రేప్ చేస్తామంటూ కన్నడ రచయిత్రికి బెదిరింపు
కత్తికంటే కలం పదునైనదన్న మాట ఇప్పుడు పాతదై పోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛపై దౌర్జన్యం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కలంపై కత్తులు దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో సాహితీవేత్తలు, రచయితలపై దాడులు పతాకస్థాయికి చేరాయి. కర్ణాటకలో ప్రముఖ రచయిత ఎంఎం కల్ బర్గి హత్య తర్వాత ఈ ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగురోజుల క్రితం మతం గురించి రాసాడని ఓ యువ రచయితను చితకొట్టారు. తాజాగా ప్రముఖ కన్నడ రచయిత్రి, ఫిల్మ్ మేకర్ చేతన తీర్థహళ్లికి కొందరు […]
కత్తికంటే కలం పదునైనదన్న మాట ఇప్పుడు పాతదై పోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛపై దౌర్జన్యం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కలంపై కత్తులు దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో సాహితీవేత్తలు, రచయితలపై దాడులు పతాకస్థాయికి చేరాయి. కర్ణాటకలో ప్రముఖ రచయిత ఎంఎం కల్ బర్గి హత్య తర్వాత ఈ ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగురోజుల క్రితం మతం గురించి రాసాడని ఓ యువ రచయితను చితకొట్టారు. తాజాగా ప్రముఖ కన్నడ రచయిత్రి, ఫిల్మ్ మేకర్ చేతన తీర్థహళ్లికి కొందరు అరాచకవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. జాగృత భారత, మధుసూదన గౌడ అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు చేతన కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల బీఫ్ తినడాన్ని వ్యతిరేకించిన వారికి చేతన తీర్థహళ్లి కౌంటర్ ఇచ్చారు. బీఫ్ తినడానికి మద్దతుగా జరిగిన ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు ప్రముఖ ఉర్దూ, సినీ గీత రచయిత గుల్జార్ కూడా సాహితీవేత్తలకు మద్దతు ప్రకటించారు. తనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను రచయితలు తిరిగి వెనక్కి ఇచ్చేయడాన్ని ఆయన సమర్ధించారు. పెచ్చుమీరుతున్న మతతత్వ పోకడలపట్ల నిరసన తెలపడానికి కవులు, కళాకారులకున్న ఏకైక మార్గం ఇదేనని గుల్జార్ వ్యాఖ్యానించారు.
మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా చేతన తీర్థహళ్లి ఘటనపై స్పందించారు. సాహితీ వర్గంపై జరుగుతున్న దాడులను అరికడతామని హామీ ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి హాని కలిగినా ఊరుకోబోమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.