Telugu Global
Others

అంత యాంగ్జ‌యిటీ అవ‌స‌ర‌మా?

స‌న్నని ఒక పిట్ట‌గోడ‌మీద న‌డ‌వాల్సి వ‌చ్చింది…లేదా అనుకోకుండా ఏదైనా ఒక ప్ర‌మాదంలో ఇరుక్కున్నారు. అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుంది. ఊపిరి బిగ‌ప‌ట్టి,  ఎగ‌సిప‌డుతున్న ఆందోళ‌న‌ను అదిమిప‌ట్టి ఆ గండం నుండి గ‌ట్టెక్కి అమ్మ‌య్య అనుకుంటాం. ఒంట్లోని శ‌క్తినంతా ఆ ప‌నికోసం వాడేస్తాం. ఆ క్ష‌ణం దాటాక ఇక హాయిగా, ఆనందంగా ప్ర‌శాంతంగా ఫీల‌వుతాం. కానీ పైన పేర్కొన్న రెండు ప‌రిస్థితుల్లో ఇర‌వైనాలుగు గంట‌లూ ఉంటే…ఊహించ‌డానికే భ‌య‌మేస్తుంది క‌దా. కానీ యాంగ్జ‌యిటీ అనే మాన‌సిక డిజార్డ‌ర్‌ని ఎదుర్కొంటున్న‌వారు నిరంత‌రం అదే మాన‌సిక స్థితిలో ఉంటారు. ఏ […]

అంత యాంగ్జ‌యిటీ అవ‌స‌ర‌మా?
X

స‌న్నని ఒక పిట్ట‌గోడ‌మీద న‌డ‌వాల్సి వ‌చ్చింది…లేదా అనుకోకుండా ఏదైనా ఒక ప్ర‌మాదంలో ఇరుక్కున్నారు. అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుంది. ఊపిరి బిగ‌ప‌ట్టి, ఎగ‌సిప‌డుతున్న ఆందోళ‌న‌ను అదిమిప‌ట్టి ఆ గండం నుండి గ‌ట్టెక్కి అమ్మ‌య్య అనుకుంటాం. ఒంట్లోని శ‌క్తినంతా ఆ ప‌నికోసం వాడేస్తాం. ఆ క్ష‌ణం దాటాక ఇక హాయిగా, ఆనందంగా ప్ర‌శాంతంగా ఫీల‌వుతాం. కానీ పైన పేర్కొన్న రెండు ప‌రిస్థితుల్లో ఇర‌వైనాలుగు గంట‌లూ ఉంటే…ఊహించ‌డానికే భ‌య‌మేస్తుంది క‌దా. కానీ యాంగ్జ‌యిటీ అనే మాన‌సిక డిజార్డ‌ర్‌ని ఎదుర్కొంటున్న‌వారు నిరంత‌రం అదే మాన‌సిక స్థితిలో ఉంటారు. ఏ ప్ర‌మాదం లేక‌పోయినా, ఎప్పుడూ ఆందోళ‌న చెందుతూనే ఉంటారు. ఆందోళ‌న‌, క‌ల‌వ‌ర‌పాటు, ఎప్పుడు ఏమ‌వుతుందో అని భ‌యం, అర్థంలేని అనుమానాలు, అన‌వ‌స‌రంగా ప్ర‌తిచిన్న విష‌యానికి బెంబేలు ప‌డిపోవ‌డం….ఇలాంటి ల‌క్ష‌ణాలు కొంత‌మందిలో క‌న‌బ‌డుతుంటాయి. చివ‌రికి అవి వారి వ్య‌క్తిత్వ ల‌క్ష‌ణాలుగా స్థిర‌ప‌డిపోతాయి. ఆందోళ‌న లేదా మాన‌సిక నిపుణుల ప‌రిభాష‌లో యాంగ్జ‌యిటీగా పిలుస్తున్న‌ ఈ స‌మ‌స్య‌ తొలు‌త చిన్న‌దిగా క‌న‌బ‌డుతుంది. కానీ దీర్ఘ‌కాలంపాటు ఇది మ‌నిషిలో నిలిచిపోతే త‌రువాత కాలంలో విప‌రీత ప‌రిణామాలకు దారితీస్తుంది. దీర్ఘ‌కాలం యాంగ్జ‌యిటీకి గుర‌యిన‌వారిలో తేడా స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఎప్పుడూ అశాంతిగా క‌న‌బ‌డుతుంటారు. కోపం, బాధ‌, గిల్టీనెస్, అసూయ లాంటి నెగెటివ్ భావాలు ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఆందోళ‌న… నిరంత‌ర అశాంతికి, మాన‌సిక క‌ల్లోలానికి ఎలా దారితీస్తుందో తెలిపే అంశాలు ఇవి-

-నిరంత‌రం ఆందోళ‌న‌, యాంగ్జ‌యిటీల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నవారిలో అడ్రిన‌లిన్ అనే హార్మోను నిరంత‌రం ఉత్ప‌త్తి అవుతూ న‌రాల‌ను ఉత్తేజితం చేస్తూ ఉంటుంది. సాధార‌ణంగా ఏదైనా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితి ఎదురైన‌పుడు దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఇది ఉత్ప‌త్తి అవుతుంది. కానీ ఆందోళ‌న‌తో ఉన్న‌వారిలో ఎప్పుడూ ఏదో చెడు జ‌ర‌గ‌బోతోంది అనే భ‌యం ఉండ‌టం వ‌ల‌న దీని ఉత్ప‌త్తి ఎక్కువ‌వుతుంది. అవ‌న్నీకేవ‌లం ఊహ‌లే క‌నుక అడ్రిన‌లిన్ అవ‌స‌రం లేక అది వృథా అవుతూ ఉంటుంది. ఆ నెర్వ‌స్ ఎన‌ర్జీ అంతా వృథా కావ‌డం వ‌ల్ల‌నే వీరు ఎప్పుడూ అశాంతిగా, అస్థిమితంగా క‌న‌బ‌డుతుంటారు.

-యాంగ్జ‌యిటీ ఉన్న‌వారిలో క‌నిపించే అశాంతి అంతా మాన‌సిక‌మైన‌దే. ఈ ప‌రిస్థితిలో ఉన్న‌వారి మెద‌డు ఏ విష‌యంలోనైనా నెగెటివ్‌నే చూస్తుంది. వ్య‌తిరేకంగానే స్పందిస్తుంది. దీన్ని కేవ‌లం ఒక ప్ర‌వ‌ర్త‌న‌గా స‌రిపెట్టుకోలేము. ఎందుకంటే వీరి మెద‌డులో ఉత్ప‌త్తి అయ్యే ర‌సాయ‌నాల్లోనూ తేడా వ‌స్తుంది. అందుకే వీరు ఏ అంశాన్నీ పాజిటివ్‌గా చూడ‌లేరు. ఇక యాంగ్జ‌యిటీ ల‌క్ష‌ణాలు పెరిగిపోయిన‌ప్పుడు వీరిలో ఇరిటేష‌న్ పెరిగిపోతుంది. ప్ర‌పంచంలో ప్ర‌తిదీ త‌మ‌కు వ్య‌తిరేకంగానే ఉన్న‌ట్టుగా ఫీల‌వుతుంటారు.

