విభజన నుంచి పాఠాలు నేర్చుకోని చంద్రబాబు: ధర్మాన
హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. హైదరాబాద్ ఒక్క రాజకీయ రాజధానిగానే కాకుండా ఆర్ధికంగా అత్యంత బలోపేత ప్రాంతంగా ఉందని, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలతోపాటు రక్షణ పరిశోధన వంటి కీలకమైన రంగాలన్నీ ఇక్కడే ఉండడం వల్లే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, మళ్ళీ ఇటువంటి తప్పిదాన్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం నిర్మితమైనట్టు దేశంలో ఏ రాజధాని నగరం […]
హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. హైదరాబాద్ ఒక్క రాజకీయ రాజధానిగానే కాకుండా ఆర్ధికంగా అత్యంత బలోపేత ప్రాంతంగా ఉందని, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలతోపాటు రక్షణ పరిశోధన వంటి కీలకమైన రంగాలన్నీ ఇక్కడే ఉండడం వల్లే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, మళ్ళీ ఇటువంటి తప్పిదాన్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం నిర్మితమైనట్టు దేశంలో ఏ రాజధాని నగరం లేదని, ఇప్పటికైనా కళ్ళెదుట సాక్షాత్కారమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్నీ అమరావతిలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని ధర్మాన సూచించారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్ధిక వనరుగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు 1990 మధ్య వరకు దేశమంతా విస్తరించి ఉన్నాయని, దురదృష్టవశాత్తూ 90 శాతం ప్రభుత్వ రంగ పెట్టుబడులు హైదరాబాద్ నగరం, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోనే పెట్టారని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని, అన్ని జిల్లాలకు విస్తరించేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ఉదాహరణకు బీహెచ్‌ఈఎల్ హైదరాబాద్‌లో ఉంటే తమిళనాడులో తిరుచిలో, ఉత్తరప్రదేశ్‌లో మారుమూల ప్రాంతమైన హరిద్వార్‌లో పెట్టారని గుర్తు చేశారు. అలాగే హెచ్‌ఏఎల్ హైదరాబాద్‌లో ఉంటే ఒరిస్సాలోని కోరాపుట్‌లో, మహారాష్ట్రలో నాసిక్‌లో, అలాగే ఐడిపిఎల్, హెచ్‌ఎంటి, ఈసీఐఎల్, బీఈఎల్, మిథాని, ఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌ఎండీసీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎఫ్‌డీబీ, డీఎంఆర్‌ఎల్, హెచ్‌సీఎల్, డీఆర్‌డీఎల్, డీఎల్‌ఆర్‌ఎల్, సీసీఎంబీ, ఐఐసీటీ, డీఆర్‌డీఓ విషయంలో కూడా ఇలాగే జరిగిందని… ఇలాంటి పరిస్థితి వల్లే రాష్ట్రం విడిపోయిందని, ఏపీకి అన్యాయం జరిగిందని, ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలోనే అన్ని రంగాలు, విభాగాలు ఉండకుండా వికేంద్రీకరణ లక్ష్యంగా ముందుచూపుతో వ్యవహరించాలని ధర్మాన హితవు చెప్పారు. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే అనర్థమని… అలా చేస్తే వేర్పాటు వాదానికి దారి తీస్తుందని టీడీపీ ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో ముందు చూపుతో వ్యవహరించాలని ఆయన టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా రాజధాని ప్రాంతంలో కేంద్రీకృతమయితే మళ్లీ సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన చెందారు. అభివృద్ధి అంతా ఓ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే… మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో పాఠాలు నేర్చుకోలేదా ? అని చంద్రబాబును ఈ సందర్భంగా ధర్మాన సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఉన్న ప్రయివేటు రంగ సంస్థలు కూడా 90 శాతం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచే వచ్చాయని, దశాబ్దాల తరబడి పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లోనే పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థల ఎగుమతులు 2013-14లో ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 57,000 కోట్లుంటే అందులో 56,000 కోట్లు ఒక్క హైదరాబాద్ నుంచే ఉన్నాయని ధర్మాన గుర్తు చేశారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎఫ్‌టీ, నల్సర్, సెంట్రల్ యూనివర్శిటీ, బిట్స్, టిస్, టిఐఎఫ్‌ఆర్ వంటి విద్యాసంస్థలు, కొన్ని ముఖ్యమైన హెల్త్‌కేర్ సంస్థలు కూడా హైదరాబాద్‌కే పరిమతమై పోయాయని, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి తేవద్దని ధర్మాన హెచ్చరించారు.
7420 చదరపు కిలోమీటర్ల అమరావతి పరిధి (సీఆర్‌డీఏ)లో పరిపాలన, చట్టసభలతోపాటు నవ రత్నాలుగా పేర్కొంటున్న వినోదం, పర్యాటకం, విద్య, న్యాయ వ్యవస్థ, ఎకానమీ, హెల్త్‌కేర్, నిర్మాణ రంగం, ఐటీ సంస్థలు ఒకేచోట ఏర్పాటు చేయడం సరికాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు ధర్మాన అన్నారు. ఈ ప్రతిపాదిత అమరావతి నగర నిర్మాణ నిర్ణయం సింగపూర్ కన్నా పది రెట్టు పెద్దదని, చెన్నై, న్యూయార్క్ కన్నా ఆరు రెట్లు పెద్దదని… ఇది వాంఛనీయం కాదని ధర్మాన చంద్రబాబుకు హితవు చెప్పారు. బంగారం లాంటి పంటలను నాశనం చేసి ఇప్పటికే 33,500 ఎకరాలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం… భూ దాహం తీరక 2013 భూ సేకరణ బిల్లుతో 50 నుంచి 60 వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. రాజధానిని కూడా వేరే దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థల డబ్బుతో నిర్మిస్తే అది ప్రజల రాజధాని ఎలా అవుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు గత ఆరు నెలల్లో రూ. మూడు వేల కోట్లు ఉందని స్వయంగా ఆర్థిక మంత్రే విన్నవించారని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు.