ఒంటరి (బాబు) పోరాటం
ఎన్టీఆర్ మంత్రివర్గంలో బాబు మంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్ బాబు ఒంటరిపోరాటం సినిమా చూశారు తెలుగు ప్రజలు. మళ్లీ ఇన్నేళ్లకు..ఇన్నాళ్లకు తెలుగు నాట పంచరంగుల రాజకీయ సాంఘిక ఒంటరి పోరాటమనే బ్రహ్మాండమైన చిత్రం చూడబోతున్నారు. వెంకటేశ్‌బాబు సినిమాకు నిర్మాత, దర్శకుడు వేరేగా ఉన్నారనుకోండి. ఇది బాబుగారి సిన్మా. కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం, నాయకుడు, ప్రతినాయకుడి పాత్రలన్నీ బాబు క్రియేషన్సే. అయితే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా బాబుపైనే ఉంటుందట. ఆ పాట కూడా తనకు పిల్లనిచ్చిన […]
ఎన్టీఆర్ మంత్రివర్గంలో బాబు మంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్ బాబు ఒంటరిపోరాటం సినిమా చూశారు తెలుగు ప్రజలు. మళ్లీ ఇన్నేళ్లకు..ఇన్నాళ్లకు తెలుగు నాట పంచరంగుల రాజకీయ సాంఘిక ఒంటరి పోరాటమనే బ్రహ్మాండమైన చిత్రం చూడబోతున్నారు. వెంకటేశ్‌బాబు సినిమాకు నిర్మాత, దర్శకుడు వేరేగా ఉన్నారనుకోండి. ఇది బాబుగారి సిన్మా. కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం, నాయకుడు, ప్రతినాయకుడి పాత్రలన్నీ బాబు క్రియేషన్సే. అయితే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా బాబుపైనే ఉంటుందట. ఆ పాట కూడా తనకు పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీఆర్ నటించిన గులేబ కావళి కథ చిత్రంలోని “ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఎలా పోను“ అనే పాటను “ఒంటరినైపోయాను ఇక అమరావతికి ఎలా పోను“ అంటూ రీమిక్స్ చేస్తున్నారని సమాచారం.
నీడను నమ్మక..తనవాడిని నమ్మక..
అసలు బాబు ఒంటరిపోరాటం ఎందుకు చేయాల్సి వస్తోంది? ఏపీలో అధికారం ఉంది. కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో బాబు భాగస్వామి. ఇన్ని ప్రత్యేక అర్హతలున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒంటరెలా అయ్యారు? అంటే అంతా స్వయంకృతాపరాధం. నీడను కూడా నమ్మలేని తత్వం. ఈ రెండే బాబును ఒంటరిని చేసి పోరాడు పో అని వదిలేశాయి. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులు పెరిగిపోయారు. తానేలుతున్న ఏపీలోనూ, కేంద్రంలోనూ మిత్రపక్షమైన బీజేపీతో సఖ్యత లేదు. కేబినెట్లో సీనియర్ మంత్రులతో విభేదాలున్నాయి. ఇవన్నీ కవర్ చేసే మీడియా మొఘల్, ఫిల్మ్‌సిటీ నుంచి తెలుగు రాష్ర్ట రాజకీయాలను శాసించే రాజగురువు అండ పోయింది.
తన జమానాలో ఏకాకి
ఏపీలో సీఎంగా చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్షమంటే..ఎలాగూ పడదు. కనీసం డిపాజిట్లు కూడా లేని కాంగ్రెస్‌తోనూ వైరమే. కమ్యూనిస్టులతో కయ్యమే. ఇక మిత్రపక్షమైన బీజేపీతో రోజూ వివాదాలే. పోనీ కేబినెట్‌లో తనతో పనిచేస్తున్న మంత్రులతోనైనా బాబు బాగున్నారా అంటే అదీ లేదు. కేంద్రమంత్రి అశోక్‌పై ఆగ్రహం. కేఈ అంటే పడదు. యనమలతో ఎడమొఖం పెడమొఖం. చింతకాయలతో చికాకులు. బాబుకు ఇంటి పోరు ఇలా ఉంటే.. ముద్దుల తనయుడు ఆపరేషన్స్ ఓ వైపు..బావ కమ్ వియ్యంకుడు బాలయ్యబాబు దూకుడు మరోవైపు బాబును ఏకాకిని చేస్తోంది.
మిత్రులే శత్రువులై..
