ఎన్ని తలనొప్పులో...
తలనొప్పి…ఇది అనుకోని అతిధిలా వచ్చి మనల్ని తరచుగా పలకరించిపోయే అనారోగ్యం. కానీ నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా చాలామంది దీన్ని సీరియస్‌గా తీసుకోరు. మెడికల్ షాఫునుండి ఒక టాబ్‌లెట్ తెచ్చి వేసుకుని తిరిగి తమరోజువారీ పనులు చేసుకుంటూ పోతారు. తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తేలిగ్గా తీసుకుంటూ, సొంతవైద్యం మీద ఆధారపడుతుంటారు. కానీ ఇది మంచి విషయం కాదంటున్నారు ముంబయికి చెందిన వైద్యురాలు డాక్టర్ అంజనా లాంగానీ. నొప్పి తలలో కానీ, లేదా మెడ […]
తలనొప్పి…ఇది అనుకోని అతిధిలా వచ్చి మనల్ని తరచుగా పలకరించిపోయే అనారోగ్యం. కానీ నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా చాలామంది దీన్ని సీరియస్‌గా తీసుకోరు. మెడికల్ షాఫునుండి ఒక టాబ్‌లెట్ తెచ్చి వేసుకుని తిరిగి తమరోజువారీ పనులు చేసుకుంటూ పోతారు. తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తేలిగ్గా తీసుకుంటూ, సొంతవైద్యం మీద ఆధారపడుతుంటారు. కానీ ఇది మంచి విషయం కాదంటున్నారు ముంబయికి చెందిన వైద్యురాలు డాక్టర్ అంజనా లాంగానీ. నొప్పి తలలో కానీ, లేదా మెడ పైభాగానకానీ వచ్చినా అది శరీరంలోని వేరే అనారోగ్యాలకు సూచన కావచ్చని ఆమె అంటున్నారు. ఒక్కోసారి ట్యూమర్లు, మెదడులో రక్తస్రావంలాంటి ప్రమాదకరమైన జబ్బుల లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చని, కాబట్టి తలనొప్పులను అశ్రద్ధ చేయరాదని ఆమె అంటున్నారు. భిన్న రకాల తలనొప్పుల గురించి వైద్య నిపుణులు అందిస్తున్న వివరాలు ఇవి-
సర్వికాజెనిక్ హెడెక్స్: మెడ వెనుక భాగంలో పుర్రెకు మెడపైభాగానికి మధ్యలో ఈ నొప్పి మొదలవుతుంది. సాధారణంగా ఇది మనం కూర్చునే పద్ధతిలో తేడా కారణంగా వస్తుంది. ఈ నొప్పి మొదలైన ప్రాంతాన్ని బట్టి దీన్ని సర్వికల్ స్పైన్ లేదా సి2 జంక్షన్ పెయిన్‌గా చెబుతారు. ఎక్కువ సమయం తలను ముందుకు వాల్చి పనిచేయడం వలన ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి అన్ని వయసులవారిలోనూ కనబడుతుంది. చదవడం, రాయడం చేసేటప్పుడు శరీరాన్ని సరైన తీరులో ఉంచకపోవడం వలన టీనేజి పిల్లల్లోనూ ఈ నొప్పి వస్తుంది. గంటల తరబడి టాబ్లెట్స్, సెల్‌ఫోన్స్‌లో ఆడుతున్న పిల్లలనూ, కదలకుండా డెస్క్ వర్కులు చేసేవారిని కూడా ఈ తరహా నొప్పి బాధిస్తుంది. మెడ పట్టేసినట్టుగా ఉండి, మెడ ముందు భాగంలో, భుజంలో, ఛాతీలోని కండరాల్లోకి సైతం ఈ నొప్పి వ్యాపించవచ్చు. దీనికి తొలుత కండరాలు రిలాక్స్ అయ్యేలా వైద్యం చేసి అనంతరం డ్రై నీడ్లింగ్ టెక్నిక్ ద్వారా సూదులను కండరాల్లోకి పంపి నొప్పిని తగ్గిస్తామని, తరువాత మెడ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయిస్తామని డాక్టర్ అంజన చెబుతున్నారు.
జెయింట్ సెల్ ఆర్టిరిటీస్ హెడెక్స్: కణతల వద్ద ఉన్న ధమనుల్లో వాపు కారణంగా ఈ తలనొప్పి వస్తుంది. టెంపుల్స్ (కణతలు) వద్ద వస్తుంది కాబట్టి దీన్ని టెంపోరల్ ఆర్టిరిటీస్ అనికూడా అంటారు. ఈతరహా తలనొప్పిలో దవడ కండరంలో కూడా నొప్పి ఉంటుంది. ఒక వస్తువు రెండుగా కనబడుతుంది. పుర్రెభాగం సున్నితంగా అయిపోవడం జ్వరం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు సైతం ఉంటాయి. 50 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో ఎక్కువగా కనబడుతుంది. కణత భాగపు రక్త నాళాల నుండి బయాప్సీ చేయడం ద్వారా దీన్ని గుర్తిస్తామని జస్‌లోక్, లీలావతి హాస్పటల్స్‌లో పనిచేసిన డాక్టర్ కె. రవిశంకర్ అంటున్నారు. సరైన మందుల ద్వారా దీన్ని తగ్గించవచ్చని, అయితే నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపుకోల్పోయే ప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు.
కంప్యూటర్ విజన్ హెడెక్: కంప్యూటర్ నుండి వచ్చే వెలుతురులో ఎక్కువ గంటలు నిరంతరాయంగా పనిచేయడం వలన సాధారణంగా వచ్చే తలనొప్పి ఇది. దీంతోపాటు ఒకటి రెండుగా కనిపించడం, చూపు మసకబారడం, మెడనొప్పి, అలసట, కళ్లు ఎర్రబారడం లాంటి సమస్యలు ఉంటాయి. ఆఫీసుల్లో ఏడెనిమది గంటలు కంప్యూటర్ ముందు పనిచేయడం, ఇంటికి వచ్చాక కూడా ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం వలన ఇలాంటి తలనొప్పులు వస్తాయని డాక్టర్ రాగిణీ పరేక్ అనే కంటివైద్య నిపుణురాలు చెబుతున్నారు. ఇలాంటి శ్రమ వలన కళ్లు అలసటకు గురికావడమే కాకుండా కనుబొమల పైభాగంలో నొప్పి వస్తుందని ఆమె అంటున్నారు. దీన్ని పని ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారని, కానీ అది సరికాదని, కంప్యూటర్ తెరమీద వెలుతురుని, లేదా నేరుగా స్క్రీన్ మీద సూర్యకాంతి పడుతుంటే ఆ వెలుతురుని చూడటంలో కాస్త విరామం ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆ వెలుతురు చిక్కదనాన్ని తగ్గించుకోవాలని, డెస్క్ ల్యాంప్ పెట్టుకుని తెరమీద సమానంగా వెలుతురు పడేలా చేయడం, కంప్యూటర్ తెరను కళ్ల స్థాయికి కాస్త కిందుగా ఏర్పాటు చేసుకోవడంతో ఈ సమస్యని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.