-చివ‌రికి యాంగ్జ‌యిటీ, నిరంత‌ర ఆందోళ‌న కార‌ణంగా ప్ర‌తి చిన్న విష‌యానికి విసుగు చెంద‌టం, ఊరికే అల‌సిపోవ‌డం జ‌రుగుతుంది. లోప‌ల ఎగ‌సిప‌డుతున్న ఆందోళ‌న‌ను నిలువ‌రించ‌లేక వీరు చివ‌రికి త‌మని తాము విమ‌ర్శించుకోవ‌డం, త‌మ‌ని తాము హింసించుకోవ‌డం లాంటివి చేస్తారు. మితిమీరిన నెగెటివ్ ఎమోష‌న్ల కార‌ణంగా అనుబంధాల‌ను చెడ‌గొట్టుకుంటారు. స్నేహితుల‌ను, స‌న్నిహితుల‌ను దూరం చేసుకునే ప‌రిస్థితులు సైతం త‌లెత్త‌వ‌చ్చు.

ఎలా వ‌దిలించుకోవాలి….

– దీన్నుండి బ‌య‌ట‌ప‌డాలంటే ముందు ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. మ‌న క‌ళ్ల‌ముందు ఏ ప్ర‌మాద‌మూ, ప‌రిగెత్తాల్సిన‌, పోరాడాల్సిన ప‌రిస్థితిలేద‌ని అర్థం చేసుకోవాలి. ఇదంతా కేవ‌లం త‌మ‌లోని ఆందోళ‌న కార‌ణంగానే జ‌రుగుతున్న‌ద‌ని తెలుసుకోవాలి. అశాంతి, మాన‌సిక క‌ల్లోలాన్ని ఆప‌లేక‌పోతే మ‌రింత‌గా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. అందుకే త‌మ‌నితాము హింసించుకోకుండా ప్ర‌శాంతంగా ఉండేందుకు ట్రై చేయాలి.

-అవ‌స‌రం లేక‌పోయినా ఉత్ప‌త్తి అయిన అడ్రిన‌లిన్, దానిని వినియోగించ‌క‌పోవ‌డం వ‌ల‌న వృథా అవుతూ ఉంటుంది. ఈ ప‌రిస్థితి బాధితుల్లో చిరాకుని క‌లిగిస్తుంది. ఇలాంట‌పుడు దాన్ని వాడేసే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు. ప‌రిగెత్త‌డం, న‌డ‌వ‌డం, శారీర‌క వ్యాయామం ఇవ‌న్నీ అడ్రిన‌లిన్ హార్మోన్‌ని శ‌రీరం వినియోగించుకునేలా చేసి అశాంతిని త‌గ్గిస్తాయి.

-ఏదైనా మంత్రాన్ని జ‌పిస్తూ ధ్యానం చేయ‌డం, యోగా, ప్రాణాయామం లాంటివాటి సాధ‌న‌తో యాంగ్జ‌యిటీని నివారించ‌వ‌చ్చు. ఆలోచ‌న‌ల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

-చుట్టుప‌క్క‌ల ఎవ‌రూ లేక‌పోతే, అవ‌కాశం ఉంటే పెద్ద‌గా అర‌చి కేక‌లు పెట్ట‌డం ద్వారా లోప‌ల వృథాగా ఉన్న శ‌క్తిని బ‌య‌ట‌కు పంప‌వ‌చ్చు.

-పెద్దగా న‌వ్వ‌డం ద్వారా కూడా నెర్వ‌స్ ఎన‌ర్జీని వినియోగించుకోవ‌చ్చు. మ‌న‌సు క‌ల్లోలంగా ఉన్న‌పుడు న‌వ్వ‌డం క‌ష్ట‌మే. దానికి అదే మందు కాబ‌ట్టి కామెడీ చిత్రాలు చూడ‌టం, జోకులు చ‌ద‌వ‌డం లాంటివి చేయ‌వ‌చ్చు. అలాగే మ‌న‌సుని పాజిటివ్ అంశాల‌పైకి మ‌ళ్లించాలి.

-రిలాక్సేష‌న్ వ్యాయామాలపై అవ‌గాహ‌న పెంచుకుని సాధ‌న చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పుడూ బిజీగా ఉండ‌టం వ‌ల‌న ఆందోళ‌న క‌లిగించే ఆలోచ‌న‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.

First Published:  28 Oct 2015 2:13 PM IST
Next Story