Telugu Global
Others

నాగంతో రేవంత్ కు చెక్...

టీటీడీపీపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అంతే స్థాయి ప్రతిఘటన ఎదురవుతోంది.జూనియర్ అయిన రేవంత్‌ను పూర్తి స్థాయిలో నాయకుడిగా అంగీకరించేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. రేవంత్ రెడ్డిని ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనక్కుతగ్గారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి నుంచి భవిష్యత్తులోనైనా తమకు ప్రమాదం ఉందని భావిస్తున్న సీనియర్లు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారట. మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన […]

నాగంతో రేవంత్ కు చెక్...
X

టీటీడీపీపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అంతే స్థాయి ప్రతిఘటన ఎదురవుతోంది.జూనియర్ అయిన రేవంత్‌ను పూర్తి స్థాయిలో నాయకుడిగా అంగీకరించేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. రేవంత్ రెడ్డిని ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనక్కుతగ్గారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి నుంచి భవిష్యత్తులోనైనా తమకు ప్రమాదం ఉందని భావిస్తున్న సీనియర్లు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారట.

మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన నాగం జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా రేవంత్ దూకుడుకు బ్రేక్ వేయవచ్చని భావిస్తున్నారు. నాగం ద్వారా రేవంత్‌కు బ్రేకులెలా పడుతాయన్న దానిపై వారు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డి వీలు దొరికినప్పుడల్లా తనకు నాయకత్వం అప్పగిస్తే తెలంగాణలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం మొత్తం టీడీపీ వైపు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన నాగంను పార్టీలో తెస్తే తానొక్కడినే టీడీపీలో రెడ్డి బ్రాండ్ అని చెప్పుకునే అవకాశం రేవంత్‌కు ఉండదని చెబుతున్నారు.

పైగా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం పార్టీలోకి వస్తే కొద్దికాలానికి ఆయనే ఉన్నత నాయకత్వం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కుర్రాడైన రేవంత్‌ రెడ్డి కింద పనిచేయడం కన్నా సీనియర్ అయినా నాగం జనార్దన్ రెడ్డి కింద పనిచేయడమే గౌరవంగా ఉంటుందని ఇతర సీనియర్లు చెబుతున్నారు. గతంలో టీడీపీలో సీనియర్‌గా ఉన్నప్పటికీ మధ్యలో పార్టీ వీడి వెళ్లారు కాబట్టి నాగం జనార్దన్ రెడ్డి పార్టీని మొత్తం తన అధీనంలోకి తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. దీని వల్ల నాగం తమపై ఆధిపత్యం చెలాయించలేరని భావిస్తున్నారు.

మరీ ముఖ్యంగా నాగం, రేవంత్ ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాగం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే రేవంత్‌ దూకుడుకు జిల్లాలోనే కళ్లెం వేయవచ్చన్నది సీనియర్ల భావనగా తెలుస్తోంది. మరి బాగా తిట్టి పార్టీని వీడిన నాగం పట్ల చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న దానికి… రాజకీయాల్లో తిట్టుకోవడం కలుసుకోవడం కామనే కదా అని తెలుగు తమ్ముళ్లు లైట్‌గా తీసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డిని ఒక్కసారి అధ్యక్షుడిని చేస్తే తెలంగాణలో పార్టీ మొత్తం అతడి చేతుల్లోకి వెళ్లిపోతుందన్న అనుమానం అధినాయకత్వంలోనూ ఉందని కాబట్టి నాగం రాకకు చంద్రబాబు అభ్యంతరం చెప్పబోరని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగంతో చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు.అన్నట్టు కొద్దికాలం క్రితం బీజేపీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ బచావో పేరుతో సంస్థను పెట్టారు. అయితే దాని ప్రభావం పెద్దగా లేదు.

First Published:  7 Oct 2015 1:08 AM GMT
Next Story