Telugu Global
Others

ఈ పురాతన పద్దతేంది జగన్?

ఇటీవల జగన్ పదేపదే ఒక విషయాన్ని చెబుతున్నారు. తను కొత్త జనరేషన్ అని.. చంద్రబాబుది ఓల్డ్ జనరేషన్ అని. ఆయన చెప్పిన దానిలో నిజమే ఉండవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చంద్రబాబు కన్నా జగనే పాత పద్దతులను పట్టుకుని వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. అలాంటి వాటిలో మీడియా అంశం ఒకటి. తెలుగు మీడియాలో అత్యధిక చానళ్లు, పత్రికలు జగన్‌కు వ్యతిరేకమన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఉన్న పరిమితుల్లోనూ తన వాయిస్ వినిపించడంలో జగన్ విఫలమవుతున్నారన్న […]

ఈ పురాతన పద్దతేంది జగన్?
X

ఇటీవల జగన్ పదేపదే ఒక విషయాన్ని చెబుతున్నారు. తను కొత్త జనరేషన్ అని.. చంద్రబాబుది ఓల్డ్ జనరేషన్ అని. ఆయన చెప్పిన దానిలో నిజమే ఉండవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చంద్రబాబు కన్నా జగనే పాత పద్దతులను పట్టుకుని వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. అలాంటి వాటిలో మీడియా అంశం ఒకటి.

తెలుగు మీడియాలో అత్యధిక చానళ్లు, పత్రికలు జగన్‌కు వ్యతిరేకమన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఉన్న పరిమితుల్లోనూ తన వాయిస్ వినిపించడంలో జగన్ విఫలమవుతున్నారన్న అభిప్రాయం ఉంది. మాది కొత్త జనరేషన్ అని చెప్పుకునే జగన్ ఎప్పుడో టీవీ చానళ్లు లేని కాలంలో ప్రయోగించే బహిరంగ లేఖ అస్త్రాన్ని పదేపదే సంధించడం ఆశ్చర్యమే. సాధారణ ప్రెస్ మీట్ కన్నా బహిరంగ లేఖ చూపే ప్రభావంలో తేడా ఉండవచ్చు. కాబట్టి బహిరంగ లేఖ విడుదలను ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆ లేఖ ఏదో ప్రెస్ మీట్ పెట్టి తానే టీవీ మాధ్యమాల ద్వారా కూడా చెప్పి అప్పుడు బహిరంగ లేఖ విడుదల చేస్తే బాగుంటుంది. మీడియా కూడా ప్రసారం చేయక తప్పదు. ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ కూడా అదే. అలా కాకుండా కోట దిగని రాజులా ఒక లేఖ విడుదల చేయడం ఏమిటి?. బహిరంగ లేఖ అంశం టీవీ చానళ్లలో పెద్దగా హైలైట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కేవలం ఛానెల్స్ స్క్రోలింగ్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలునప్పుడు రోజూ కాకపోయిన కనీసం వారంలో ఒకరోజైనా మీడియా సమావేశం పెట్టవచ్చు కదా?. వారాంతర మీడియా సమావేశం ద్వారా తాను చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పడంతో పాటు ప్రభుత్వ లోపాలను కూడా ఎత్తి చూపవచ్చు కదా?. అలా కాకుండా తాను మాట్లాడితే అసెంబ్లీలోనే మాట్లాడుతా.. లేకుంటే దీక్ష శిబిరాల్లోనే దర్శనమిస్తా అంటే ఎలా ?

జగన్ ప్రెస్ మీట్ పెడితే లేనిపోని, అవసరం లేని ప్రశ్నలు అడిగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కొందరు జర్నలిస్టులు కాచుకుని ఉండే మాట కూడా వాస్తవమే. కానీ వాటికి జగన్ భయపడరనే అనుకోవాలి. అసలు అసెంబ్లీ, దీక్షల సమయంలో తప్ప మిగిలిన సమయంలో జగన్ ఏం చేస్తారో కూడా సామాన్య ప్రజలకూ అర్థం కాని పరిస్థితి. ఒక ప్రధాన ప్రతిపక్షం విషయంలో ప్రతిపక్ష నేతకు, సామాన్య ప్రజలకు ముఖ దర్శనంలో ఇంత గ్యాప్ ఉండడం సరికాదేమో?. ఎవరు ఎక్కడి నుంచి విడుదల చేస్తారో తెలియని బహిరంగ లేఖల కన్నా ఓ పది నిమిషాల పాటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే బహుశ‌ జగన్ అభిమానులు కూడా ఆనందిస్తారు.

First Published:  23 Oct 2015 4:59 AM IST
Next Story