తాగి..తూగి..ఊగితే పగలైనా ఊదాల్సిందే
కిక్ సూపర్ హిట్టయ్యింది. ఇక నుంచి కిక్-2 మొదలవబోతోంది. ఇదేమి సురేందర్‌రెడ్డి సినిమా సీక్వెల్ కాదండి. హైదరాబాద్, సైబరాబాద్ సూపర్ పోలీసులు సూపర్‌హిట్ ఫార్ములా. ఇప్పటివరకూ రాత్రిపూట మాత్రమే తాగి వాహనాలు నడిపేవారిని డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా పట్టుకునే వారు. అయితే వాహనాలు నడిపే తాగుబోతులు రాత్రితోపాటు పగటిపూట కూడా చెలరేగిపోతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో 24/7 తాగుబోతుల రూట్లో బ్రీత్ ఎనలైజర్లతో రోడ్డుపై మాటేయాలని నిర్ణయించారు. తూలుతూ వాహనాలను తోలే వారిని కట్టడి చేయడం తలకు […]
కిక్ సూపర్ హిట్టయ్యింది. ఇక నుంచి కిక్-2 మొదలవబోతోంది. ఇదేమి సురేందర్‌రెడ్డి సినిమా సీక్వెల్ కాదండి. హైదరాబాద్, సైబరాబాద్ సూపర్ పోలీసులు సూపర్‌హిట్ ఫార్ములా. ఇప్పటివరకూ రాత్రిపూట మాత్రమే తాగి వాహనాలు నడిపేవారిని డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా పట్టుకునే వారు. అయితే వాహనాలు నడిపే తాగుబోతులు రాత్రితోపాటు పగటిపూట కూడా చెలరేగిపోతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో 24/7 తాగుబోతుల రూట్లో బ్రీత్ ఎనలైజర్లతో రోడ్డుపై మాటేయాలని నిర్ణయించారు. తూలుతూ వాహనాలను తోలే వారిని కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారిన పోలీసులు ఈ సారి డే టైమ్ కూడా తనిఖీలు చేపడతారు. అయితే రాత్రివేళలా యూనిఫాంలలో కాకుండా మఫ్టీలో ఉండి మరీ కిక్కెక్కిన వారి తిక్క కుదిర్చేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్నారు.
బార్..పబ్‌ల దగ్గర మఫ్టీలో పోలీసులు
ఏదో ఒక జంక్షన్ దగ్గర కాపు కాసి తాగుబోతులను పట్టుకునే రోజులు పోయాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీలో డ్రంకెన్ డ్రైవ్ అంటే సినిమా ఛేజ్‌లు, సినిమాటిక్ ట్విస్ట్‌లతో అలరిస్తోంది. ఈ డ్రైవ్‌ను బాగా రసవత్తరమైన ఎపిసోడ్‌గా రక్తి కట్టించిన పోలీసులు తాగుబోతుల స్వైరవిహారాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదంటున్నారు. అందుకే జంక్షన్‌లను వదిలేసి నేరుగా పబ్‌లు, బార్ల దగ్గర మఫ్టీలో మాటేసి.. చిత్తుగా తాగి మత్తుగా బయటకొచ్చే బాబులను ఆనుపానులను వైర్‌లైస్ ద్వారా స్పెషల్ టీమ్‌కు అందజేస్తారు. ఆ ప్రత్యేక బృందం కూడా మఫ్టీలోనే మందుబాబులను ఫాలో అయి ఏదో ఒక జంక్షన్‌లో దొరకబుచ్చుకుని .. బ్రీత్ ఎనలైజర్ చేసి మరీ తాగిందంతా దింపేస్తారు. ఇది నయా డ్రంకెన్ డ్రైవ్ స్టైల్.
రాత్రీ పగలు ఎందుకంటే..
ఇటీవల కాలంలో సిటీ రోడ్డు ప్రమాదాల జోన్‌గా మారింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రమాద కారణాలు వెతుకుతున్న పోలీసులు.. ఓ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 1 ప్రయోగాత్మకంగా సిటీలోని కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లలో పగటిపూట డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. పంజాగుట్ట, బంజారాహిల్స్, అబిడ్స్, సికింద్రాబాద్ ఏరియాల్లో తనిఖీలు నిర్వహించారు. ఓ గంటన్నరపాటు బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షిస్తే.. మద్యం మత్తులో ఉండి వాహనాలు నడుపుతున్న 34 మంది చిక్కారు. దీంతో ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు పగటి పూట కూడా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి ప్రధానమైన జంక్షన్లలో ఏడు బృందాలు తనిఖీలు చేయగా 48 మంది తాగుబోతు వాహనచోదకులు పోలీసులకు చిక్కారు. తరువాత రోజు 82 మంది దొరికిపోయారు. వీరిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించిన పోలీసులు అవాక్కయ్యారు. వీరంతా మోతాదుకు మించి పదింతలు ఎక్కువ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని నివేదికలు వెల్లడించాయి. తాగుబోతు వాహనచోదకుల్లో ఆటోడ్రైవర్లే ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.