సునీల్ గవాస్కర్ అంత కోపం ఎందుకు?
కటక్ లో సోమవారం భారత్- దక్షిణఫ్రికా మధ్య జరిగిన 20-20 మ్యాచ్లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసిరిన సంగతి తెలిసిందే! బాపూజీ- మండేలా పేరుతో నిర్వహిస్తున్న ఈ సిరీస్ కు ఇలాంటి అవాంతరాలు ఎదురవడం బీసీసీఐకి చెడ్డ పేరు తెచ్చే ఘటనే! భారత్ అతి తక్కువ పరుగులకు ఔటవడం ఆగ్రహం కలిగించేదే! ప్రేక్షకులు కొంచెం పరిధి దాటి ప్రవర్తించారు. దీన్ని ప్రపంచ క్రికెట్ పెద్దలు తప్పుబడుతున్నారు. ప్రత్యేకించి సునీల్ గవాస్కర్కు అరికాలి మంట […]
కటక్ లో సోమవారం భారత్- దక్షిణఫ్రికా మధ్య జరిగిన 20-20 మ్యాచ్లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసిరిన సంగతి తెలిసిందే! బాపూజీ- మండేలా పేరుతో నిర్వహిస్తున్న ఈ సిరీస్ కు ఇలాంటి అవాంతరాలు ఎదురవడం బీసీసీఐకి చెడ్డ పేరు తెచ్చే ఘటనే! భారత్ అతి తక్కువ పరుగులకు ఔటవడం ఆగ్రహం కలిగించేదే! ప్రేక్షకులు కొంచెం పరిధి దాటి ప్రవర్తించారు. దీన్ని ప్రపంచ క్రికెట్ పెద్దలు తప్పుబడుతున్నారు. ప్రత్యేకించి సునీల్ గవాస్కర్కు అరికాలి మంట నెత్తికంటింది. ఏకంగా కటక్ మైదానంపై రెండేళ్లపాటు నిషేధం విధించాలంటున్నాడు. అంతేనా! రెండేళ్లపాటు ఆ మైదానానికి బీసీసీఐ నుంచి నిధులను కూడా ఆపాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ ధోనీ లైట్ తీసుకున్నా సన్నీకి ఎందుకు ఇంత కోపం వస్తోంది..? అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటి కాలం అంటే.. ప్రత్యేకించి టీనేజీ కుర్రాళ్లకు తెలియని ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది..! దాని వల్లే సునీల్ ప్రేక్షకులపై అంతగా మండిపడుతున్నాడు.
కోల్ కత్తా లో జరిగిన పరాభవమే కారణమా!
భారత్లో సన్నీ గొప్ప క్రికెటర్! అందులో అనుమానేం లేదు. అదే సమయంలో అత్యంత జిడ్డు బ్యాట్స్ మెన్ అన్న విమర్శ కూడా ఉంది. పరుగులు చేయకున్నా.. పిచ్ ను వదిలేవాడు కాదని చాలా సార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. జట్టు ఆలౌటైనా.. ప్రత్యర్థులు ఈసారి కూడా సన్నీని ఔట్ చేయలేకపోయారు.. అని పత్రికలు చురకలంటించేవి అంటే.. మనోడి ఆటతీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
1984-85 లో ఇండియా- ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతోంది. ఇండియా తొలుత బ్యాటింగ్. రెండురోజులుగా బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 7 వికెట్ల నష్టానికి కేవలం 437 పరుగులు మాత్రమే చేసింది. దీంతో విసిగిపోయిన ప్రేక్షకులు గవాస్కర్ డౌన్! గవాస్కర్ ఔట్! అని అరవసాగారు. సూటిగా చెప్పాంటే.. అవుటు కావయ్యా బాబూ..! నత్తలా నడిచే ఆట తీరు చూడలేకపోతున్నాం.. అంటూ నినాదాలు మొదలు పెట్టారు. ప్రేక్షకులు అరుస్తున్నా..సన్నీ పట్టించుకోలేదు. దీంతో ఓ పోలీసు ఉన్నతాధికారి సన్నీ దగ్గరికి వెళ్లి.. సార్! ప్రేక్షకులను నియంత్రించలేకపోతున్నాం.. వాళ్లు శాంతించాలంటే.. దయచేసి మీరు ఔటవ్వాలి! అని కోరాడు. అయినా సన్నీ లెక్క చేయలేదు. ఎట్టకేలకు బారత్ టీమ్ ఆలౌటైంది. తరువాత ఇండియా ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చింది. సన్నీని చూడగానే ప్రేక్షకుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఒక్కసారిగా అతనిపై పళ్లు, బాటిళ్లు, కాగితాలు విసిరడం మొదలు పెట్టారు. 30 ఏళ్ళ క్రితం జరిగిన ఆ ఘటనను సన్నీ ఇంకా మర్చిపోయినట్లు లేడు. అందుకే కటక్ ఘటనపై అంతగా ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు.