ప్రతి రోజూ…మనరోజు కావాలంటే...!
నిద్రలేచామా… రోజంతా పనులు చేశామా…ఇంటికి వచ్చామా…. మళ్లీ నిద్రపోయామా… అన్నట్టుగా రోజులు గడిచిపోతుంటే, కొన్నాళ్లకు జీవితం అంటే విసుగొస్తుంది. వస్తువులకు మనకు తేడా లేదనిపిస్తుంది. అలాకాకుండా ప్రతిరోజూ ఆహ్లదంగా మొదలై, సంపూర్ణంగాసద్వినియోగం కావాలంటే, జీవితం నిజంగా జీవించినట్టుగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి…వాటిని పాటించాలి- -సంగీతం స్థబ్దతని వదిలిస్తుంది. నీరు ప్రవహించినట్టుగా మనల్ని కదిలిస్తుంది. అందుకే మన మూడ్ రొటీన్‌లోకి పడకముందే ఉదయాన్నే మనకు నచ్చిన మ్యూజిక్‌ని కాసేపు వినాలి. -ఓ కొత్తరోజు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాలంటే శరీరం అప్పుడే తయారుచేసిన మెషిన్లా చురుగ్గా పనిచేయాలి. […]
నిద్రలేచామా… రోజంతా పనులు చేశామా…ఇంటికి వచ్చామా…. మళ్లీ నిద్రపోయామా… అన్నట్టుగా రోజులు గడిచిపోతుంటే, కొన్నాళ్లకు జీవితం అంటే విసుగొస్తుంది. వస్తువులకు మనకు తేడా లేదనిపిస్తుంది. అలాకాకుండా ప్రతిరోజూ ఆహ్లదంగా మొదలై, సంపూర్ణంగాసద్వినియోగం కావాలంటే, జీవితం నిజంగా జీవించినట్టుగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి…వాటిని పాటించాలి-
-సంగీతం స్థబ్దతని వదిలిస్తుంది. నీరు ప్రవహించినట్టుగా మనల్ని కదిలిస్తుంది. అందుకే మన మూడ్ రొటీన్‌లోకి పడకముందే ఉదయాన్నే మనకు నచ్చిన మ్యూజిక్‌ని కాసేపు వినాలి.
-ఓ కొత్తరోజు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాలంటే శరీరం అప్పుడే తయారుచేసిన మెషిన్లా చురుగ్గా పనిచేయాలి. అలసట, నిరాశా, నిస్పృహల్లాంటివి దరిచేరకూడదు.లోపలి అవయవాలన్నీ మేం రెడీ అన్నట్టుగా ఆరోగ్యంగా ఉండాలి…ఇవన్నీ నిజం కావాలంటే యోగా ఒక్కటే దారి. తప్పకుండా యోగాకి సమయం కేటాయించండి. శరీరం, మనసు మన అదుపులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. జీవితం ఎప్పుడూ ప్రస్తుతక్షణంలో మనసుపెట్టి జీవించడంలో ఉంటుంది…ఈ క్షణమే జీవితం అన్నట్టుగా. అందులోకి తీసుకువెళ్లేది యోగానే.
-కనీసం ఓ పావుగంటయినా ధ్యానం చేయండి. ఏకాగ్రత అనే అతి ముఖ్యమైన ఆయుధాన్ని ధ్యానం మనకు అందిస్తుంది. శ్వాసమీద ధ్యాస నిలిపి చేసే ధ్యానం…రోజంతా ఎలాంటి పరధ్యానం లేకుండా ఏకాగ్రతగా పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది.
-ఓ కొత్తరోజులోకి మన అడుగులు మార్నింగ్ వాక్‌తో పడితే మరింత మంచిది. శరీరానికి వ్యాయామం ఇస్తూ మనతో మనం గడిపేందుకు తగిన సమయం ఇది. మీ జీవిత లక్ష్యాలను గుర్తు తెచ్చుకుంటూ…లక్ష్యంవైపు సాగుతున్నట్టుగా ఉత్సాహంగా నడవండి. ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం…ఇవన్నీ మార్నింగ్ వాక్ పేరుతో మనం వేసే వేల అడుగుల దూరంలో ఉన్నాయి. వాటిని చేరేందుకు రోజూ నడవండి.
-ప్రార్థన…లేదా మనకు జీవితం నుండి అందిన మంచి విషయాలకు విశ్వశక్తికి కృతజ్ఞత తెలపడం…ఇది మానసిక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రార్థన చేసేవారికి ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు దరిచేరవు. ప్రార్థన ద్వారా ఈ ప్రపంచంలో మనకూ స్థానం ఉందని, ఆనందంగా జీవించే హక్కు ఉందనే విషయం మనసుకి అర్థమవుతుంది. లోపల అలలై పొంగే ఉద్వేగాలు శాంతిస్తాయి. సహనం అలవడుతుంది. ప్రార్థన సమయంలో మీకు నచ్చిన మాటని పదేపదే అనుకున్నాఅది మంత్రంలా పనిచేస్తుంది.
