Telugu Global
Others

అరుంధతీ నక్షత్రం కనిపించదు

ముందు రచయితలు, కవులు ఆ తర్వాత సినిమా రంగ ప్రముఖులు. ఇప్పుడు శాస్త్రవేత్తలు. ఇలా ఆలోచనాపరులందరూ దేశంలో పెరిగిపోతున్న అసహనం, మతపరమైన ధాష్టీకం, అభ్యుదయ భావాలున్న వారిని ఏరికోరి హతమార్చడం, జనం ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశించడానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వీరందరూ నిరసన తెలియజేయడానికి తమకు ఇంతకు ముందు ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ నిరసన మతోన్మాదుల అకృత్యాలకు వ్యతిరేకమైంది మాత్రమే కాదు. కేవలం నిరసన తెలియజేసి చేతులు ముడుచుకు కూర్చోవడం వీరి అభిమతం […]

అరుంధతీ నక్షత్రం కనిపించదు
X

RV Ramaraoముందు రచయితలు, కవులు ఆ తర్వాత సినిమా రంగ ప్రముఖులు. ఇప్పుడు శాస్త్రవేత్తలు. ఇలా ఆలోచనాపరులందరూ దేశంలో పెరిగిపోతున్న అసహనం, మతపరమైన ధాష్టీకం, అభ్యుదయ భావాలున్న వారిని ఏరికోరి హతమార్చడం, జనం ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశించడానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వీరందరూ నిరసన తెలియజేయడానికి తమకు ఇంతకు ముందు ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ నిరసన మతోన్మాదుల అకృత్యాలకు వ్యతిరేకమైంది మాత్రమే కాదు. కేవలం నిరసన తెలియజేసి చేతులు ముడుచుకు కూర్చోవడం వీరి అభిమతం కాదు. నిరసన తెలియజేయడం ద్వారా ప్రజల చైతన్య స్థాయి పెంచి క్రమంగా ఆవహిస్తున్న ఫాసిస్టు ధోరణులను నిలవరించడానికి ప్రజలను సమాయత్తాం చేయాలనుకుంటున్నారు.

bhargavaప్రసిద్ధ రచయిత్రి నయన తారా సెహగల్ తన అవార్డును తిరిగి ఇచ్చి వేయడంతో మొదలైన ఈ నిరసన జ్వాలలు ఇప్పుడు శాస్త్రజ్ఞులను కూడా కర్తవ్యోన్ముఖుల్ని చేశాయి. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త డా. పి.ఎం. భార్గవ తన పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడంతో నిరసనోద్యమం పతాక స్థాయికి చేరుతోంది. భార్గవ పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇచ్చి వేయడానికి రెండు రోజుల ముందే దాదాపు వందమంది శాస్త్రవేత్తలు పరమత ద్వేషాన్ని, ఆహార అలవాట్లను నిర్దేశించే ప్రయత్నాలను, హేతువాదం, శాస్త్రీయ దృష్టిని చిదిమేయడానికి జరుగుతున్న “అమానుష, అనాగరక” ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం పంపించారు. మతాల వారిగా విడిపోయిన సమాజం పేలడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబులాంటిదని ఈ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

మన రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, సాహితీవేత్త భూపాల్ సైతం కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను వెనక్కిచ్చేసి తమ ఆత్మఘోష వెల్లడించారు.

వివిధ రంగాలలో ఎన్నదగిన కృషి చేసినందుకు గుర్తుగా ప్రభుత్వాలు ఇచ్చిన అపురూపుమైన అవార్డులను వెనక్కిచ్చేయడం అంటే బాధాకరమైన విషయమే. “ప్రభుత్వం మతాన్ని వ్యవస్థీకృతం చేస్తూ, స్వేచ్ఛను హరిస్తూ, శాస్త్రీయ స్ఫూర్తికు నిగళాలు వేస్తుంటే పద్మ భూషణ్ అవార్డును ఉంచుకోలేనని పి.ఎం. భార్గవ ప్రకటించారు. బయో టెక్నాలజీ రంగంలో ఆయన ప్రపంచ ప్రసిద్ధుడైన శాస్త్రవేత్త. హైదరాబాద్ లో అద్భుతమైన పరిశోధనాఫలితాలు అందిస్తూ సమాజ పురోగమనానికి దోహదం చేస్తున్న సి.సి.ఎం.బి. వ్యవస్థాపకుడు ఆయనే. శాస్త్రీయ స్ఫూర్తిని పెంపందించడం కేసమే ఆయన తన జీవితకాలాన్నంతా వెచ్చించారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల ఏర్పాటుకు అష్టకష్టాలూ పడ్డారు. ఆ క్రమంలో కుటిల రాజకీయలకు భార్గవ బలి కాక తప్పలేదు. అయినా విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం అలవరచడానికి ఆయన ఎత్తిన జెండా దించలేదు.

మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న వారు అధికారం దక్కిన తర్వాత మత తత్వ ఎజెండా అమలు చేయడానికి నానావిధ పద్ధతులు అనుసరిస్తున్నారు. చరిత్రను, పాఠ్యపుస్తకాలను తిరగ రాస్తున్నారు. చరిత్ర పరిశోధనలో మతతత్వాన్ని, తిరోగమన భావాలను జొప్పించడం కోసం జాతీయతా వాద మంత్రజపం చేస్తూ అయిన వారికి చరిత్ర పరిశోధనా సంస్థ అగ్రసానాధిపత్యం కట్టబెట్టారు. భారత సినిమా టీవీ సంస్థకు అధిపతిగా అర్హతలు లేకపోయినా తమ వాడిని ప్రతిష్టించారు. దీనికి నిరసనగా ఆ సంస్థ విద్యార్థులు 139 రోజులపాటు ఆందోళన చేసినా ఏలిన వారు పట్టించుకోలేదు.

రాజకీయాధికారం దక్కిన తర్వాత సాంస్కృతిక రంగాన్ని తాము నిర్దేశించే బాటలో నడవాలని ఆదేశిస్తున్నారు. తాము చెప్పిందే సంస్కృతి అన్నది మతం కైపెక్కిన వారి వాదన. పురోగమన భావాలు, శాస్త్రీయ దృక్పథం, హేతువాద దృష్టి ఉన్న వారిని ఏరి ఏరి అడ్డుతొలగించుకుంటున్నారు. ఆ క్రమంలోనే నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. జంతు మాంసం తిన్నందుకు అఖ్లాక్ ప్రాణాలు తీశారు. దళితుల మీద దాడులు చేస్తున్నారు. మంత్రులుగానూ, ప్రజా ప్రతినిధులుగానూ ఉన్న ఈ కుదురుకు చెందిన కొందరు తమ వాచాలత్వంతో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నా “హిందూ హృదయ సామ్రాట్” నోట మాట పెకలదు.
filmmakers-return-awardsఅందుకే ఎమర్జెన్సీ రోజులకన్నా ప్రస్తుత పరిస్థితే ఎక్కువ భయంగొల్పుతోందని అవార్డు వెనక్కు తిరిగి ఇచ్చేసిన సినీరంగ ప్రముఖుడు ఆనంద్ పట్వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయతా సంస్కృతి పరిరక్షకులమని చెప్పుకునే వారు వాస్తవానికి సంస్కృతి విధ్వంసకులు. సంస్కృతి అన్న మాటే వారికి కంపరం కలిగిస్తుంది. తమ సంస్కృతే సర్వోత్కృష్టమైందని, మిగతా సంస్కృతులను తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకున్న హిట్లర్ ఫాసిస్టు విధానాలు ఎంతటి వినాశనానికి దారి తీశాయో అందరికీ తెలుసు.

“సంస్కృతి అను ఒక్క మాట

చెవిని సోకుటాలస్యం

దానంతట తుపాకీని

తడుముతుంది నా హస్తం” అన్న గెహ్రింగ్ హిట్లర్ సర్వసేనాని అన్న విషయం గుర్తుంచుకుంటే విద్వేషాగ్ని ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు.

విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న వారికి అధినేతలైన వారు వితండ వాదానికి దిగుతున్నారు. పెరిగిపోతున్న అసహన ధోరణులకు నిరసన తెలియజేయడం కేవలం దిల్లీకి మాత్రమే (ల్యూటెన్ జోన్) పరిమితమని బీజేపీ అగ్రసానాధిపతి అమిత్ షా నమ్మబలుకుతున్నారు. సమాజ్ వాది పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన సంఘటనలకు వ్యతిరేకంగానే రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చివేస్తున్నారని అమిత్ షా భాష్యం చెప్తున్నారు. నరేంద్ర ధభోల్కర్ ను, గోవింద్ పన్సారేను పొట్టన పెట్టుకున్న మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేగా! ఆ వాస్తవం అమిత్ షా వినిపించుకోరు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్తే దాడులకు కారణమయ్యేటట్టయితే గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, గోవాలో దాడులు ఎందుకు జరగడం లేదని అమిత్ షా ప్రశ్నిస్తున్నారు. అంటే దేశమంతా కమల దళం అధికారంలోకి వచ్చేదాకా విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంటామని, హత్యలు, దాడులు జరిగినా ఖాతర్ చేయబోమని అమిత్ షా చెపప్దలుచుకున్నట్టుంది. “భారత ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే మేమం చేయగలం?” అని నిలదీస్తున్నారు.

“పోగాలము దాపురించిన వారు అరుంధతినీ, మిత్రుని మాటలు, దీప నిర్వాణ గంధాన్ని కనరు, వినరు, మూర్కొనరు” అని “మిత్రలాభం”లోని వాక్యం. విద్వేషాగ్ని రెచ్చగొట్టే వారూ ఇదే కోవలోకి వస్తారు.

-ఆర్వీ రామారావ్

First Published:  29 Oct 2015 11:36 AM IST
Next Story