కేంద్రంలో రెండు మంత్రి పదవులు పారేసిన బీజేపీ.. రాష్ర్టంలో రెండు మంత్రి పదవులు తీసుకుంది. అయితే పేరుకే మిత్రపక్షం కానీ..శత్రువుల కంటే ఎక్కువగా టీడీపీ, బీజేపీల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పొత్తు చిత్తు చేసుకునే పనిలో రెండు పార్టీలూ ఉన్నాయి. బీజేపీ బంధం తెగిపోతే.. బాబు కమ్యూనిస్టులతో కలవరు. కలిసేందుకు కాంగ్రెస్ లేదు. జగన్ జగడం కొనసాగుతూనే ఉంది. ఈ లెక్కన ఇక్కడా బాబు ఒంటరిపోరాటమే.
తెలంగాణలో మరీ దారుణం
తెలంగాణలో ఎన్ని పార్టీలున్నా..అన్నింటి లక్ష్యం టీడీపీయే. టీఆర్ ఎస్ మజ్లిస్‌తో, జగన్ పార్టీతో, బీజేపీతో తెరవెనుక స్నేహసంబంధాలు కొనసాగిస్తోంది. చివరికి కాంగ్రెస్ కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే గులాబీ బాస్ చూస్తున్నారు. కానీ టీడీపీని ఏ ఒక్క పార్టీ నమ్మడంలేదు. తెలంగాణలో అంటరాని పార్టీలా చూస్తున్నారని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. సాక్షాత్తు తెలంగాణ బీజేపీ కూడా తమ మిత్రపక్షానికి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్‌పీ నేత జానారెడ్డి విపక్షాల పేర్లు చెప్పారు. ఇందులో టీడీపీకి అవకాశం కూడా ఇవ్వలేదు. టీడీపీ సభ్యులు గుర్తు చేస్తే..నవ్వుతూ ఆ టీడీపీ కూడా అంటూ ముక్తాయించారు. దీనినిబట్టి తెలంగాణలో తెలుగుదేశం ఒంటరిపోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది
రాజగురువు రాజకీయంతో ఒంటరి
రాజగురువు.. చంద్రబాబుకు దూరంకావడంతోనే… బాబు ఒంటరి పోరు మొదలైందనే ప్రచారం సాగుతోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునే పనిలో రామోజీ కేసీఆర్‌కు, కేంద్రంలో నరేంద్రమోదీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు ఓటుకు కోట్లు వంటి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయారు. శిష్యుడని చేరదీస్తే..ఢిల్లీలో మోదీ దగ్గర, తెలంగాణలో కేసీఆర్ దగ్గర తాను పలచనైపోతానని, ఈ కేసుల్లో బాబును వెనకేసుకొస్తే..తన సామ్రాజ్యానికే ఎసరు వస్తుందని భావించిన రాజగురువు ఆ పదవిని త్యజించారు. దీంతో బాబు కేసులో మిగిలిపోయిన దోషిలా విలవిల్లాడారు.
పుండుమీద కారం చల్లినట్లు జగన్ రామోజీ భేటీ కూడా బాబును ఒంటరిని చేసింది. ఇంతవరకూ బాబును, ఆయన అక్రమాలను, ప్రభుత్వ పనితీరును తన కథనాలతో కవర్ చేసుకుంటూ వచ్చిన ఈనాడు..కలం ఝళిపించడం మొదలు పెట్టింది. బాబు సర్కారును ఎండగట్టడం ఆరంభించింది. దీంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండు రాష్ట్రాల్లో శత్రువులు పెరిగిపోయారు. మిత్రులు కూడా కత్తులు దూస్తున్నారు. రాజగురువు రాజకీయం అంతుబట్టడంలేదు. ఈ పరిస్థితులన్నీ బాబును ఒంటరిపోరాటం వైపు నెట్టేశాయి.
వీటన్నటికి తోడు చంద్రబాబు 16 నెలల పాలనలో విదేశి ప్రయాణాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనీ చేయలేదు. పట్టి సీమ అది ఒట్టి సీమే. ప్రచారం తప్ప పసలేని పాలనతో జనం విసిగి పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కేసిఆర్, చంద్రబాబు పరిపాలనలను పోల్చుకుంటే చంద్రబాబు తేలిపోతున్నాడు. ప్రజాభిప్రాయం చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకంగా ఉంది. భూబకాసురిడిలా రైతులను వేధించడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.