నేరం ఎవరిది! శిక్ష ఎవరికి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా దేశంలో జరిగే నేరాలను వర్గీకరించి జాబితా రూపొందిస్తుంది. ఈ జాతీయ సంస్థ తాజా నివేదికల ప్రకారం తెలుగు రాష్ర్టాల కుటుంబాలకు ప్రమాద హెచ్చరికలను జారీ అవుతోంది. వరకట్న వేధింపులు… గృహహింస… భర్తల క్రూరత్వం… ఇత్యాది కేసుల్లో మన రాష్ర్టాలుమొదటి ఐదు స్థానాలో్ల ఉన్నాయి. ఇదే సమయంలో…గృహహింస నిరోధక చట్టం 498ఎ దుర్వినియోగమవుతోందని మరో వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో… ప్రముఖ న్యాయవాది సివిఎల్ఎన్ అనుభవాల సారాంశమే ఈ కథనం ఒక పేరు మోసిన […]
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా దేశంలో జరిగే నేరాలను వర్గీకరించి జాబితా రూపొందిస్తుంది. ఈ జాతీయ సంస్థ తాజా నివేదికల ప్రకారం తెలుగు రాష్ర్టాల కుటుంబాలకు ప్రమాద హెచ్చరికలను జారీ అవుతోంది. వరకట్న వేధింపులు… గృహహింస… భర్తల క్రూరత్వం… ఇత్యాది కేసుల్లో మన రాష్ర్టాలుమొదటి ఐదు స్థానాలో్ల ఉన్నాయి.
ఇదే సమయంలో…గృహహింస నిరోధక చట్టం 498ఎ దుర్వినియోగమవుతోందని మరో వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో…
ప్రముఖ న్యాయవాది సివిఎల్ఎన్ అనుభవాల సారాంశమే ఈ కథనం
ఒక పేరు మోసిన న్యాయవాది కార్యాలయం. ఓ అమ్మాయి కళ్లనీళ్ల పర్యంతం అవుతోంది. తన భర్త తనకు కావాలని, కేసు తొలగించి తన భర్తను తనకిమ్మని ఆ న్యాయవాదిని చేతులు పట్టుకుని బతిమాలుతోంది. ఆ అమ్మాయి పేరు హాసిని (పేరు మార్చాం). తాను బిటెక్ గ్యాడ్ర్యుయేట్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మంచి జీతంతో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇద్దరికీ కలిపి నెలకు దాదాపు లక్షరూపాయల జీతం. ఇంతకీ ఆమె భర్త మీద నమోదైన కేసు ఎవరో బనాయించింది కాదు. స్వయానా ఆమె పట్టి పెట్టిన 498ఎ కేసు. భర్త కోసం, భర్త ప్రేమ కోసం ఇంతలా బెంగపెట్టుకున్న దానివి ఆయన మీద కేసు ఎందుకు పెట్టావమ్మా- అని న్యాయవాది అడిగి ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అక్కడున్న అందరినీ ఆయోమయంలో పడేసింది.
ఇంతకీ విషయం ఏమిటంటే… హాసిని భర్తకు ముగ్గురు అక్కచెల్లెళ్లు. తన జీవితంలో ప్రతి విషయంలోనూ ఆ ముగ్గురితోపాటు అత్తగారు జోక్యం చేసుకుంటున్నారనీ, భర్త కూడా వాళ్ల అభిప్రాయానికే విలువనిస్తూ తనను అలా నడుచుకోమంటున్నాడని హాసిని ఆరోపణ. వారలా ప్రతి విషయానికీ జోక్యం చేసుకోకుండా ఉండాలంటే ఒక్కసారి కేసు పెడితే చాలని ఆమెకి తెలిసిన ఎవరో చెప్పారట. ఆ మాటలు నమ్మిన హాసిని ఓ రోజు ఆవేశంలో భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తల మీద కేసు పెట్టింది. 498ఎ సెక్షన్‌లో నమోదైన కేసు కాబట్టి ముందు అరెస్టు చేసి ఆ తర్వాత విచారణ చేపట్టింది న్యాయవ్యవస్థ. ఇలా అవుతుందని తనకు తెలియదని, కేసు ఉపసంహరించుకుంటానని వాపోతోంది హాసిని. ఇంత జరిగాక కేసు ఉపసంహరించుకునేటంత ఉదారత మాకవసరం లేదంటున్నారు భర్త, అతడి బంధువులు. హాసిని తెలిసి చేసినా తెలియక చేసినా ఈ కేసుతో ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక వైవాహిక బంధం బీటలు వారింది. ఈ కేసు పెట్టడమే తాను చేసిన తప్పా… అని హాసిని పరిపరి విధాలా ఆవేదన చెందుతోంది. అయితే ఇదే కేసు వల్ల తన కుటుంబం బాగు పడిందని చెబుతోంది హాసిని ఇంట్లో పని చేస్తున్న వసంత.
