పసి నిద్రలో... పస ఎంతో!
కడుపునిండా పాలు, కంటినిండా నిద్ర…ఇదే పసిపిల్లల జీవన ఎజెండా. పొట్ట ఖాళీ అయినా, నిద్ర పట్టకపోయినా తమ ఏడుపుతో తల్లిదండ్రులకు, ఇంట్లో వారికి చుక్కలు చూపిస్తుంటారు. పసిపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే ఈ తాత్కాలిక సమస్యలే కాదు, భవిష్యత్తులో మరికొన్ని మానసిక సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సంవత్సరం వయసులో సరిగ్గా నిద్రపోని పిల్లల్లో మూడు, నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏకాగ్రతా లోపం, ప్రవర్తనా సమస్యలు తలెత్తినట్టుగా ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. చిన్నారులు రాత్రులు సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారి చిరాగ్గా ఉండటం గమనిస్తుంటామని, అయితే […]
కడుపునిండా పాలు, కంటినిండా నిద్ర…ఇదే పసిపిల్లల జీవన ఎజెండా. పొట్ట ఖాళీ అయినా, నిద్ర పట్టకపోయినా తమ ఏడుపుతో తల్లిదండ్రులకు, ఇంట్లో వారికి చుక్కలు చూపిస్తుంటారు. పసిపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే ఈ తాత్కాలిక సమస్యలే కాదు, భవిష్యత్తులో మరికొన్ని మానసిక సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సంవత్సరం వయసులో సరిగ్గా నిద్రపోని పిల్లల్లో మూడు, నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏకాగ్రతా లోపం, ప్రవర్తనా సమస్యలు తలెత్తినట్టుగా ఒక కొత్త అధ్యయనం చెబుతోంది.
చిన్నారులు రాత్రులు సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారి చిరాగ్గా ఉండటం గమనిస్తుంటామని, అయితే గాఢనిద్ర పోలేకపోవడం అనే సమస్య వారికి భవిష్యత్తులో మానసిక సమస్యలు తెచ్చిపెడుతుందని ఇందులో తేలింది. ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. సంవత్సరం వయసున్న 87మంది పిల్లలు, వారి తల్లిదండ్రులపై ఈ పరిశోధన నిర్వహించారు. పిల్లల చేతికి వారి నిద్రకు సంబంధించిన విషయాలను నమోదు చేసే పరికరాలను కట్టి వారు గాఢంగా నిద్రపోతున్నారా లేదా అనే విషయాన్ని గమనించారు.
ఈ అధ్యయనం అనంతరం పిల్లలకు మూడు నాలుగేళ్లు వచ్చాక అప్పుడప్పుడు వెళ్లి వారిలో ఏకాగ్రత ఏస్థాయిలో ఉన్నది అనే విషయాన్ని కంప్యూటర్ ద్వారా పరీక్షించారు. అలాగే పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులను ప్రశ్నలు వేశారు. ఇందులో ఇంతకుముందు అధ్యయనంలో ఎవరైతే సరిగ్గా నిద్రపోలేకపోయారో, ఆ పిల్లల్లో ఏకాగ్రత, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు స్పష్టంగా గమనించారు.
కొన్నిరకాల జన్యువులు, పిల్లలు పెరుగుతున్న వాతావరణం ఇవి రెండూ వారి నిద్రని ప్రభావితం చేస్తున్నాయని తద్వారా వారిలో ఏకాగ్రత లోపం, మానసిక సమస్యలు కలుగుతున్నాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్లో నిద్రలేమి సమస్యలను పసితనంలో గుర్తించి సరిచేయడం ద్వారా వారికి ఆ కారణంగా భవిష్యత్తులో ప్రవర్తనాపరమైన లోపాలు రాకుండా నివారించవచ్చని వారు సలహా ఇస్తున్నారు.