Telugu Global
Others

జోగయ్య ఎఫెక్ట్- మొదలైన బాబు మార్క్ రాజకీయం

వంగవీటి రంగా హత్య జరిగి పాతికేళ్లు దాటడంతో ఆ గాయం మానిపోతూ వచ్చింది. 25 ఏళ్ల గ్యాప్ కావడంతో రంగా హత్యోదంతం, దాని తీవ్రత గురించి నేటి కాపు యువతకు నేరుగా తెలియదు. ఇలాంటి అంశాలు కలిసివచ్చే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కాపుల మద్దతు రాబట్టుకోగలిగారు. కానీ సీనియర్ నేత హరిరామజోగయ్య పుస్తకంతో నాటి నిప్పు మళ్లీ రాజుకుంది. రంగా హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబేనని జోగయ్య నేరుగా చెప్పేయడంతో కాపులు అందులోనూ ఆ సామాజికవర్గం […]

జోగయ్య ఎఫెక్ట్- మొదలైన బాబు మార్క్ రాజకీయం
X

వంగవీటి రంగా హత్య జరిగి పాతికేళ్లు దాటడంతో ఆ గాయం మానిపోతూ వచ్చింది. 25 ఏళ్ల గ్యాప్ కావడంతో రంగా హత్యోదంతం, దాని తీవ్రత గురించి నేటి కాపు యువతకు నేరుగా తెలియదు. ఇలాంటి అంశాలు కలిసివచ్చే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కాపుల మద్దతు రాబట్టుకోగలిగారు. కానీ సీనియర్ నేత హరిరామజోగయ్య పుస్తకంతో నాటి నిప్పు మళ్లీ రాజుకుంది. రంగా హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబేనని జోగయ్య నేరుగా చెప్పేయడంతో కాపులు అందులోనూ ఆ సామాజికవర్గం యువత రగిలిపోతోంది.

తమ లీడర్‌ను హత్య చేయించింది చంద్రబాబా అని కాపు యువత ఉడికిపోతున్నారు. పరిస్థితి దిష్టిబొమ్మలు, ఆందోళన వరకు వెళ్లింది. దీంతో చంద్రబాబు తనలోని మేనేజ్‌మెంట్‌ బాబును మళ్లీ బయటకు తీసినట్టుగా కనిపిస్తోంది. హఠాత్తుగా కాపుల రిజర్వేషన్‌ రాగం ఎత్తుకున్నారు. ఆగమేఘాల మీద కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఓకే చేసింది చంద్రబాబు మంత్రివర్గం. జోగయ్య పుస్తకం చంద్రబాబును ఎంతగా ఉలికిపాటుకు గురిచేసిందో తెలుసుకునేందుకు టీడీపీ అనుకూల పత్రికను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మంగళవారం ఎడిషన్‌లో సదరు పత్రిక ఏకంగా ”బీసీలుగా కాపులు” అంటూ మొదటి పేజీలో తాటికాయంతా అక్షరాలతో(ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో) హెడ్‌లైన్ పెట్టేసింది. కేబినెట్ నిర్ణయం తీసుకుందని… దీంతో రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, బీసీలకు అన్యాయంచేయకుండా ముందుకెళ్లనున్నారంటూ భవిష్యత్తును ఈరోజే చూపించేసింది. టీడీపీ అనుకూల టీవీ చానళ్లు కూడా బాబుకు ఏ తప్పు తెలియదన్న నేతల ప్రకటనలనే పదేపదే ప్రసారం చేయడం కూడా చంద్రబాబు మేనేజ్‌మెంట్‌లో భాగమేనని నేతలు చెప్పుకుంటున్నారు.

కాపు యువత మరింత ఆగ్రహించకముందే రిజర్వేషన్ల పేరుతో వారిని కూల్‌ చేసేందుకు వేసిన ఎత్తుగడ అని చెబుతున్నారు. ఏడాదిన్నరగా రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని, కాపు కార్పొరేషన్ ఏమైందని కాపు సామాజికవర్గం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని చంద్రబాబు హఠాత్తుగా ఈ రేంజ్‌లో స్పందించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా హరిరామజోగయ్య పుస్తక ప్రభావమేనని చెబుతున్నారు. పైగా రంగా హత్య ఓ పాత గాయం అంటూ టీడీపీ నేతలు ఎదురు ప్రచారం మొదలుపెట్టారు. ఇలా చేయడం ద్వారా పాత గాయంపై కారం చల్లి అనవసర ఉద్రిక్తతలను రేపుతున్నారంటూ తప్పంతా హరిరామజోగయ్యపైకే నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే అమరావతి శంకుస్థాపనకు పవన్‌ను నేరుగా సీఎం వెళ్లి ఆహ్వానించకపోవడంపై కాపులు గుర్రుగా ఉన్నారు. ఈ టైమ్‌లో రంగాను హత్య చేయించింది కూడా తానేనన్న ప్రచారం రాజకీయంగా తీవ్ర నష్టం కలిగిస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి జోగయ్య దెబ్బకు కాపులకు కార్పొరేషన్ వచ్చింది.

First Published:  3 Nov 2015 3:29 PM IST
Next Story