వసంత రోజూ నాలుగు ఇళ్లలో గిన్నెలు కడిగి, బట్టలు ఉతుకుతుంది. ఆమె భర్త రోజూ కూలికి వెళ్లి ఇటుకలు సిమెంటు మోస్తాడు. రోజుకు మూడు వందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు. పైగా రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడంతోపాటు ఇంట్లో నానా అల్లరి చేస్తాడు. తన సంపాదనతో ఇంటిని నడుపుతూ పిల్లలను పోషిస్తున్న వసంతకు భర్త చూపిస్తున్న నరకం రోజురోజుకూ పెరుగుతోంది తప్ప అతడిలో బాధ్యత కనిపించడం లేదు. పుట్టింటి వాళ్లకు తెలిసి బంధుగణం అంతా వచ్చి చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో వారంతా కలిసి వెళ్లి, అతడి మీద కేసు పెట్టడం, పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని జైల్లో పెట్టడం జరిగిపోయాయి. నాలుగు రోజుల తర్వాత లోక్ అదాలత్ న్యాయవాదుల సమక్షంలో పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పోలీసుల భయం, న్యాయవాదుల హెచ్చరికలతో అతడు… మద్యం తాగనని, సంపదించిన డబ్బు ఇంట్లో ఇస్తానని, భార్యను కొట్టనని… అన్నింటికీ తలూపాడు. ఈ బుద్ధి ఎన్ని రోజులుంటుందో కానీ ఇప్పటికి మాత్రం కుదురుగా ఉంటున్నాడని సంబరంగా చెప్తోంది వసంత.
ఈ ఇద్దరు మహిళల జీవితాలను ఉదహరిస్తూ తప్పు ఈ సెక్షన్‌లో ఉందా, దీనిని ఉపయోగిస్తున్న తీరులోనా అని ప్రశ్నిస్తారు ప్రముఖ న్యాయవాది సివిఎల్ నరసింహారావు.
కుటుంబంలో మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. పిల్లలకు ఒక చాక్లెట్ కొనాలన్నా, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేటప్పుడు వారి కోసం ఏ పండ్లో పట్టుకెళ్లాలన్నా సందేహించే పరిస్థితి ఉండకూడదు. చాలా సందర్భాలలో సంపాదించే మహిళకు కూడా తన సంపాదనలో వంద రూపాయలను కూడా ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేయలేని పరిస్థితులు ఉంటున్నాయి. -మగవాళ్లు ఆధిపత్యం ఇలా వెర్రితలలు వేయడం వల్ల చాలామంది మహిళలు ఇప్పటికీ మౌనంగా రోధిస్తూనే ఉన్నారు. తనకు తానుగా నిలబడాలనే ఆలోచన లేని వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే… కొందరు మహిళలు తీవ్రంగా స్పందిస్తూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మంచి ఆడవాళ్లు, మంచి వేదనకు లోనవుతున్నారు. కుటుంబాలు బాగుపడాలంటే మగవాళ్లలో అభిజాత్యం, అహంకారం తగ్గాలి. స్ర్తీలలో ఆర్థిక స్వాతంత్ర్యం రావాలి. ఆ ఆర్థిక స్వాతంత్ర్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి తప్ప, అహంకారాన్ని పెంచకూడదు. అప్పుడే కాపురాలు బాగుంటాయి- అంటారాయన.
భక్తి లేని చోట భయమైనా ఉండాలి!
చట్టాలు, సెక్షన్‌లు ఏమీ తెలియని తరాలు హాయిగా జీవించాయి. ఆ తరాలు కుటుంబ జీవితంలో తలెత్తిన విభేదాలు కుటుంబ పెద్దలు, గ్రామపెద్దల జోక్యంతో పరిష్కరించుకుని వివాహబంధాన్ని కొనసాగించాయంటారు సివిఎల్ఎన్. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడంలో ఈ తరం విఫలమవుతోందా అనే సందేహానికి సమాధానంగా లోపం తల్లిదండ్రుల్లోనేనంటారాయన. పిల్లలకు సర్దుబాటు నేర్పించకపోవడం, డబ్బుతో దైన్నయినా సొంతం చేసుకోవచ్చనే ధోరణి పిల్లల్లో ఎక్కువ కావడం వంటివే కారణాలంటారు. ఇప్పటి చదువులు స్ర్తీని గౌరవించే తత్వాన్ని అలరచడం లేదు. వినోద మాద్యామాలు స్ర్తీని ఆటవస్తువుగా, విలాసవస్తువుగా చూపిస్తున్నాయి. భక్తి లేని చోట భయం అయినా ఉండాలి. ఆ భయాన్ని కలిగించడానికే ఈ చట్టాలు. మన పీనల్‌కోడ్‌లో ఉన్న చట్టాలన్నీ మనల్ని మనం రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న రక్షణ కవచాలే. -నిజానికి 2005లో అమలులోకి వచ్చిన గృహహింస నిరోధక చట్టాన్ని (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్-2005) పటిష్టంగా అమలు చేస్తే కుటుంబ హింసకు బలవుతున్న స్ర్తీల జీవితాలు బాగుపడతాయి. ఆ చట్టాన్ని ఆశ్రయించినప్పుడు భార్యాభర్తలిద్దరికీ న్యాయమే జరుగుతుంది. వివాహబంధం బీటలు వారదు. మన వివాహవ్యవస్థ కూలిపోదు. కుటుంబ సభ్యుల మీద 498ఎ వంటి క్రిమినల్ కేసులు బనాయించి జీవితాలను ఇడుముల పాటు చేసుకోవాల్సిన అవసరమే ఉండదన్నారు నరసింహారావు.
