ఆప్‌లో రేప్‌ల కలకలం?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల చుట్టూ ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. ఆప్ ప్రారంభమే ఓ సంచలనం. ఆప్ విజయాలు కూడా అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టించాయి. దశాబ్దాలుగా మనుగడకోసం పోరాటం చేస్తున్న పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించే ఫలితాలతో ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో టాప్ గా నిలిచింది. అయితే ఆప్ హవాకు అడ్డుకట్ట వేసేందుకు జాతీయ పార్టీలు ఏకమై కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు ఆప్‌ను చీల్చేయాలనే ఆలోచనతో పనిచేస్తూనే.. మరోవైపు కొత్తగా […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల చుట్టూ ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. ఆప్ ప్రారంభమే ఓ సంచలనం. ఆప్ విజయాలు కూడా అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టించాయి. దశాబ్దాలుగా మనుగడకోసం పోరాటం చేస్తున్న పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించే ఫలితాలతో ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో టాప్ గా నిలిచింది. అయితే ఆప్ హవాకు అడ్డుకట్ట వేసేందుకు జాతీయ పార్టీలు ఏకమై కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు ఆప్‌ను చీల్చేయాలనే ఆలోచనతో పనిచేస్తూనే.. మరోవైపు కొత్తగా రాజకీయాల్లోకొచ్చి గెలిచిన ఆప్ ఎమ్మెల్యేల దూకుడును క్యాష్ చేసుకుంటూ కేసుల్లో ఇరికిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కారణం ఏదైనా ఆప్ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ అందరిని ఏదో ఒక వివాదంలో ఇరికిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు. అవినీతి, అవలక్షణాలు, ఆశ్రితపక్షపాతం, గూండాయిజం, నేర చరిత్ర, నకిలీ డిగ్రీలున్న నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు. వారు దర్జాగా తిరుగుతున్నారు. మరి ఒక్క ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపైనే ఎందుకు పకడ్బందీ కేసులు నమోదవుతున్నాయనే అనుమానాలు అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యేనని చెప్పి ..
తాజాగా ఆప్ పార్టీ అభ్యర్థిగా పటేల్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పుకుంటున్న దీపక్ చౌదురిపై రేప్ కేస్ నమోదైంది. ఓ మహిళ, చౌదురి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారం కూడా జరిపాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పటేల్‌నగర్ నియోజకర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా ఎన్నికైన ఎమ్మెల్యేను తానేనని, త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ..ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడని చెబుతోంది. అయితే ఈ కేసులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. డిసెంబర్ 10న బాధితురాలు పిర్యాదు ఇస్తే.. ఇప్పుడు కేసు విచారణను వేగవంతం చేయడం. దీనితోపాటు ఎమ్మెల్యేనని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పటేల్‌నగర్ ఎమ్మెల్యే ఎవరో అందరికీ తెలుసు. అదే ఏరియాకు చెందిన మహిళ ..ఓ సామాన్య కార్యకర్త తాను ఎమ్మెల్యేనంటే ఎలా నమ్మేసింది అనేది మరో సందేహం. ఇదే విషయంపై ఆప్ నేతలు కూడా వివరణ ఇచ్చారు. దీపక్ చౌదురి అసలు ఎమ్మెల్యే కాదని, పార్టీలో ఓ సాధారణ కార్యకర్త మాత్రమేనని ఆప్ నేతలు స్పష్టం చేశారు. బాధితురాలు, చౌదురి ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారని దీనికి సంబంధించిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఎవరిది నిజం? ఈ కేసులో ఉన్న హస్తం ఎవరిదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని ..
2014లో కూడా ఓ ఎమ్మెల్యే రేప్ కేసులో బుక్కయ్యాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన రమన్ స్వామి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని పిలిపించి రేప్ చేశాడని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని ఓక్లా ప్రాంతానికి రమ్మని పిలిచాడని, ఉద్యోగం కోసం వెళ్లిన తనని కారులో ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రమన్ స్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
గృహహింస కేసులో…
ఎమ్మెల్యేలే కాదు. మంత్రులు కూడా గృహహింస కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్య ఫిర్యాదుతో మంత్రి పదవిని పోగొట్టుకుని మాజీ మంత్రిగా, ఆప్ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు సోమ్‌నాథ్ భారతి. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని సోమ్‌నాథ్ భారతి భార్య లిపిక ఈ ఏడాది జులై 10న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సోమ్‌నాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
కార్యకర్తలపై..
మహారాష్ర్ట ఆమ్ ఆద్మీ పార్టీ క్రియాశీల కార్యకర్త ధర్మేంద్ర ఉమాశంకర్(32) కొన్ని నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మరో ఆప్ మహిళ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నకిలీ డిగ్రీ ఆరోపణలపై..
డిగ్రీ చదివిన సంవత్సరంలో తేడాలతో నకిలీ డిగ్రీగా ముద్రపడి న్యాయశాఖ మంత్రి పదవి కోల్పోయారు జితేంద్రసింగ్. ఇప్పుడు భావనాగౌర్ అనే మహిళా ఎమ్మెల్యే విద్యార్హతలు తప్పుడవంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆప్ నేతలపైనే కేసులు ఎందుకు?
అత్యాచార ఆరోపణలు, నకిలీ డిగ్రీ కేసులు ఎక్కువ ఆప్ నేతలపైనే ఎందుకు నమోదవుతున్నాయి. ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న కుట్రే ఇదంతా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిపికెట్ ఆరోపణలపై ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ అరెస్టయిన తరువాత ప్రధానమంత్రి అధికారిక వెబ్ సైట్లో (www.pmindia.gov.in ) మోడీ విద్యార్హత ఎంఏ అని ఉన్న చోట దానిని తొలగించారు. ఎందుకీ మార్పో ఎవరికీ అర్థంకాలేదు. మరో వైపు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత సర్టిపికెట్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవేవీ కేసులు కాలేదు. ఆరోపణలపై విచారణా జరగలేదు. ఆప్ నేతలను మాత్రం నకిలీ డిగ్రీ పట్టా కేసులో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ను అదుపులోకి తీసుకున్న రేంజ్‌లో అరెస్టుచేసి మీడియాలో ప్రచారం చేశారు. ఈ సంఘటలన్నీ ఆప్‌పై కుట్ర జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.