పవన్‌కు అమరావతి ఆహ్వానం ఎలా?
అమరావతి శంకుస్థాపనకు మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తారా అన్న చర్చజరిగింది. నేరుగా తానే కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆ చర్చకు తెరపడింది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌పైకి ఫోకస్ మళ్లింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమిని భూజానికెత్తుకుని గెలుపులో సాయం చేసిన పవన్‌కు ఎలా ఆహ్వానిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఇంటికి వెళ్లిన తరహాలోనే పవన్ ఇంటికి చంద్రబాబు కూడా వెళ్లారా లేక సీనియర్ నేతలను పంపిస్తారా […]
అమరావతి శంకుస్థాపనకు మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తారా అన్న చర్చజరిగింది. నేరుగా తానే కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆ చర్చకు తెరపడింది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌పైకి ఫోకస్ మళ్లింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమిని భూజానికెత్తుకుని గెలుపులో సాయం చేసిన పవన్‌కు ఎలా ఆహ్వానిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
కేసీఆర్ ఇంటికి వెళ్లిన తరహాలోనే పవన్ ఇంటికి చంద్రబాబు కూడా వెళ్లారా లేక సీనియర్ నేతలను పంపిస్తారా అన్న దానిపై నేతలు ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఇంటికి చంద్రబాబు ఇప్పటి వరకు వెళ్లలేదు. పవన్ కల్యాణే చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఇప్పుడు ఆహ్వానపత్రాన్ని అందజేయాలంటే పవన్ ఇంటికే వెళ్లాల్సి ఉంటుంది.
శంకుస్థాపనకు పవన్‌ను ఆహ్వానించడం అయితే ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎవరు వెళ్లి ఆహ్వానించాలన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఓ దశలో లోకేష్ బాబు పంపితే ఎలా ఉంటుందని కొందరు నేతలు సలహా ఇవ్వబోయారని సమాచారం. అయితే ప్రభుత్వంలో ఏ హోదా లేని లోకేష్‌ను ఎలా పంపుతామంటూ ఆ ఐడియాను ఆదిలోనే తుంచేశారట. వెళ్తే నేరుగా చంద్రబాబే వెళ్లాల్సి ఉంటుందని… దాని వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటన్న దానిపైనా లెక్కలేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో సాయం చేశారు కాబట్టి నేరుగా చంద్రబాబు వెళ్లడమే సబబని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం సీఎం నేరుగా వెళ్లడం వల్ల పవన్ అంటే గౌరవం, అభిమానానికి మించి ఏదో ఫీలింగ్ టీడీపీకి ఉందన్న భావన ప్రజల్లో కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నేరుగా ఆహ్వానించకపోతే పవన్ కల్యాణ్ నొచ్చుకునే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద దీనిపై చంద్రబాబునే ఓ నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలు చెబుతున్నారు.