తెలంగాణ బీజేపీలో లుకలుకలు
తెలంగాణ బీజేపీలో లుకలుకలు మెల్లిగా బయటపడుతున్నాయి. మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే! నగరంలో ఇద్దరు కేంద్రమంత్రులు పాల్గొన్న పార్టీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో బట్టబయలైంది. ఓ వైపు గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో విభేదాలు బయటపడటంపై కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనైక్యత ఇలాగే కొనసాగితే.. బల్దియా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. […]
తెలంగాణ బీజేపీలో లుకలుకలు మెల్లిగా బయటపడుతున్నాయి. మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే! నగరంలో ఇద్దరు కేంద్రమంత్రులు పాల్గొన్న పార్టీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో బట్టబయలైంది. ఓ వైపు గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో విభేదాలు బయటపడటంపై కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనైక్యత ఇలాగే కొనసాగితే.. బల్దియా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఏం జరిగింది?
నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి హర్షవర్దన్ వచ్చారు. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో జన చైతన్య సభను ఏర్పాటు చేసింది పార్టీ. ఈ సమావేశానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథ్ గైర్హాజరయ్యారు. కనీసం ఫోన్‌లోనూ అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారు. సొంత నియోజకవర్గంలో ఇద్దరు కేంద్రమంత్రులు, బండారు దత్తాత్రేయ, హర్షవర్దన్‌లు పార్టీ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసీ ఆయనెందుకు రాలేదన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది.
కిషన్ రెడ్డి వర్గమే కారణమా?
రాజా సింగ్ లోథ్ పార్టీలో చేరినప్పటి నుంచి బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వర్గం అతనిపై అసంతృప్తిగా ఉందని సమాచారం. రాజాసింగ్ పాతబస్తీలో వివాదాస్పదమైన హిందూవాదిగా పేరొందారు. అనేక సంఘవ్యతిరేక కార్యక్రమాల్లో ఆయన హస్తం ఉందని పోలీసులు అనేకసార్లు పేర్కొన్నారు. ఆయనకు ఉత్తర భారతదేశంలోని హిందూ ఆధ్యాత్మిక సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను హతమారుస్తామని పలుమార్లు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదయ్యాయి. ఆలె నరేంద్ర తరువాత పాతబస్తీలోని గుజరాతీలు, లోథ్‌లు, మార్వాడీలు, ఇతర హిందూ వర్గాలకు నాయకుడిగా మారారు. హిందూ చైతన్య సభలు సమావేశాలు నిర్వహించి స్థానికంగా పాపులర్ అయ్యారు. అయితే, రాజాసింగ్ పార్టీలోకి వస్తే ఎప్పటికైనా పార్టీకి ఇబ్బంది అవుతుందని ఆయనకు టికెట్ ఇవ్వకుండా కిషన్‌రెడ్డి వర్గం ప్రయత్నం చేసిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో తమకు సైతం సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి బండారు దత్తాత్రేయ వర్గానికి ఎప్పటి నుంచో ఉంది. దీంతో ప్రస్తుతం పార్టీలో 3 గ్రూపులు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. విచిత్రమైన విషయం ఏంటంటే నగరంలో పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా టీడీపీ మద్దతుతోనే గెలిచిన విషయం జగమెరిగిన సత్యం!