బీహార్‌లో ఓటమికి బీజేపీ సిద్ధపడిందా?
బీహార్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. ఎన్‌డీఏ- జేడీయూ కూటముల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావడంతో మోదీ సేన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీ నేర్పిన గుణపాఠాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఓడినపుడు ప్రజలు మార్పు కోరుకున్నారని సరిపెట్టుకున్నా.. బీహార్‌లో ఆ సమాధానం పనికిరాదు. ఈ ఎన్నికల ఫలితాలపై కేవలం బీహార్లోనే కాదు, దేశంతోపాటు విదేశాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకాలం వివిధ రాష్ట్రాల్లో సాధిస్తున్న […]
బీహార్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. ఎన్‌డీఏ- జేడీయూ కూటముల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావడంతో మోదీ సేన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీ నేర్పిన గుణపాఠాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఓడినపుడు ప్రజలు మార్పు కోరుకున్నారని సరిపెట్టుకున్నా.. బీహార్‌లో ఆ సమాధానం పనికిరాదు. ఈ ఎన్నికల ఫలితాలపై కేవలం బీహార్లోనే కాదు, దేశంతోపాటు విదేశాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకాలం వివిధ రాష్ట్రాల్లో సాధిస్తున్న విజయాలు మోదీ పాలనకు ప్రజలు ఇస్తున్న తీర్పు అంటూ చెప్పుకొస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
రాజ్ నాథ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
కేంద్ర హోంమంత్రి తాజాగా చేసిన కామెంట్లు గెలుపుపై బీజేపీకి అంతగా నమ్మకంగా లేదనే విషయాన్ని బలపరుస్తున్నాయి. బీహార్‌లో బీజేపీ గెలుపు ప్రతిష్ఠాత్మకమైనదేనని, ఒకవేళ గెలువకపోయినా అభివృద్ధిని ఆపబోమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం అన్నారు. కేంద్ర హోం మంత్రిగా వివిధ నిఘా సంస్థల నివేదికలు ఏ రోజుకారోజు ఆయనకు అందుతాయి. వాటి ఆధారంగా మాట్లాడారా? అన్న అనుమనాలు తలెత్తుతున్నాయి. పైగా తొలి దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి.
నితీశ్ కు స్నేహహస్తమేనా?
ఓడిపోయినా అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం వెనక మతలబు ఏంటి? అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సాగుతున్న చర్చ ఇది. బీజేపీ వ్యూహాత్మకంగా తన పాత మిత్రునికి స్నేహహస్తం చాటుతుందని కొందరు విశ్లేషిస్తుండగా.. బీజీపీ నేతలు మాత్రం తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనకుండా నితీశ్ కుమార్‌కు బీజేపీ ముందుగానే సంకేతాలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్‌లోనూ పీడీపీ- బీజేపీలు తొలుత కత్తులు దూసుకున్నాయి. తరువాత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఒకవేళ ఓడితే.. అదే ఫార్ములాను ఇక్కడా ఉపయోగించుకోవాలని బీజేపీ యోచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.