Telugu Global
NEWS

కరవు మండలాల ప్రకటనకు ఎర్రబెల్లి డిమాండ్‌

కరవు మండలాలను కూడా వెంటనే ప్రకటించాలని తెలుగుదేశం సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు డిమాండు చేశారు. ‘తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు, వ్యవసాయ పరిస్థితులు’ అంశంపై మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడం లేదని, ఒకవేళ రెగ్యులర్‌గా నివేదికలు వెళితే సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అవసరమైతే విపక్షాల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు. కరవు పరిస్థితులపై ఇప్పటివరకు 14 రాష్ట్రాలు కేంద్రానికి నివేదికలు పంపాయని, తెలంగాణ ధనిక […]

కరవు మండలాల ప్రకటనకు ఎర్రబెల్లి డిమాండ్‌
X

కరవు మండలాలను కూడా వెంటనే ప్రకటించాలని తెలుగుదేశం సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు డిమాండు చేశారు. ‘తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు, వ్యవసాయ పరిస్థితులు’ అంశంపై మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడం లేదని, ఒకవేళ రెగ్యులర్‌గా నివేదికలు వెళితే సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అవసరమైతే విపక్షాల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు. కరవు పరిస్థితులపై ఇప్పటివరకు 14 రాష్ట్రాలు కేంద్రానికి నివేదికలు పంపాయని, తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావించడం వల్ల కరవుపై నివేదిక పంపడానికి ఈ ప్రభుత్వం సిగ్గు పడుతుందా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. పప్పుదినుసులు, పత్తి రైతులు ఎక్కువగా నష్టపోయారని, వీటి దిగుబడి బాగా తగ్గిపోయిందని, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

రుణ మారిటోరియం విధించండి
రుణాల మారిటోరియంపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల అన్నదాత ఊపిరి పీల్చుకుంటాడని, ఆత్మహత్యలు తగ్గుతాయని ఎర్రబెల్లి ప్రభుత్వానికి సూచించారు. మూడేళ్ళపాటు మారిటోరియం విధిస్తే ఈలోపు రైతులకు భరోసా లభిస్తుందని, ఊపిరి పీల్చుకుని వ్యవసాయంలో నిమగ్నమవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో 46 శాతం మాత్రమే సాగులో ఉందని, 80 శాతం పంటలు సాగవుతున్నాయని మంత్రి పోచారం చెప్పడం వాస్తవం కాదని అన్నారు. వర్షాభావం వల్ల అన్నదాత ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నాడని అన్నారు. గత యేడాది కరెంట్‌ కోతల వల్ల, జల వనరుల లేమి వల్ల ఈ యేడాది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కాకుండా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం గట్టారంటే వారి శ్రేయస్సును చూసే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. వరి, మొక్కజొన్నకు రూ. 200, పత్తికి రూ. 500 బోనస్‌ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు. గత ప్రభుత్వాల మీద నెపం నెడితే ఈ ప్రభుత్వానికి ఒరిగేదేమీ ఉండదని అన్నారు. రుణ మాఫీలో ప్రభుత్వ విధానం మారాలని, ఒక్కసారిగా రుణ మాఫీ చేస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని, బ్యాంకులు సహకరించక పోవడం వల్లే మరణాలు మరింత పెరిగాయని ఎర్రబెల్లి అన్నారు.

అప్పు కోసమే రైతులు ఇల్లు కడుతున్నారు, కార్లు కొంటున్నారు: ఎర్రబెల్లి
రైతు సమస్యలపై టీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైతు కుటుంబాలకు పలు సాకులు చూపెట్టి పించన్ రాకుండా ఆపుతున్నారంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు.
రైతుల ఇల్లు బాగున్నా… వారు మంచి బట్టలు వేసుకున్నా పించన్ ఆపేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. రైతు ఇంటి ముందు కారు ఉంటే పించన్ ఇవ్వడం లేదన్నారు.అయితే తెలంగాణ రైతులు అప్పులు పుట్టాలన్న ఉద్దేశంతోనే మంచిగా ఇల్లు కట్టుకుంటారని ఎర్రబెల్లి చెప్పారు. అప్పులిచ్చే వారు ముందుకొస్తారన్న ఉద్దేశంతోనే మంచి బట్టలేసుకుని తిరుగుతారన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కారు కొనడం పెద్ద సంగతే కాదన్నారు. కొంచెం డబ్బు కడితే ఫైనాన్స్‌లో వెంటనే కారు ఇచ్చేస్తున్నారని చెప్పారు. కొందరు తెలంగాణ రైతులు అప్పుల కోసమే కార్లు కూడా కొంటున్నారని ఎర్రబెల్లి అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాబట్టి మంచి ఇల్లు, మంచి బట్టలు, కార్లు చూసి రైతులకు పించన్లు ఆపివేయడం సరికాదన్నారు. వృద్ధ రైతులకు పించన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు.
కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆయన ఫాం హౌజ్‌లోలాగే ఎకరాకు కోటి ఆదాయం వస్తుందని రైతులు భావించారని … కానీ నేడు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఫాంహౌజ్‌కు తీసుకెళ్లి వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూపించాలని కోరారు. తనకూ కొంచెం భూమి ఉందని కోటి అవసరం లేదని ఎకరాకు 15 వేలు ఇస్తే కౌలుకు ఇస్తానని ఎర్రబెల్లి చెప్పారు.

First Published:  29 Sept 2015 1:30 AM GMT
Next Story