భోగాపురం ఎయిర్‌పోర్టును అడ్డుకుంటాం: జగన్
భోగాపురం విమానాశ్రయం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం భూ దోపిడీ చేస్తుందని ఏ విమానాశ్రయానికి లేని విధంగా వేలాది ఎకరాలు ఎందుకని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. విజయనగరం జిల్లా గూడెపువలసలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆయన అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, బాబు వస్తే జాబులొస్తాయని పేర్కొంటూ నిరుద్యోగులను మోసం చేశాడని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న రైతులను మోసం […]
భోగాపురం విమానాశ్రయం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం భూ దోపిడీ చేస్తుందని ఏ విమానాశ్రయానికి లేని విధంగా వేలాది ఎకరాలు ఎందుకని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. విజయనగరం జిల్లా గూడెపువలసలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆయన అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, బాబు వస్తే జాబులొస్తాయని పేర్కొంటూ నిరుద్యోగులను మోసం చేశాడని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న రైతులను మోసం చేసి భూములు లాక్కుని బయటి వ్యక్తులతో రియల్ ఎస్టేట్ చేయడం మంచి పద్దతి కాదని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును ఆపేందుకు అవసరమైతే కోర్టుకు వెళదామని, బాధితులకు తాము అండగా ఉంటామని జగన్ అన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసాల పుట్టఅని, అబ్దద్దాలు చెప్పడం ఆయన నైజమని, దౌర్జన్యం ఆయన పద్ధతని జగన్ విమర్శించారు. భూములు లాక్కోవడంలో ప్రధాని మోడి వెనకడుగు వేసినా చంద్రబాబునాయుడు దబాయించి లాక్కుంటున్నాడని జగన్ విమర్శించారు. అసలు ఎయిర్‌పోర్టుకు ఇంత భూమి ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కేరళ ఎయిర్‌పోర్టును 850 ఎకరాల్లో, కోల్‌కతా ఎయిర్‌పోర్టు 1280 ఎకరాల్లో, ముంబాయి ఎయిర్‌పోర్టు 2000 ఎకరాల్లో, ప్రధాని మోడి పాలించిన గుజరాత్‌లో ఎయిర్‌పోర్టు 960 ఎకరాల్లో ఉండగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టు కూడా 980 ఎకరాల్లో ఉందని, దాన్ని విస్తరించడానికి ఇంకా అవకాశాలున్నాయని, ఉన్న ఎయిర్‌పోర్టును వదిలేసి విజయనగరం జిల్లా భోగాపురం మీద అతని కళ్ళు పడ్డాయని ఆయన ఆరోపించారు. 2014లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి కల్పన ఓ అద్భుతమైన రిపోర్టు ఇచ్చారని, ఆమె ఉన్న ఎయిర్‌పోర్టులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అందులో వివరించారని, ఎలా విస్తరించాలో సవివరంగా తెలిపారని, కాని ఆ నివేదికను ప్రస్తుత కేంద్ర విమానాశ్రయశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మూలనపడేశారని ఆయన ఆరోపించారు. ఈ జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజుకు ఇది న్యాయమా అని ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంతంలో భూములు కొనేశారని, దీంతో భూముల విలువ పెంచడానికి ఎయిర్‌పోర్టు పేరుతో చిన్నచిన్న రైతుల భూములు లాగేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. గంటా, అవంతి, అయ్యన్నలు చంద్రబాబుకు బినామీలుగా పని చేస్తున్నారని, వారి ఇచ్చే ధనసంచులతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎర్రబస్సెక్కలేని మాకు ఎయిర్‌పోర్టా? : నిలదీసిన జనం
విజయనగరం జిల్లా గూడెపువలసలో వైఎస్ జగన్మోహనరెడ్డి సభలో జనం సభాముఖంగా తన నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు మహిళలు, యువతీయువకులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న వారి భూములను రక్షిస్తూ… పేదల భూములు లాక్కుంటున్నారని బుజ్జమ్మ అనే ఓ మహిళ చెప్పారు. ఎన్నికలప్పుడు ఇంటి దగ్గరకొచ్చి ఓట్లు అడుక్కున్న పెద్దమనిషి చంద్రబాబు… నెల రోజుల నుంచి తాము నిరాహారదీక్ష చేస్తున్నా పలకరించేందుకు ఒక్క నాయకుడు రాలేదని మణెమ్మ అనే మరో మహిళ అన్నారు. అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు, అవంతి శ్రీనివాసరావు భూములు లాక్కోని అధికారులు బక్క రైతుల భూముల లాక్కుంటున్నారని విమర్శించారు. తనకున్న మూడెకరాలున్న భూమిని ఎయిర్‌పోర్టు పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇక్కడెందుకు ఎయిర్‌పోర్టు పెడుతున్నావని చంద్రబాబును ప్రశ్నిస్తూ… ఇక్కడ ఎర్రబస్సు ఎక్కే స్థోమత లేని మనుషులుకు ఎయిర్‌పోర్టు ఎందుకని నిలదీశారు. గౌరి అనే మరో యువతి మాట్లాడుతూ తనకు ఇల్లు మాత్రమే ఉందని, దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అడిగినందుకు అధికారులు తమపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆమె అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారని, ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది బతికారని, చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత అందరూ చచ్చిపోతున్నారని ఆమె విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తాదని చెప్పారని, ఎంతోమంది ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన నిరుద్యోగులన్నారని ఆమె విమర్శించారు.