హతవిధీ... తినే పండ్లలోనూ విషం!
ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు పళ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకుంటే చాలు, ఇక ఎలాంటి సమస్యలు ఉండవు…అనే సలహాలు వినబడుతుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో డైటింగ్‌లో భాగంగా వారానికి ఒక రోజు లేదా రోజులో ఒక పూట పళ్లు మాత్రమే తిని సరిపెట్టుకుంటున్నారు కొంతమంది. తియ్యని పళ్లు తమకు మంచి ఆరోగ్యం ఇస్తాయని నమ్మేవారికి ఇది చేదువార్తే. సాధారణంగా తీయని పళ్లను అమృత ఫలాలు అంటుంటాం. కానీ ఇకనుండి వీటిని విషఫలాలు అని సంబోధించాల్సి ఉంటుందేమో. విషయమేమిటంటే 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ఆహార ఉత్పత్తుల్లో పురుగుమందుల […]
ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు పళ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకుంటే చాలు, ఇక ఎలాంటి సమస్యలు ఉండవు…అనే సలహాలు వినబడుతుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో డైటింగ్‌లో భాగంగా వారానికి ఒక రోజు లేదా రోజులో ఒక పూట పళ్లు మాత్రమే తిని సరిపెట్టుకుంటున్నారు కొంతమంది. తియ్యని పళ్లు తమకు మంచి ఆరోగ్యం ఇస్తాయని నమ్మేవారికి ఇది చేదువార్తే. సాధారణంగా తీయని పళ్లను అమృత ఫలాలు అంటుంటాం. కానీ ఇకనుండి వీటిని విషఫలాలు అని సంబోధించాల్సి ఉంటుందేమో.
విషయమేమిటంటే 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ఆహార ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలను గుర్తించే ఒక పథకం కింద సంబంధిత అధికారులు దేశవ్యాప్తంగా 20,618 ఆహార ఉత్పత్తులను సేకరించి పరిశోధన జరిపారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వీటిలో ప్రభుత్వ అనుమతిలేని, పొలాలకు చల్లే పురుగుమందుల అవశేషాలు ఏకంగా 12.50 శాతం ఉన్నట్టుగా తేలింది. 2014-15 మధ్యకాలంలో సేకరించిన ఈ ఉత్పత్తులను 25 ప్రయోగశాలల్లో పరిశీలించారు. యాస్ఫేట్, బిఫెంత్రిన్, యాస్టామిప్రిడ్, ట్రియాజోఫస్, మెటలాక్సిల్, మాలథిన్ తదితర ప్రభుత్వ అనుమతి లేని పురుగుమందులు ఆహార ఉత్పత్తుల్లో ఉన్నాయా అనే విషయంమీద ఈ పరిశోధనలు నిర్వహించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడిస్తూ నివేదికను విడుదల చేసింది. పరీక్షించినవాటిలో 18.7శాతం శాంపిల్స్‌లో పురుగుమందుల అవశేషాలు కనిపించాయి. వీటిలో ప్రభుత్వ అనుమతి లేని పురుగుమందులు ఉన్న శాంపిల్స్ 12.5శాతం ఉన్నాయి. 543 (2.6శాతం) శాంపిల్స్‌లో అయితే ప్రభుత్వ అనుమతి ఉన్న పరిమితిని దాటి పురుగుమందుల అవశేషాలు కనిపించాయి. ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పరిమితిని విధిస్తుంది.
కూరగాయలు, పళ్లు, మసాలా దినుసులు, కారంపొడి, ఆకుకూరలు, బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, చేపలు, మాంసం, గుడ్లు, పాలు, టీలతో పాటు షాపుల్లో ఉపయోగించే నీటిని సైతం పరీక్షలకోసం శాంపిల్స్‌గా సేకరించారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించిన సేంద్రియ ఆహార ఉత్పత్తుల్లోనూ ఈ అవశేషాలు కనిపించడం.