భర్త తప్పు హత్యతో పరిష్కారమవుతుందా..?
అది ఆస్ర్టేలియా రాజధాని సిడ్నీ నగరం. రెండేళ్ల కిందట… 2013 జూలై 30వ తేదీ. కీమాఘ్ అనే ప్రదేశంలో బెస్టిక్ స్ర్టీట్. పూర్వి జోషి అనే 28 ఏళ్ల భారతీయ యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆ యువతిని హత్య చేసింది మరో భారతీయ మహిళ మనీషా పటేల్. ఈ కేసును విచారించిన న్యూ సౌల్ వేల్స్‌లోని కోరు్ట మనీషా పటేల్‌కు ఇప్పుడు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరూ గుజరాతీయులే. ఒక అమాయకురాలు ప్రాణాలు […]
అది ఆస్ర్టేలియా రాజధాని సిడ్నీ నగరం. రెండేళ్ల కిందట… 2013 జూలై 30వ తేదీ. కీమాఘ్ అనే ప్రదేశంలో బెస్టిక్ స్ర్టీట్. పూర్వి జోషి అనే 28 ఏళ్ల భారతీయ యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆ యువతిని హత్య చేసింది మరో భారతీయ మహిళ మనీషా పటేల్. ఈ కేసును విచారించిన న్యూ సౌల్ వేల్స్‌లోని కోరు్ట మనీషా పటేల్‌కు ఇప్పుడు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరూ గుజరాతీయులే. ఒక అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడానికి, మరో ఆవేశపరురాలు జైలు పాలవడానికి దారి తీసిన పరిస్థితులేమిటి?
మనీషా పటేల్ 2008లో ఆస్ర్టేలియా వెళ్లింది.సాధారణ ఆడపిల్లల్లాగానే వైవాహిక జీవితం గురించిన మధురోహలతో ఆ దేశంలో అడుగుపెట్టింది. కారణాలు ఇదమిత్థంగా తెలియరావడం లేదు. కానీ ఆమె వైవాహిక జీవితం బీటలు వారింది. పరాయి దేశంలో ఏకాకిగా జీవిస్తూ ఉన్నత చదువుల కోసం కోర్సులో చేరిన మనీషాకు 2011లో భారతీయ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా నీరజ్‌దేవ్ పరిచయమయ్యాడు. నీరజ్ దేవ్ సిడ్నీ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డు. ఇద్దరూ కలిసి జీవించడానికి సిద్ధపడ్డారు కూడా. అయితే…
వివాహం దిశగా పడాల్సిన అడుగులు డేటింగ్ వైపు పడ్డాయి. మనీష మీద ఒత్తిడి తెచ్చి అబార్షన్ కూడా చేయించాడు నీరజ్. ఇదిలా ఉండగానే నీరజ్ దేవ్ రహస్యంగా గుజరాత్‌కే చెందిన పూర్వి జోషి అనే మరో అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. మనీషాపటేల్‌తో ఉన్నంత సన్నిహితంగా పూర్వితోనూ మెలగసాగాడు. ఇది తెలిసిన మనీషాపటేల్ పట్టలేని ఆగ్రహంతో నీరజ్ ఇంటికి వెళ్లి పూర్వి జోషిని కత్తితో పొడిచి చంపేసింది. గుజరాత్ నుంచి ఆస్ర్టేలియాకు వెళ్లిన వీరి జీవితాల్లో సంభవించిన మలుపులే ఈ విషాదానికి హేతువులు. ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒకరి జీవితం జైలుపాలయింది.
మనీషతో విడిపోయిన ఆమె మొదటి భర్త తనకు నచ్చినట్లు జీవితాన్ని తిరిగి రాసుకున్నాడు.మనీషతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడినట్లు నమ్మించిన అవకాశవాది నీరజ్ ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత మరో జీవితాన్ని మలుచుకుంటాడు. మొత్తంగా ఈ సంఘటనతో జీవితాన్ని, బతుకును కోల్పోయింది ఇద్దరు యువతులు. సైకాలజీ ప్రొఫెసర్ విరజారావు ఇదే విషయాన్ని విశ్లేషిస్తూ … – నీరజ్ గురించి తెలిసిన తర్వాత మనీష మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించి ఉండాల్సింది- అంటున్నారు.
దేశాలు దగ్గరయ్యాయి కానీ…
సమాచార విప్లవంతో దేశాలు దగ్గరయ్యాయి. ఖండాలు దాటి వెళ్లడం సర్వసాధారణమైంది. మన భారతీయ యువత పాశ్చాత్య సంస్క'తి మీద వ్యామోహం కూడా అదే స్థాయిలో పెంచుకుంటోంది. 'జీవిత భాగస్వామితో కంపాటబులిటీ లేదనిపిస్తే ఆ వైవాహిక బంధం నుంచి సులువుగా బయటపడుతున్నారు. అయితే మరో బంధంలోకి అడుగుపెట్టే ముందు స్థితప్రజ్ఞతను పాటించలేకపోతున్నారు. అక్కడ మాత్రం భారతీయ యువతులు భాగస్వామి నుంచి భద్రత కోరుతున్నారు. ఆ భద్రత దొరకనప్పుడు మానసికంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. కొందరు వైరాగ్యంలో మునిగిపోతుంటే, మరికొందరు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు పాల్పడుతున్నారు. మనీషా పటేల్ జీవితమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
మార్పును కోరుకుంటే…
పాశ్చాత్య జీవితాన్ని కోరుకున్నట్లయితే పూర్తిగా ఆ ధోరణికి మారిపోగలగాలి. కొంత వరకు పాశ్చాత్యతను కోరుకుంటూ మరికొంత భారతీయత కోసం పరితపించినప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుంది. నీరజ్‌దేవ్ మోసగాడు అని తేలిన వెంటనే ఆ చేదు నిజాన్ని ఆమె ధైర్యంగా స్వీకరించి ఉండాలి. అతడికి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధం కావాలి. ఆమె నీరజ్ పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకోవడం వల్ల, భర్త నుంచి దొరకని ప్రేమ, ఆసరా నీరజ్ దగ్గర దొరుకుతుందనే భావన మీద పూర్తిగా ఆధారపడడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. మోసపోయాననే బాధ దహించి వేసినప్పుడు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నిజమే. అయితే ఆ కోపం నీరజ్ మీద రావాలి తప్ప, పూర్వి మీద కాదు.
