Telugu Global
Editor's Choice

అమ్మానాన్న‌ల‌కు తెలియ‌ని అప‌రిచిత ‌కోణం!

స్ట్రెస్‌, ఒత్తిడి… గురించి మాట్లాడుకునేట‌ప్పుడు మ‌నం సాధార‌ణంగా పెద్ద‌వాళ్ల‌కోణంలోనే ఆలోచిస్తాం. కానీ ఇంట్లో పెద్ద‌వాళ్లు మాన‌సికంగా ప్ర‌శాంతంగా లేన‌పుడు పిల్ల‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్ర‌శ్న‌ని వేసుకోము. ఈ మ‌ధ్య‌కాలంలో స్ట్రెస్ మీద ప‌లుర‌కాల అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయి. పోటీత‌త్వం, అన్నింటా వేగం, ప్ర‌పంచీక‌ర‌ణ ఇవ‌న్నీ ఒత్తిడిని పెంచేస్తున్నాయ‌ని చెప్పుకుంటున్నాం…కానీ, మ‌రి పెద్ద‌వాళ్లు ఇలాంటి మాన‌సిక ఇబ్బందుల‌కు గుర‌వుతున్న‌పుడు పిల్ల‌ల్లో మార్పులు వ‌స్తున్నాయా, వ‌స్తే అవి ఎలా ఉంటున్నాయి? అనే ప్ర‌శ్న‌ల‌ను వేసుకోవ‌డం లేదు, వాటికి జ‌వాబుల‌నూ వెతక‌డం లేదు. ఇక త‌ల్లిదండ్రుల‌యితే పిల్ల‌ల‌కేం తెలుస్తుంది మేము […]

అమ్మానాన్న‌ల‌కు తెలియ‌ని అప‌రిచిత ‌కోణం!
X

స్ట్రెస్‌, ఒత్తిడి… గురించి మాట్లాడుకునేట‌ప్పుడు మ‌నం సాధార‌ణంగా పెద్ద‌వాళ్ల‌కోణంలోనే ఆలోచిస్తాం. కానీ ఇంట్లో పెద్ద‌వాళ్లు మాన‌సికంగా ప్ర‌శాంతంగా లేన‌పుడు పిల్ల‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్ర‌శ్న‌ని వేసుకోము. ఈ మ‌ధ్య‌కాలంలో స్ట్రెస్ మీద ప‌లుర‌కాల అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయి. పోటీత‌త్వం, అన్నింటా వేగం, ప్ర‌పంచీక‌ర‌ణ ఇవ‌న్నీ ఒత్తిడిని పెంచేస్తున్నాయ‌ని చెప్పుకుంటున్నాం…కానీ, మ‌రి పెద్ద‌వాళ్లు ఇలాంటి మాన‌సిక ఇబ్బందుల‌కు గుర‌వుతున్న‌పుడు పిల్ల‌ల్లో మార్పులు వ‌స్తున్నాయా, వ‌స్తే అవి ఎలా ఉంటున్నాయి? అనే ప్ర‌శ్న‌ల‌ను వేసుకోవ‌డం లేదు, వాటికి జ‌వాబుల‌నూ వెతక‌డం లేదు. ఇక త‌ల్లిదండ్రుల‌యితే పిల్ల‌ల‌కేం తెలుస్తుంది మేము ప‌డుతున్న క‌ష్టాలు అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పిల్ల‌ల‌కేం బాధ‌లుంటాయి…వారు ఆనందంగా స్కూలుకి వెళ్లి వ‌స్తున్నార‌ని, ఆడుకుంటూ హాయిగా బ‌తికేస్తున్నార‌ని అనుకుంటారు. అయితే త‌ల్లిదండ్రుల స్ట్రెస్ ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఉండితీరుతుంద‌ని ఒక స‌ర్వే ఫ‌లితాలు చెబుతున్నాయి. వెబ్ ఎండి అనే హెల్త్ వెబ్‌సైట్ నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో దీనిపై ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

5-13సంవ‌త్స‌రాల‌ మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌లుగ‌ల 432మంది త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నించి వీరు స‌ర్వే చేశారు. ఇందులో ప్ర‌తి అయిదుగురిలో ఒక‌రు తాము ప‌దికి ప‌దిపాళ్లు ఒత్తిడిని అనుభ‌విస్తున్న‌ట్టుగా చెప్పారు. 57శాతం మంది తాము ఏడవ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నామ‌న్నారు. కానీ వీరిలో 60శాతం మంది త‌మ పిల్ల‌ల్లో స్ట్రెస్ 4వ లెవ‌ల్ కంటే త‌క్కువ‌గా ఉంద‌న్నారు. త‌మ ప్ర‌వ‌ర్త‌న పిల్ల‌ల‌ను సైతం అల‌జ‌డికి గురిచేస్తుంద‌నే విష‌యాన్ని విద్యావంతులైన ఆ త‌ల్లిదండ్రులు ఏమాత్రం గుర్తించ‌క‌పోవ‌డం విచిత్ర‌మే.

