ఆవు కోసం మనిషిని హత్య చేస్తారా: అసద్!
ఆవు మాంసం తిన్నారన్న అనుమానంతో ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తిని కొట్టి చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసద్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో అక్‌లాక్ (50) అనే వ్యక్తి ఇంట్లో ఆవును చంపాడన్న వదంతులు రావడంతో ఆయన్ను కొందరు రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఆవును చంపిన మనిషిని కొట్టి చంపుతారా? అంటూ వాపోయాడు. ఈ వార్త తెలిసి నేను నిర్ఘాంతపోయాను. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ స్వామ్యంగా, దౌర్జన్య స్వామ్యంగా మారుస్తున్నారు అని ధ్వజమెత్తారు. […]
ఆవు మాంసం తిన్నారన్న అనుమానంతో ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తిని కొట్టి చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసద్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో అక్‌లాక్ (50) అనే వ్యక్తి ఇంట్లో ఆవును చంపాడన్న వదంతులు రావడంతో ఆయన్ను కొందరు రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఆవును చంపిన మనిషిని కొట్టి చంపుతారా? అంటూ వాపోయాడు. ఈ వార్త తెలిసి నేను నిర్ఘాంతపోయాను. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ స్వామ్యంగా, దౌర్జన్య స్వామ్యంగా మారుస్తున్నారు అని ధ్వజమెత్తారు. సంఘ్ పరివార్ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు దేశాన్ని మరింత బలహీన పరుస్తాయని హెచ్చరించారు.
అక్‌లాక్ కుమారుడు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తూ.. దేశానికి సేవలందిస్తున్న విషయాన్ని గుర్తించరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవు మాంసం తిన్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని చంపే ఆదేశాలు మీరెలా జారీ చేస్తారని మండిపడ్డారు. మీకు మీరే స్వయం నిర్ణయాలు తీసుకుంటే.. ఇక ప్రజాస్వామ్యంలో కోర్టులు, న్యాయవ్యవస్థ ఎందుకని, వాటిని మూసేయవచ్చుగా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనను కేంద్ర మంత్రి శర్మ చిన్న ఘటనగా అభివర్ణించడాన్ని అసద్ తప్పుబట్టారు. ఓ వ్యక్తిని అనాగరికంగా కొట్టి చంపడం చిన్న విషయం కాదన్నారు. చనిపోయిన అక్‌లాక్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు సరే.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.