-ఇక ఒక కప్పు హెర్బల్ టీని ఉదయాన్నే సేవించడం వలన శరీరమంతా పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఉదయపు ఆహ్లాదాన్ని ఆస్వాదించినట్టుగానే ఉంటుంది. ఉదయం జీవక్రియ తిరిగి చురుగ్గా మొదలుకావాలంటే నిమ్మరసం కలిసిన గోరువెచ్చని నీళ్లు సైతం అద్భుతంగా పనిచేస్తాయి.
-మీరు వృత్తి రీత్యా ఆన్‌లైన్లో వ్యవహారాలు నడిపేవారయితే ఉదయాన్నే సిస్టమ్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్‌చేయడం, ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం లాంటివి చేయకండి. మీ మనసుకి నచ్చేవి, మార్నింగ్ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచేవి అయిన… విషయాలను చదవండి.
-విటమిన్ డి…మనసుని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లేత సూర్యుని కిరణాల్లో ఉన్న ఈ ఔషధశక్తిని పోనివ్వకండి. కొన్ని నిముషాలపాటు ఉదయపు ఎండ శరీరానికి తగిలితే ఎముకల వ్యాధులు రావు, మనసూ ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం పదినిముషాల పాటు మన శరీరానికి సూర్యకిరణాలు తాకడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గి, గుండె ఆరోగ్యం పెరుగుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చని, మానసికసమస్యలు ఉండవని అధ్యయనాలు చెబుతున్నాయి.
-ఉదయం పూట శరీరానికి పుష్టినిచ్చే పోషకాలున్న అల్పాహారం తప్పనిసరి. అది రోజంతా అలసట లేకుండా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
-ఈ రోజు మన చేతుల్లో ఉండాలంటే నిన్నటిరోజున మనం దీని గురించి కాస్త ఆలోచించాలి…అంటే రేపేం చేయాలి…అనే ప్రణాళిక ఉంటే, మన మైండ్ గందరగోళం లేకుండా ఆ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తుంది. ఒక రోజు ముందు కాకపోయినా ఉదయాన్నే అయినా ఈ పనిచేయాలి.
-రీడింగ్ మంచి హ్యాబిట్ అనేది అందరికీ తెలిసిందే. మనకెంతో నచ్చిన అంశాలు, చదవాల్సినవి ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి. అవి చదువుతున్నపుడు కలిగే ఆనందం ఎవరికి వారు అనుభవించాల్సిందే. మీకు నచ్చిన పుస్తకం ఏదైనా సరే…దానికి కాస్త సమయం కేటాయించుకోండి. రోజంతా బిజీ కాబట్టి ఓ అరగంట ముందు లేచి ఆ పనిచేసినా….రోజుకి అదో మంచి ప్రారంభం అవుతుంది.
-ఉదయాన్నే ఉన్న మూడ్ రోజంతా మనపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పొద్దున్నే కొన్ని మంచి మాటలను మీకు మీరు చెప్పుకోండి. అవే మార్నింగ్ ఫర్మేషన్స్…నేనీపని చేయగలను…చేస్తాను…లాంటివి. మీ శక్తి సామర్ధ్యాలపై మీకు నమ్మకం పెంచే మంచి మాటలు ఇవి. నిజంగా మ్యాజిక్ చేస్తాయి.
-సాధారణంగా నిద్రపోయే ముందు డైరీ రాయడం ఒక అలవాటు. కానీ ఉదయాన్నే మీ పర్సనల్ డైరీలో మీ ఆలోచనలను, ఆశయాలను అక్షరాల్లో పెట్టి రాయడం అలవాటు చేసుకోండి. అందమైన కవితలు అల్లండి. సృజనాత్మకత అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.
-ఉదయాన్నే మౌనంగా ప్రకృతిని చూడడం అలవాటు చేసుకోండి. పచ్చని చెట్లు, అందమైన పరిసరాలు లేకపోతే ఉదయపు ఆకాశాన్ని చూసినా ఎంతో హాయిగా ఉంటుంది. ప్రకృతిలో మమేకం కావడం అంటే మనల్ని మనం తరచి చూసుకున్నట్టుగా ఉంటుంది. ప్రశాంతంగా, కూల్‌గా అనిపిస్తుంది. మెదడులోని భారాలన్నీ తొలగిపోయి, ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి అలవాట్లు నిజంగా మన జీవితం మనచేతుల్లోనే ఉంది అనే ఫీలింగ్‌ని కలిగిస్తాయి. అభద్రతా భావం, అయోమయం లేని ఓ స్పష్టతని ఇస్తాయి. ఇవన్నీ ఉదయంపూట ఓ గంటా లేదా రెండుగంటల్లో ముగించే పనులు. తక్కువ సమయంలో పూర్తి చేసినా హడావుడిగా చేయకూడదు, మనసు పెట్టి, ఏకాగ్రతగా, ఆ గంటని పూర్తిగా మనకోసం మనం కేటాయించుకున్న సమయంగా భావించి చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
-వి.దుర్గాంబ