నారాయణ్ ఖేడ్ బరిలో టీ ఆర్ ఎస్!
నారాయణ్ ఖేడ్‌లో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీ ఆర్ ఎస్ బరిలోకి దిగనుంది. ఈ స్థానంపై పోటీకి అన్ని పార్టీలు సిద్ధమవుతుండటం, ఒక వర్గపు మీడియా రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్న సంఘటనను ప్రభుత్వ వైఫల్యమంటూ చిత్రీకరిస్తుండటంతో టీ ఆర్ ఎస్ పోటీకి సిద్ధపడినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉంటే.. ప్రజా వ్యతిరేకతకు తలవంచి పోటీకి దూరంగా ఉందన్న అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో తాము కూడా […]
నారాయణ్ ఖేడ్‌లో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీ ఆర్ ఎస్ బరిలోకి దిగనుంది. ఈ స్థానంపై పోటీకి అన్ని పార్టీలు సిద్ధమవుతుండటం, ఒక వర్గపు మీడియా రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్న సంఘటనను ప్రభుత్వ వైఫల్యమంటూ చిత్రీకరిస్తుండటంతో టీ ఆర్ ఎస్ పోటీకి సిద్ధపడినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉంటే.. ప్రజా వ్యతిరేకతకు తలవంచి పోటీకి దూరంగా ఉందన్న అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో తాము కూడా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! తొలుత ఈ స్థానంలో కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను లేదా కాంగ్రెస్ నుంచి నిలబెట్టే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని జానారెడ్డితో సహ కాంగ్రెస్ పెద్దలంతా విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలో ఉన్న టీఆ ర్ ఎస్ తోపాటు, అన్ని పార్టీలు స్వాగతించాయి.
కానీ, కొన్ని వారాలుగా ఈ విషయంలో అన్ని పార్టీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతుండటంతో పోటీ అనివార్యంగా మారింది. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న టీ ఆర్ ఎస్ కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. టీ ఆర్ ఎస్ బరిలోకి దిగితే.. కాంగ్రెస్ పార్టీతో హోరా హోరీ పోరు తప్పదు. ఈ ప్రాంతంలో టీడీపీ- బీజేపీ పోటీ చేసినా అంతగా ప్రభావం చూపెట్టలేవు. కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని లేదా కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకర్ని నిలబెడితే.. టీఆర్ ఎస్ గెలవడం అంత సులువేం కాదు.
అసెంబ్లీ సమావేశాలే ప్రభావితం చేశాయా?
శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. విపక్షాలు అడుగుతున్నప్రతి ప్రశ్నకు సీఎం కేసీఆర్, మంత్రులు ఓపిగ్గా సమాధానం చెబుతూ వస్తున్నారు. టీఆర్ ఎస్‌ను ఆగర్భ శత్రువుగా భావించే.. టీడీపీ నేతలు సైతం ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రెండు మూడురోజులుగా పార్టీల వైఖరి మారింది. మౌనంగా ఉంటే.. ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్న అభిప్రాయం రావడంతో ఫంథా మార్చారు. బీజేపీ, టీడీపీ , కాంగ్రెస్‌లు రైతు రుణాల విషయంలో వన్‌టైం సెటిల్‌మెంట్ చేయాలంటూ పట్టుబట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తాము ఎంత సహకరించినా విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని టీఆర్ ఎస్ భావించింది. మరోవైపు అవిశ్వాసం పెడతాం అంటూ కాంగ్రెస్ కొత్త అస్ర్తాన్ని బయటికి తీసింది. అందుకే.. నారాయణ్ ఖేడ్‌లో పోటీ చేసి తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.