Telugu Global
Others

ఛాన్సలర్ల హోదా... విద్యా విలువలకు పాతర?

విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌ హోదాలో ఉండే గవర్నర్‌ను తొలగించడం ఒక వివాదమవుతుంటే వీటికి బ్రూర్యోక్రాట్లను, స్వామీజీలను, రాజకీయ నాయకులను నియమించాలనుకోవడం మరో వివాదానికి తెర తీసినట్టవుతోంది. తెలంగాణ సర్కారు మదిలోంచి పుట్టిన ఈ ఆలోచన విద్యా ప్రమాణాలను దిగజార్చడం మాట అటుంచి విశ్వ విద్యాలయాలను రాజకీయాల రొంపిలోకి తీసుకుపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్‌లుగా విద్యావేత్తలను కాకుండా  అధికారులను నియమించడమే పెద్ద వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఏకంగా ఛాన్సలర్‌ల వ్యవస్థనే రూపుమాపే విధంగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం […]

ఛాన్సలర్ల హోదా... విద్యా విలువలకు పాతర?
X
cpvvsవిశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌ హోదాలో ఉండే గవర్నర్‌ను తొలగించడం ఒక వివాదమవుతుంటే వీటికి బ్రూర్యోక్రాట్లను, స్వామీజీలను, రాజకీయ నాయకులను నియమించాలనుకోవడం మరో వివాదానికి తెర తీసినట్టవుతోంది. తెలంగాణ సర్కారు మదిలోంచి పుట్టిన ఈ ఆలోచన విద్యా ప్రమాణాలను దిగజార్చడం మాట అటుంచి విశ్వ విద్యాలయాలను రాజకీయాల రొంపిలోకి తీసుకుపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్‌లుగా విద్యావేత్తలను కాకుండా అధికారులను నియమించడమే పెద్ద వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఏకంగా ఛాన్సలర్‌ల వ్యవస్థనే రూపుమాపే విధంగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు విశ్వవిద్యాలయాలకు గవర్నర్‌లే ఛాన్సలర్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరిని ఆ హోదా నుంచి తొలగించడానికి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానంలో ఎవరిని పెడతారన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఇప్పడిప్పుడే దీనిపై వస్తున్న వార్తలు చూసి విద్యావేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా రియల్‌ ఎస్టేట్‌ అధిపతి, మై హోం అధినేత రామేశ్వరరావును నియమించాలన్న ఆలోచన బయటపడింది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా త్రిదండి చినజీయర్‌ స్వామిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన యూనివర్శిటీలకు ముఖ్యమంత్రే స్వయంగా ఛాన్సలర్‌గా ఉండడానికి నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. దీంతో విద్యావేత్తల నుంచి విపక్ష రాజకీయ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యావేత్తలయితే ప్రభుత్వం తప్పటడుగులు వేసినప్పుడు వాటిని వేలెత్తి చూపడానికి అవకాశం ఉంటుందని, ముఖ్యమంత్రే విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌ అయిన పక్షంలో ఆ స్వేచ్ఛ హరించుకు పోతుందని అంటున్నారు. విద్యార్థులకు కూడా తగిన స్వేచ్ఛా వాతావరణం ఉండదంటూ ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉండి ఉంటే విద్యార్థులకు ఆందోళనలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడాలే తప్ప నిర్వీర్యం చేయడానికి కాదని అంటున్నారు విద్యావేత్తలు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి సుబ్రమణ్యస్వామిని వైస్‌ ఛాన్సలర్‌గా నియమిస్తామన్న ప్రకటనతోనే ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిందని, దాంతో బీజేపీ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గిందని… అలాంటిది ఏకంగా ఛాన్సలర్‌ స్థానంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూర్చుంటుందంటే దీని అర్ధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, స్వాములుకు పట్టం గట్టాలనుకుంటే అనేక కార్పొరేషన్లు ఉన్నాయని, అక్కడి పీఠాలపై వారిని అధిష్టించుకోవచ్చని… అంతేకాని ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా నిలిచే విద్యావ్యవస్థలోకి ఇలాంటి శక్తులను ప్రవేశింపజేస్తే సహించబోమని కూడా హెచ్చరిస్తున్నారు.
స్వయం ప్రతిపత్తితో నడిచే విశ్వవిద్యాలయాలకు అసలు రాజకీయ మకిలిని అంటించాలనుకోవడమే పెద్ద తప్పని, ఇది చట్టపరిధిలో కూడా నిలబడదని విద్యావేత్త నాగేశ్వర్‌ అంటున్నారు. తాము నిధులు కేటాయిస్తున్నాం కదా అని అన్ని సంస్థలపై పెత్తనం చేయాలనుకుంటే అది సాధ్యం కాదని, యూనివర్శిటీలకు ప్రధాన ఆర్థిక వనరు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అని, అసలు మెజారిటీ యూనివర్శిటీల పర్యవేక్షణ అంతా ఆ సంస్థ కనుసన్నలలో జరుగుతుందన్న విషయాలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన అంటున్నారు. ఐటీడీఏ, న్యాయశాఖ, ఎన్నికల సంఘం వంటి ఎన్నో సంస్థలు ప్రభుత్వం నుంచే నిధులు పొందుతున్నా వాటిపై పెత్తనం చేసే అధికారం ప్రభుత్వాలకు ఉండని విధంగా మన రాజ్యాంగం రూపొందించారని, ఈ విషయాన్ని మేధావులమని చెప్పుకునేవారు గుర్తించలేక పోతున్నారని ఆయన అన్నారు. చట్టానికి నిలబడని వాటిలో జోక్యం చేసుకుని ఆ తర్వాత కోర్టులతో మొట్టికాయలు తినే పరిస్థితి మంచిది కాదని గుర్తిస్తే ప్రభుత్వాల పరువు నిలబడుతుందని అంటున్నారు.
– పీఆర్‌ చెన్ను
First Published:  9 Oct 2015 12:06 PM IST
Next Story