స్రుష్టిలో ఏ రెండు నాలుకలూ ఒక రుచిని ఇష్టపడవు. ఏ రెండు మెదళ్లూ ఒకలా ఆలోచించవు. ఏ ఇద్దరు మనుషులూ మూసపోసినట్లు ఒకలా స్పందించలేరు. వీటన్నింటినీ అధిగమించి ఇద్దరు మనుషులను జీవితాంతం కలిపి నడిపించేది వివాహబంధం. ఆ బంధం అసౌకర్యంగా ఉన్నా కూడా సహించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి కారణంగా అసౌకర్యం కలిగిందో సూటిగా వారినే ఆరోపించాలి. వారి మీదనే కేసు పెట్టాలి. అంతే తప్ప అత్తవారింటి అందరినీ కాదు. ఇంకా ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసకు లోనయిన మహిళ మొదట ఆశ్రయించాల్సింది కలెక్టర్ ఆఫీస్లోని ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని మాత్రమే. పోలీసులను కాదు. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ విభాగం వివాదాలను పరిష్కరిస్తుంది తప్ప జీవితాలను వేరు చేయదు.
హైలైట్ పాయింట్స్
- చట్టాలను అస్త్రాలుగా ఉపయోగించి విధ్వంసం స్రుష్టించాలనుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. అస్ర్తాలను ప్రయోగించడానికి కుటుంబం యుద్ధరంగం కాదు. కుటుంబంలో యుద్ధవాతావరణం ఉంటుంది తప్ప ఎప్పుడూ యుద్ధం రాదు.
- భర్త, అత్త, ఆడపడుచుల మీద కేసు పెట్టాలని వచ్చే ప్రతి అమ్మాయి చెప్పే మొదటి కారణం… – మా వారు అన్నీ వాళ్లమ్మ చెప్పినట్లే చేస్తున్నాడు- అని. మరి నీ భర్తను కని పెంచింది ఆవిడే. అతడి జీవితంలోకి నువ్వు వచ్చే వరకు అతడి బాగోగులు చూపింది. అతడి ఆకలి ఎరిగి అన్నం పెట్టింది. అనారోగ్యం వస్తే సేవలు చేసింది ఆ తల్లే. అందుకే అతడికి తల్లి మీద అంతటి ప్రేమ ఉంటుంది. నిజానికి తల్లిని ప్రేమించే మగాడు తనకు భర్తగా దొరికినందుకు ఆ స్ర్తీ సంతోషించాలి.
- పెళ్లయిన అబ్బాయి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అమ్మాయి తన వాళ్లందరినీ వదిలి వస్తుంది. అత్తగారింట్లో ఆమెకి తొలి ఆత్మీయుడు భర్త మాత్రమే. తన ప్రతి భావాన్ని, అభిప్రాయాన్ని శషబిషలు లేకుండా చెప్పుకోగలిగింది అతడితోనే. కాబట్టి భార్య కోణం నుంచి చూడడం కూడా నేర్చుకోవాలి.
- ఆషాఢమాసం కొత్త దంపతులను వేరుగా ఉంచినట్లు… కొత్త పెళ్లి కొడుకు నెల రోజుల పాటు అత్తగారింట్లో గడపాలి. అల్లుడిగా ఎన్ని గౌరవాలందుకున్నప్పటికీ అత్తగారింట్లో అన్ని గదుల్లోకి స్వేచ్ఛగా వెళ్లలేడు. గౌరవాలను కూడా కొన్ని పరిధులకు లోబడి ఆస్వాదించాల్సిందే. అప్పుడు అతడికి ఒక వ్యక్తి కొత్త మనుషుల మధ్య ఆ ఇంటి వాతావరణంలో మెలగడం ఎంతటి కత్తిమీద సామో తెలుస్తుంది.
- పెళ్లయిన అమ్మాయి… తన కుటుంబం అంటే … తను, తన భర్త మాత్రమే అనుకుంటుంది. అబ్బాయి మాత్రం… నేను, నా భార్య, మా అమ్మానాన్నలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, బావలు, వాళ్ల పిల్లలు… అనుకుంటాడు. ఇలా ఇద్దరి అభిప్రాయాలలో సారూప్యత లోపించడం చాలా సహజం. అయితే నీ కారణంగా నేను మా వాళ్లకు దూరమయ్యానని భార్యను ఆరోపించడంతో ఘర్షణ మొదలవుతుంది. అమ్మాయి తన వాళ్లందరినీ వదిలి రావడం సహజం. మగవాడిగా తాను తన వాళ్లకు దూరం కావడం భార్య కారణంగానే జరిగిందనే అభిప్రాయం నుంచి మగవాళ్లు బయటకు రాక తప్పదు.