పరిటాల శ్రీరామ్ పేరుతో పౌర సరఫరాల శాఖలో దందా?
పరిటాల రవి… ఈ పేరు చెప్పగానే నక్సల్ నేపథ్యం… ఆ తర్వాత రాజకీయ వైభవం గుర్తొస్తుంది. ఆయన హత్యానంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆయన భార్య పరిటాల సునీతను చేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటిచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగాఉన్న పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పి కొంతమంది సదరు మంత్రి శాఖలో దందాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగిన… జరుగుతున్న […]
పరిటాల రవి… ఈ పేరు చెప్పగానే నక్సల్ నేపథ్యం… ఆ తర్వాత రాజకీయ వైభవం గుర్తొస్తుంది. ఆయన హత్యానంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆయన భార్య పరిటాల సునీతను చేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటిచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగాఉన్న పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పి కొంతమంది సదరు మంత్రి శాఖలో దందాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగిన… జరుగుతున్న దందాలకు పరిటాల శ్రీరామ్ పేరు మారుమోగుతోంది. వసూళ్ళ పర్వానికి ఆయన కేరాఫ్ అడ్రస్‌గా చెబుతున్నారు. ఇదెంతవరకు వెళ్ళిందంటే పరిటాల శ్రీరామ్ పేరుతో తమను బెదిరిస్తున్నారని, ఆయన కుటుంబం పేరు చెప్పి తమను దబాయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.
ఇపుడు ఇది రాష్ట్ర వ్యాప్తమైంది. శ్రీరామ్ తల్లి సునీత పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకుని పరిటాల సునీత పేరు చెప్పి గోడౌన్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పేషీలోని ఒక ముఖ్య వ్యక్తి ఈ దందాలకు పాల్పడుతున్నాడని.. భారీగా కమీషన్లను వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఆయన పరిటాల కుటుంబం పేరును ఉపయోగిస్తూ దందా నడపడంతో ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖ అధికారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలే ఆ శాఖ అవినీతికి కొలువు. రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల తర్వాత పౌరసరఫరాల శాఖే అవినీతిలో స్థానం సంపాదించుకుంది. ఆ శాఖలో కొంతమంది వ్యక్తులు జొరబడి అవినీతికి ఆజ్యం పోస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మంత్రిగారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం వెనుక పరిటాల శ్రీరామ్ మనుషుల హస్తముందా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనంతపురం దందాలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయ్ గొడౌన్‌లకు వ్యాపించడం వెనుక నిజాలేమిటో బయటకు రావాలంటే పరిటాల సునీత పెదవి విప్పాలి.