ఇంట్లో తాము మాన‌సికంగా ఆరోగ్యంగా లేన‌పుడు ఆ ప్ర‌భావం త‌ప్ప‌కుండా పిల్ల‌ల‌పై కూడా ఉంటుంద‌నే సింపుల్ విష‌యాన్ని త‌ల్లిదండ్రులు గ‌మ‌నించ‌డం లేద‌ని అమెరిక‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎండి సాంద్రా హాసింక్స్ అంటున్నారు. త‌ల్లిదండ్రులు గుర్తించ‌లేక‌పోయినా పిల్ల‌లు సైతం మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని తెలిపే అంశాలు స‌ర్వేలో వెల్ల‌డ‌య్యాయి.

స‌ర్వేలో పాల్గొన్న‌వారి పిల్ల‌ల్లో 72శాతం మంది స‌ర్వేకి ముందు సంవ‌త్స‌ర కాలంగా విప‌రీత‌మైన ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని, వారిలో దాని తాలూకూ మార్పులు వ‌చ్చాయ‌ని స‌ర్వే తేల్చింది. అందుకు రుజువులైన అంశాల‌ను త‌ల్లిదండ్రుల నుండే రాబ‌ట్టారు.

-43శాతం మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు త‌మ‌తో ఎక్కువ‌గా వాదిస్తున్నార‌ని చెప్పారు

-37శాతం మంది త‌మ పిల్ల‌ల్లో ఏడుపు, మొండిత‌నం పెరిగాయ‌ని చెప్పారు.

-34 శాతం మంది త‌మ పిల్ల‌లు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఎందుకో వ‌ర్రీ అవుతున్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించార‌న్నారు.

-44శాతం మంది త‌మ పిల్ల‌లు త‌ల‌నొప్పుల‌తో బాధ‌ప‌డిన‌ట్టుగా చెప్పారు.

-మ‌రో 44శాతం మంది త‌మ చిన్నారులు త‌ర‌చుగా క‌డుపునొప్పిగా ఉంద‌ని చెప్పేవార‌న్నారు

-38శాతం మంది త‌మ‌ పిల్ల‌లు పీడ‌క‌ల‌ల‌కు గుర‌య్యారని, స‌రిగ్గా నిద్ర‌పోలేక‌పోయారని తెలిపారు.

-20శాతం మంది పిల్లల్లో ఆక‌లి త‌గ్గిపోయింద‌ని, వారి ఆహార అల‌వాట్ల‌లో మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పారు.

-ఇక ప్ర‌తి అయిదుగురు త‌ల్లిదండ్రుల్లో ఒకరు త‌మ పిల్ల‌ల‌కు మాన‌సిక నిపుణుల కౌన్సెలింగ్‌, థెర‌పీ అవ‌స‌ర‌మైంద‌ని చెప్పారు.

మేము ఒత్తిడికి గుర‌వుతున్నాం…అని పిల్ల‌లు చెప్ప‌రు…కానీ వారిలో ఈ మార్పుల‌న్నీ స్ట్రెస్ కార‌ణంగా వ‌చ్చిన‌వే అని హాసింక్స్ అంటున్నారు. పిల్ల‌లు పెరుగుతున్న‌కొద్దీ వారితో పాటు ఒత్తిడి మ‌రింత‌ పెరుగుతుంద‌ని ఆమె చెబుతున్నారు. ఇక్క‌డ మ‌రో విచిత్రం ఏమిటంటే, 53 శాతం మంది పిల్ల‌లు స్కూలు, హోంవ‌ర్క్ ల వ‌ల‌న‌, 51శాతం మంది త‌మ‌ స్నేహితుల కార‌ణంగా ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు.

ఇళ్ల‌లో నిరుద్యోగం, అనారోగ్యం, గొడ‌వ‌లు, ఆర్థిక ఇబ్బందులు లాంటి స‌మ‌స్య‌లు ఉన్నా అవి కూడా పిల్ల‌ల‌ మ‌న‌స్త‌త్వంపై ప్ర‌భావం చూపుతాయ‌ని, త‌ల్లిదండ్రులు ఇవేమీ అర్థం చేసుకోవ‌డం లేద‌ని హాసింక్స్ అంటున్నారు. విశాల‌మైన ప్ర‌దేశాల్లో స్నేహితుల‌తో క‌లిసి ఆడుకోవ‌డం, సంగీతం, క‌థ‌లు, ఇంకా న‌చ్చిన పుస్త‌కాలు చ‌దువుకోవ‌డం, ఇత‌ర సృజ‌నాత్మ‌క క‌ళ‌లు…ఇవన్నీ పిల్ల‌ల్లో ఒత్తిడిని త‌గ్గించే మార్గాలు కాగా ఈ విష‌యంలో కూడా త‌ల్లిదండ్రుల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేద‌ని ఈ స‌ర్వే తేల్చిచెప్పింది. ఎందుకంటే పిల్ల‌ల్లో ఒత్తిడి త‌గ్గి, మాన‌సికోల్లాసం క‌లిగేందుకు మీరేం అవ‌కాశం క‌ల్పిస్తున్నారు? అని ప్ర‌శ్నించిన‌పుడు ఎక్కువ‌మంది త‌ల్లిదండ్రులు, టివి చూస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ పిల్ల‌లు త‌మ అల‌స‌ట‌ని మ‌ర్చిపోతార‌ని చెప్పారు. ఈ రెండూ ఉంటే చాలు పిల్ల‌లకు ఇక‌ ఏమీ అక్క‌ర్లేద‌ని త‌ల్లిదండ్రులు భావించారు.

First Published:  25 Oct 2015 2:49 AM IST
Next Story