ఒబెసిటీ కంటే కొంపముంచేది మరొకటుంది....!
అధికబరువు, ఊబకాయం… ఇవే రోగాలను తెచ్చిపెడతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఊబకాయం కంటే ఎక్కువగా బద్దకం, అంటే శారీరక వ్యాయామ లేమి మనకు అనారోగ్యాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యూరప్ దేశాల్లో పన్నెండు సంవత్సరాలపాటు మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల ద్వారా ఈ విషయాన్ని నిర్దారించారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకులు అందిస్తున్న వివరాలను బట్టి ఒబెసిటీ కారణంగా ఏటా 3లక్షల37వేలమంది మరణిస్తుండగా, శారీరక వ్యాయామం లేకపోవడం వలన 6 లక్షల 76వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకి […]
అధికబరువు, ఊబకాయం… ఇవే రోగాలను తెచ్చిపెడతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఊబకాయం కంటే ఎక్కువగా బద్దకం, అంటే శారీరక వ్యాయామ లేమి మనకు అనారోగ్యాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యూరప్ దేశాల్లో పన్నెండు సంవత్సరాలపాటు మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల ద్వారా ఈ విషయాన్ని నిర్దారించారు.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకులు అందిస్తున్న వివరాలను బట్టి ఒబెసిటీ కారణంగా ఏటా 3లక్షల37వేలమంది మరణిస్తుండగా, శారీరక వ్యాయామం లేకపోవడం వలన 6 లక్షల 76వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకి కనీసం ఇరవై నిముషాల పాటు వేగవంతమైన నడకతో ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చని ఎన్నో అనారోగ్యాలను రాకుండా నివారించవచ్చని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. శరీరబరువుతో సంబంధం లేకుండా వ్యాయామం అనేది అందరికీ అవసరమేనంటున్నారు వీరు. సన్నగా ఉన్నాం కదా…మాకు వ్యాయామం అక్కర్లేదు అనుకుంటే పొరబాటేనని, వీరికి సైతం శారీరక వ్యాయమలేమి కారణంగా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందనేది ఈ అధ్యయన వేత్తల మాట.
అలాగే అధికబరువుండి వ్యాయామం చేస్తున్న వారు, చేయనివారికంటే అనారోగ్యాల రిస్క్‌ని తగ్గించుకునే అవకాశం చాలా ఉందని కూడా చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒబెసిటీ ఈ రెండింటి కారణంగా ఎదురయ్యే సమస్యలపై నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు. 12 సంవత్సరాలపాటు మూడులక్షలకు పైగా యురోపియన్ల మీద నిర్వహించిన అధ్యయనంలో వారి వ్యాయామస్థాయిలను, వారి నడుము కొలతలను పరిగణనలోకి తీసుకుని, వారు ఏ వయసులో ఏ అనారోగ్యాలతో మరణించారు అనే విషయాలను నమోదుచేసి అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనంలో చిన్న వయసులో మరణాన్ని కొనితెచ్చిన కారణాల్లో శారీరక వ్యాయామం లేకపోవడమే ప్రథమంగా ఉంది. ఒబెసిటీ కాకపోవడం విచిత్రం. సాధారణ బరువున్నా, అధికబరువు, ఊబకాయంతో ఉన్నా బరువుతో సంబంధం లేకుండా శారీరక వ్యాయామం లేకపోవడం అనేది ఒకేరకమైన చెడు ప్రభావాన్ని చూపింది. ఒకవేళ యూరప్ దేశాల్లో ఒబెసిటీని తగ్గిస్తే సంవత్సరానికి 3.6శాతం మరణాలను ఆపవచ్చని, అదే బద్దకాన్ని వదిలి వ్యాయామం చేసేవారి శాతాన్ని పెంచితే 7.5 శాతం మరణాల రేటుని తగ్గించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఉల్ఫ్ ఎక్లండ్ బిబిసితో చెప్పారు.
ఆరోగ్యపరంగా హానిచేసే అంశాల్లో ఒబెసిటీతోపాటు మనం వ్యాయామలేమిని కూడా ప్రధానమైన అంశంగా గుర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కనీసం ఇరవై నిముషాల వ్యాయామం లేదా వేగంగా నడక అనేది ప్రతిమనిషికి అత్యవసరమని నార్వేకి చెందిన ఈ ప్రొఫెసర్ అంటున్నారు. ఇంటినుండి ఆఫీస్‌కి లేదా లంచ్‌బ్రేక్‌లోనో, సాయంత్రం పూటో ఓ ఇరవై నిముషాలపాటు నడవమని ఈయన మరీమరీ చెబుతున్నారు. ఊబకాయం, వ్యాయామలేమి ఈ రెంటింటి కారణంగా వచ్చే వ్యాధులు ఒకలాంటివేనని ఎక్లండ్ తెలిపారు.
కాబట్టి అధికబరువు లేము కదా, వ్యాయమం అవసరం లేదులే అనుకునేవారికి ఇది తీవ్రమైన హెచ్చరికే. అత్యంత తేలిగ్గా ఆరోగ్యాన్ని సమకూర్చిపెట్టే వ్యాయామం అనే వరాన్ని అందరూ వినియోగించుకుని ఆరోగ్యాన్ని పెంచుకుంటారని ఆశిద్దాం.