తనకే సర్వస్వం అనుకుంటే…
తనకే సర్వస్వం అనుకున్న మగాడి జీవితంలో మరొక స్ర్తీని ఊహించుకోలేని బలహీనత మనీషను ఆవరించి ఉండవచ్చు. ఇక్కడకొచ్చేసరికి ఆమె పూర్తిగా భారతీయత నేపథ్యంలోనే ఆలోచించింది తప్ప పాశ్చాత్య ధోరణిని అనుసరించలేకపోయింది. అదే పాశ్చాత్య మహిళ అయితే పూర్వి మీద కోపం పెంచుకునేది కాదు. నీరజ్ ని ఈసడించుకుని దూరంగా వెళ్లి పోయేది. తన జీవితాన్ని కొత్తగా మలుచుకోవడానికి సమాయత్తమయ్యేది. ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేచి నిలబడాలనే సంకల్పస్ఫూర్తితో జీవించి ఉండేది.
మనీష ఒక్క నిమిషం స్థిమితంగా ఆలోచించినట్లయితే… 'నీరజ్ అసలు రూపం ఇదని పూర్విని అప్తమత్తం చేసి ఉండేది. ఒక మోసగాడి బారి నుంచి ఇద్దరి జీవితాలు బయటపడేవి' అంటున్నారు డాక్టర్ విరజారావు.
పూర్వి హత్య కేసు విచారణ సమయంలో, న్యాయమూర్తి తీర్పు చెబుతన్నప్పుడూ మనీష తీవ్రమైన అపరాధభావంతో కుంగిపోయిందని ఆమెను విచారించిన పోలీసులు, న్యాయవాదులు చెబుతున్నారు. ఒక అమాయకురాలి మీద కోపం పెంచుకోవడం, ఆమెను చంపడానికి కూడా వెనుకాడకపోవడం వంటి కిరాతకానికి ఒడిగట్టినందుకు ఆమె పశ్చాత్తాప పడుతోందిప్పుడు.
ఒక్క మనీష మాత్రమే కాదు. ఖండాలు దాటిన అనేక జీవితాల్లో ఇటువంటి ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని ఇలా అసాంఘికచర్యల రూపాన్ని సంతరించుకుంటూ ఉంటే, మరికొన్నిజీవితాలు… ఏమి ఆశించామో,దేనికోసం పరుగులు తీశామో, చివరకు ఏమి పొందామో అని విశ్లేషించుకుంటూ, బేరీజు వేసుకుంటూ నలిగిపోతున్నాయి.
ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ స్థిరపడినా సరే… ప్రతి ఒక్కరికీ తానెలా జీవించాలనే విషయంలోస్పష్టత ఉండాలి. జీవితం తాము అనుకున్నట్లు లేకపోతే మలుచుకోవడం ఒక పద్ధతి, మార్చుకోవడం మరొక పద్ధతి. అంతే తప్ప జీవితాన్నికోల్పోయే నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ తీసుకోకూడదు. జీవితాన్నిపునర్నిర్మించుకోవడంలో పరిణతితో వ్యవహరించాలి.
————–0—————-
సైకాలజీ ప్రొఫెసర్ కామెంట్!
రెండు పడవల మీద ప్రయాణమే!
ఆధునికతను కోరుకోవడం తప్పు కాదు. పాశ్చాత్య సంస్క'తిని ఇష్టపడితే అలా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే తానెలా జీవించాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాలి. పాశ్చాత్యదేశాల మహిళలు… భారతీయ మహిళ కోరుకున్నట్లు భర్త నుంచి భద్రతను పెద్దగా ఆశించరు. తమ కాళ్ల మీద తాము జీవించడానికి సర్వదా సిద్ధంగా ఉంటారు. ఒక నిమిషం స్వేచ్ఛాపూరితమైన జీవితాన్నికోరుకుంటూ, అదే సమయంలో పరస్పర ఆధారితమైన బాంధవ్యాన్ని కోరుకుంటే రెండు పడవల మీద ప్రయాణమే అవుతుంది. ఒక వైవాహిక బంధం నుంచి బయటపడి మరో వ్యక్తితో బంధంలోకి అడుగుపెట్టేటప్పుడు తొందరపాటు ఉండకూడదు. ముందువెనుకలు ఆలోచించాలి. వివాహబంధంలోకి అడుగుపెట్టక ముందు శారీరక సంబంధాలను ప్రోత్సహించకూడదు.
– డాక్టర్ విరజారావు, సైకాలజీ ప్రొఫెసర్