అస్త్రశస్త్రాలతో అధికార-విపక్షాలు సమాయత్తం
మళ్ళీ నేటి నుంచే అసెంబ్లీ… నేటి నుండి మళ్ళీ తెలంగాణా శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలు పలు ముఖ్యమైన సమస్యలకు వేదిక కాబోతున్నాయి. గత రెండుసార్లు జరిగిన శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవడంతో ప్రతిపక్షాల నుండి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకుండానే తప్పించుకోగలిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యేడాదిన్నర కావొస్తోంది. గతంలో మాదిరిగా ఇపుడు రాష్ట్రంలో ఏర్పడుతున్న అన్ని సమస్యలకి గత […]
మళ్ళీ నేటి నుంచే అసెంబ్లీ…
నేటి నుండి మళ్ళీ తెలంగాణా శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలు పలు ముఖ్యమైన సమస్యలకు వేదిక కాబోతున్నాయి. గత రెండుసార్లు జరిగిన శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవడంతో ప్రతిపక్షాల నుండి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకుండానే తప్పించుకోగలిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యేడాదిన్నర కావొస్తోంది. గతంలో మాదిరిగా ఇపుడు రాష్ట్రంలో ఏర్పడుతున్న అన్ని సమస్యలకి గత ప్రభుత్వాలే కారణమని తెరాస తప్పించుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నమే చేసినా ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా ప్రతిపక్షాలను బలహీనపరుద్దామని ప్రయత్నించిన తెరాస వైఫల్యం కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ సమస్యలపై ఒకదానికొకటి సహకరించుకుంటూ పోరాటానికి నడుం బిగించాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీల నుంచి టీఆర్‌ఎస్ తీర్ధం తీసుకున్న ఫిరాయింపుదారుల సమస్య కూడా ఈసారి అసెంబ్లీలో ప్రధాన చర్చనీయాంశం కాబోతోంది. ఉమ్మడిగా ఈ సమస్యను లేవనెత్తడానికి విపక్షాలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రతిపక్షాల మధ్య అనూహ్యంగా ఏర్పడిన ఐక్యత కారణంగా ఈసారి శాసనసభలో వాటిని ఎదుర్కోవడం తెరాస ప్రభుత్వానికి చాలా కష్టమే. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కల్తీ కల్లును ఒక్కసారిగా రాకుండా చేయడం వల్ల కలుగుతున్న మరణాలు, దుష్పరిణామాలు, జి.హెచ్.యం.సి. పరిధిలో సుమారు 25 లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అనేక సమస్యలపై ప్రతిపక్షాలు శాసనసభలో తెరాస ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి.
శాసనసభలో తమ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద ‘బలమయిన సబ్జెక్ట్’ ఏదీ లేదని, వారిని చూసి తెరాస ఎమ్మెల్యేలు భయపడనవసరం లేదని, కానీ అందరూ పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దైర్యం చెప్పడం గమనిస్తే పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందో అర్ధమవుతోంది.