దుంప బరువు పెంచుతుంది!
మంచి ఆహారం అనగానే మనకు కూరగాయలు, పళ్లు…ఇవే గుర్తొస్తాయి. ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన ఆరోగ్య స్పృహ కారణంగా ఆరోగ్యాన్ని పెంచి, బరువుని తగ్గించే ఆహారంగా ఈ రెండింటికీ ఎక్కువ ప్రచారం జరుగుతోంది. నిజంగానే మిగిలిన ఆహారంతో పోల్చి చూస్తే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే అన్ని రకాల కూరగాయలు, పళ్లు మన శరీర బరువుని తగ్గించడంలో ఒకేలా పనిచేయవని పరిశోధకులు చెబుతున్నారు. అలా సరిగ్గా పనిచేయనివాటిలో ముందున్నది బంగాళదుంప. ఇందులో నీటి పరిమాణం తక్కువగా, పిండి […]
మంచి ఆహారం అనగానే మనకు కూరగాయలు, పళ్లు…ఇవే గుర్తొస్తాయి. ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన ఆరోగ్య స్పృహ కారణంగా ఆరోగ్యాన్ని పెంచి, బరువుని తగ్గించే ఆహారంగా ఈ రెండింటికీ ఎక్కువ ప్రచారం జరుగుతోంది. నిజంగానే మిగిలిన ఆహారంతో పోల్చి చూస్తే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే అన్ని రకాల కూరగాయలు, పళ్లు మన శరీర బరువుని తగ్గించడంలో ఒకేలా పనిచేయవని పరిశోధకులు చెబుతున్నారు. అలా సరిగ్గా పనిచేయనివాటిలో ముందున్నది బంగాళదుంప. ఇందులో నీటి పరిమాణం తక్కువగా, పిండి పదార్థం ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ విషయంపై అధ్యయనాలు నిర్వహించింది. నల్లద్రాక్ష పళ్లు బరువుని తగ్గించడంలో విశేషంగా పనిచేస్తుంటే, బంగాళ దుంపకు మాత్రం ఇది వర్తించదని ఈ పరిశోధకులు చెబుతున్నారు. రోజూ గుప్పెడు ద్రాక్ష పళ్లు తింటే, అందులోని జీవక్రియని పెంచే పోలీఫెనాల్స్ కారణంగా క్రమంగా మన శరీర బరువు తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. అలాగే బంగాళదుంపలు తీసుకున్నవారు కాస్త బరువు పెరిగినట్టుగా గుర్తించారు.
24 సంవత్సరాలపాటు నిర్వహించిన ఒక సుదీర్ఘ అధ్యయనంలో, ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు 131 రకాల ఆహార పదార్థాలను ఎంత విరివిగా తీసుకున్నారు అనే విషయాన్ని పరిశోధకులు పరిశీలించారు. నాలుగేళ్లకు ఒకసారి వారిని ప్రశ్నించి, ఏ ఆహారాన్ని ఎన్నిసార్లు ఎంత పరిమాణంలో తీసుకున్నారు, అలాగే ఎంత బరువు పెరిగారు, ఎంత తగ్గారు అనే విషయాలను నమోదు చేశారు. వారు టివి చూసే సమయం, సిగరెట్ తాగుతారా, వ్యాయామం చేస్తారా లాంటి విషయాలను సైతం లెక్కలోకి తీసుకున్నారు. అధ్యయన ఫలితాల్లో పళ్లు, కూరగాయలు బరువు తగ్గించడంలో విశేషంగా పనిచేసినట్టుగా తేలింది. అయితే కూరగాయల్లో క్యాబేజి, క్యాలిఫ్లవర్ ఇంకా ఆ తరహావి, పళ్లలో నల్ల ద్రాక్షతో పాటు ఎండుద్రాక్ష, యాపిల్, పీర్స్, స్ట్రా బెర్రీస్ వెయిట్ లాస్‌కి మరింతబాగా సహకరిస్తాయని తేల్చారు.