జగన్ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న జాతీయ మీడియా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరాహారదీక్షకు అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించడాన్ని నేతలంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు విజయనగరం నుంచి అనంతపురం వరకు జగన్‌కు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దీక్షకు జాతీయ మీడియా ప్రచారం లభించక పోవడాన్ని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంటే నిరుద్యోగాన్ని పాలదోలడమేనని, పారిశ్రామికీకరణకు పునాదులు పడడమేనని… ఇంతముఖ్యమైన విషయాన్ని జాతీయ మీడియా నిర్లక్ష్యం […]
జాతీయ మీడియా పట్టించుకుంటేనే కేంద్రం దృష్టికి సమస్య వెళుతుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేసే దీక్షను ఉపేక్షించడం సరికాదని అమర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడుచోట్ల జగన్ దీక్షకు మద్దతుగా ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. తిరుపతిలో, గుంటూరులోని జగన్ దీక్ష స్థలిలో ఇద్దరు వ్యక్తులు పెట్రలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా… కడప జిల్లా రాజంపేటలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష శిబిరం వద్ద ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్‌చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిపై నీళ్లు పోసి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అక్కడే బోటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను కింద పారబోశారు.
గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం తాడిపత్రిలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో దీక్షలు చేపట్టిన దాదాపు 30 మంది కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని గంగమ్మను వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ జి వి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు.