Telugu Global
Others

నందమూరి వారసురాలితో... చంద్రబాబుకు చెక్

2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ బలమైన శక్తిగా ఎదగాలనే పట్టుదలతో ఉంది. అందుకనుగుణంగానే బిజెపి అడుగులేస్తున్నట్లు కనపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇదే పంధాను కొనసాగిస్తే వచ్చే ఎన్నికలనాటికి పుంజుకోలేమని గ్రహించిన కమలనాధులు తమ రూటును మార్చుకొవాలనే నిర్ణయానికొచ్చారు. రాష్ట్రంలో బిజెపి బలపడాలంటే టిడిపిని దెబ్బ తీయాలని… అందుకు టిడిపికి అండగా ఉంటున్న నందమూరి అభిమానులను… కమ్మ సామాజిక వర్గాన్ని ఆ పార్టీ నుండి దూరం […]

నందమూరి వారసురాలితో... చంద్రబాబుకు చెక్
X

2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ బలమైన శక్తిగా ఎదగాలనే పట్టుదలతో ఉంది. అందుకనుగుణంగానే బిజెపి అడుగులేస్తున్నట్లు కనపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇదే పంధాను కొనసాగిస్తే వచ్చే ఎన్నికలనాటికి పుంజుకోలేమని గ్రహించిన కమలనాధులు తమ రూటును మార్చుకొవాలనే నిర్ణయానికొచ్చారు. రాష్ట్రంలో బిజెపి బలపడాలంటే టిడిపిని దెబ్బ తీయాలని… అందుకు టిడిపికి అండగా ఉంటున్న నందమూరి అభిమానులను… కమ్మ సామాజిక వర్గాన్ని ఆ పార్టీ నుండి దూరం చేయాలని బిజెపి భావిస్తుంది. నందమూరి తారక రామారావు కుమార్తె పురందేశ్వరిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిని చేస్తే తమ పని సులభమవుతుందని బిజెపి అధిష్టానం యోచిస్తోంది. రాష్ట్రంలో పురందేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా… మంచి నాయకురాలుగా గుర్తింపు ఉండటమే కాకుండా… చంద్రబాబుతో ఆమె కుటుంబానికున్న విభేదాలు వల్ల ఆయనను బలంగా ఢీ కునేందుకు ఆమే సరైన నాయకురాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఆలోచనకొచ్చిన బిజెపి అగ్ర నాయకత్వం పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించాలని దాదాపు నిర్ణయించింది.

రాజకీయ విజేత… పురందేశ్వరి!
రాజకీయంగా ఏ అడుగు ఎప్పుడు వేయాలో… ఏ స్థాయిలో వేయాలో పురందేశ్వరికి తెలిసినట్టుగా నందమూరి కుటుంబంలోగాని, ఆమె బంధుమిత్రుల్లోగాని ఎవరికీ తెలీదు. అందుకే ఆమె రాజకీయ గ్రాఫ్‌ ఏనాడూ నేల చూపులు చూడలేదు. ఇప్పుడేం చేయాలా అని తలపట్టుకుని కూర్చోలేదు. పురందేశ్వరి రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే ఆమె పొలిటికల్ గ్రాఫ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది కానీ అధోఃముఖంగా ఎప్పుడూ పయనించిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ తన తండ్రి స్థాపించినప్పటికీ ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించడం వెనుక ఓ వ్యూహం ఉంది. రాజకీయ బద్ధ శత్రువైన చంద్రబాబు నాయకత్వంలో ఆమెకు పని చేయడం ఇష్టం లేదు. పైగా చంద్రబాబు పక్కా అవకాశవాది. ఈ విషయం దగ్గుబాటి విషయంలో అనేకసార్లు రుజువయ్యింది. వాడుకుని వదిలేసే మనస్తత్వం ఉన్న చంద్రబాబుతో ఉండే కన్నా రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిదన్న అభిప్రాయం వల్లే కొంతకాలం దగ్గుబాటి వెంకటేశ్వరరావుగాని, పురందేశ్వరిగాని ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయారు. అయితే తర్వాత కాంగ్రెస్‌కు వై.ఎస్‌. మంచినాయకుడిగా రుజువు కావడం, ఆయన నేతృత్వంలో పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఆశతో ఆ పార్టీకి దగ్గరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కన్నా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర వహించే అవకాశం కూడా పురందేశ్వరికి వరంలా లభించింది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆమె మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. పురందేశ్వరి 2004,2009లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపిగా గెలిచి కేంద్రమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా అందరి మన్ననలను అందుకున్నారు. రాష్ట్ర విభజన వంటి అనూహ్య పరిణామాలు ఎదురవడంతో పురందేశ్వరికి రాజకీయ మనుగడపై అనుమానాలేర్పడ్డాయి. దీంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీకి కటీఫ్ చెప్పి… బిజెపి తీర్దం పుచ్చుకున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు ఉన్న మంచి పేరు, బిజెపిలో కూడా మంచి పనితీరు కనపరచడంతో పార్టీ ఆమెను దేశ మహిళా మోర్చ అధ్యక్షురాలుగా నియమించింది. పూర్తిగా ఆమెను దేశానికే పరిమితం చేయకుండా మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించేట్టుగా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పురందేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిని చేసినట్లయితే టిడిపికి ఎదురు దెబ్బ తగిలి… రాష్ట్రంలో బిజెపి బలపడటం ఖాయమని కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే ఆ దిశలో పావులు కదులుతున్నాయి.

– సవరం నాని

Read Also: బీజేపీకి ఓటేస్తే.. రిజ‌ర్వేష‌న్లు గోవిందా!

First Published:  28 Sept 2015 8:43 AM IST
Next Story