగా జరిగినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా లంక, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు కోరుతూ వచ్చిన డాక్యుమెంట్లు..? వాటిల్లో కోర్టు ఉత్తర్వులతో ఎన్నిటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు..? కోర్టు ఉత్తర్వులు లేవని.. నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి ఎన్ని తిరస్కరించారో సమగ్ర డిటైల్డ్ నివేదికను రూపొందించి హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లారని సమాచారం. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రెండు నెలల నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లు కోరుతూ 300కుపైగా డాక్యుమెంట్లు వచ్చినట్లు సమాచారం. తాడికొండ, అమరావతి, గుంటూరు ఆర్వో కార్యాలయాలకు మరో 70 డాక్యుమెంట్లు వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రభుత్వానికి భారం..
రాజధాని నేపథ్యంలో లంక, అసైన్డ్ భూములకు రెక్కలొచ్చాయి. ఈ భూములపై కొందరు పెద్దల కన్ను పడింది. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో కొన్నేళ్లుగా అసైన్డ్, లంక భూములను సాగు చేసుకుంటున్న లబ్ధిదారుల నుంచి వాటిని చేజిక్కించుకునే ప్రయత్నాలు బాగా ఊపందుకున్నాయి. ఈ భూములను వారి నుంచి చేజక్కించుకుంటే ప్రభుత్వమిచ్చే ప్యాకేజీతో బాగా లాభపడొచ్చని కొందరు భావించి వాటి రిజిస్ట్రేషన్లకు గత కొన్ని రోజులుగా చురుగ్గా పావులు కదిపారు. అయితే ఈ భూమల రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్లపై తీవ్రమైన ఒత్తిళ్లు రావడం శోచనీయం.
లిఖితపూర్వక నోటీసులే వరం..
లంక, అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ల శాఖ పుస్తకాల్లో నిషేధిత జాబితాలో ఉంటాయి. వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు. చట్ట ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్ కోరుతూ డాక్యుమెంట్ సమర్పిస్తే దానికి కచ్చితంగా చలానా తీయాలి. ఇలా చలానా తీసినపుడు ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే దాన్ని లిఖితపూర్వకంగానే తెలియచేయాలి. ప్రస్తుతం లంక, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అధికారులు ఇస్తున్న లిఖితపూర్వక తిరస్కరణ పత్రమే లబ్ధిదారులకు వరంగా మారుతోంది. తాము ఎన్నో ఏళ్ల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నామని దానికి ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చిందని ఆర్థిక అవసరాలకు దాన్ని విక్రయించుకోవటానికి రిజిస్ట్రేషన్ల అధికారులు రిజిస్ట్రేషన్ చేయటం లేదని కోర్టుకెళ్తున్నారు. దీంతో కోర్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొందరి విషయంలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశిస్తోంది. కోర్టు ఆర్డర్లు పెద్ద సంఖ్యలో వస్తున్న విషయాన్ని సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు చేయడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. లంక, అసైన్డ్ భూములు కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే రాజధాని భూ సమీకరణ నేపథ్యంలో అప్రమత్తమై వాటిని కాపాడుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించేదని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి రిజిస్ట్రేషన్లు చేయటాన్నే తాజాగా ప్రభుత్వం తప్పుపడుతోందని రిజిస్ట్రేషన్ల అధికారులలో వ్యక్తమవుతోంది. ఈ నిర్వాకంపై శాఖ ఐజీ స్పందననుబట్టి ఈ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ అధికారుల్లో లంక, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయటం.. కొన్ని డాక్యుమెంట్లను రోజుల తరబడి పెండింగ్ ఉంచడం వణుకు పుట్టిస్తోంది.

First Published:  3 Nov 2015 10:47 AM IST
Next Story