wonder world 38
కవలల గ్రామం ఆరువేల మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో సరైన రోడ్లు కూడా లేవు. స్కూలు, హాస్పిటల్ లేనేలేవు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక వెనకబడిన గ్రామాలలో అది కూడా ఒకటి. అలహాబాద్ జిల్లాలోని ధుమాన్‌ఘంజ్ ప్రాంతంలో ఆ గ్రామం ఉంది. దాని పేరు మొహమ్మద్‌పూర్ ఉమరి. అయితేనేం ఆ గ్రామం నిత్యం వార్తల్లో ఉంటుంది. గడచిన 50 ఏళ్లలో ఆ గ్రామంలో వందజతల కవలలు పుట్టారు. యూపీలో ఆ గ్రామం గురించి ఎవరూ పట్టించుకోక పోయినా అది […]
కవలల గ్రామం
ఆరువేల మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో సరైన రోడ్లు కూడా లేవు. స్కూలు, హాస్పిటల్ లేనేలేవు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక వెనకబడిన గ్రామాలలో అది కూడా ఒకటి. అలహాబాద్ జిల్లాలోని ధుమాన్‌ఘంజ్ ప్రాంతంలో ఆ గ్రామం ఉంది. దాని పేరు మొహమ్మద్‌పూర్ ఉమరి. అయితేనేం ఆ గ్రామం నిత్యం వార్తల్లో ఉంటుంది. గడచిన 50 ఏళ్లలో ఆ గ్రామంలో వందజతల కవలలు పుట్టారు. యూపీలో ఆ గ్రామం గురించి ఎవరూ పట్టించుకోక పోయినా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గ్రామంగా ఉంది. గ్రామంలో హాస్పిటల్ ఉండి ఉంటే మరో వంద జతల కవలలుండేవారని గ్రామస్తులంటున్నారు. అంటే సరైన వైద్య సదుపాయాలందక వంద కాన్పుల్లో శిశువులు మరణించారన్నమాట. ”ఊళ్లో 6000 మంది జనాభా ఉన్నారు. అయినా ఊరిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం ఆసుపత్రిగానీ, స్కూలు గానీ లేవు. అందుకే చాలామంది ఉపాధి వెతుక్కుంటూ ఢిల్లీ, ముంబై వెళ్లిపోయారు. ఉన్నది కొద్దిమందే.” అని మహమ్మద్ కరీమ్ అనే గ్రామస్తుడు చెప్పాడు. ఆయన కవల సోదరుడు ఢిల్లీలో ఉంటున్నాడు. ”చిన్నతనంలో మమ్మల్ని అందరూ గుర్తు పట్టేవారు 15 ఏళ్లు దాటిన తర్వాత పోలికలు చాలా దగ్గరగా ఉంటుండడంతో మమ్మల్ని ఎవరూ పోల్చలేకపోతున్నారు. సమస్యేమిటంటే బైటవారు మమ్మల్ని గేలిచేస్తుంటారు. మీదో వింత ఊరు అని ఈసడిస్తుంటారు” అని జీషన్ కవల సోదరుడైన మహమ్మద్ అతిషాన్ వాపోతుంటాడు. గ్రామంలో 80 శాతం మంది ముస్లింలు, 20 శాతం మంది హిందువులు ఉన్నారు. అయితే రెండు మతాల వారిలోనూ ఇలా కవలలు పుడుతుండడం విశేషం. స్థానికంగా వారి జీవన విధానం, వాతావరణం గ్రామస్తుల జన్యువులపై ప్రభావం చూపిస్తుండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ”మా ఊళ్లో ఇలా కవలలు పుట్టడం 90 ఏళ్ల క్రితం మొదలయ్యిందని ఊళ్లో పెద్దవాళ్లు చెబుతున్నారు. అంతకుముందు ఊళ్లో మూడు నుంచి నాలుగు జతల మంది కవలలు మాత్రమే ఉండేవారు. తర్వాత నుంచి ఊళ్లో కవలలు పుట్టడం పెరిగింది. 50 ఏళ్ల క్రితం నుంచి ఇది క్రమం తప్పకుండా జరుగుతోంది” అని 70 ఏళ్ల రవూఫ్ ఆలం అనే గ్రామస్తుడు చెప్పాడు. ఈయన స్థానిక గ్రామ సభ సభ్యుడు కూడా. ఈ ఏభై ఏళ్లలో ఊళ్లో 90 జతల కవలలు మరణించారు. దానికి ప్రధానమైన కారణం ఊళ్లో హాస్పటల్ లేకపోవడం, సరైన వైద్య సదుపాయాలు అందకపోవడమే. ఆసుపత్రి ఉండి ఉంటే వారందరూ బతికి ఉండేవారని, అపుడు తమ ఊరు ఇంకా చాలా పెద్ద పేరు సంపాదించి ఉండేదని గ్రామస్తులంటున్నారు. ”దేశదేశాల నుంచి అనేకమంది మేధావులు వస్తుంటారు. రక్తనమూనాలు తీసుకుంటుంటారు. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లా కనిపించరు. వారు ఏం కనుక్కున్నారో.. మా రక్తంలో ఏం ఉందో చెప్పరు.” అని ఆసిఫ్ అనే గ్రామస్తుడన్నాడు. ”కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని సెల్యులార్ అండ్ మాలెక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన కొందరు నిపుణులు మా వూరిని సందర్శించి కొన్ని పరీక్షలు జరిపి ఒక విషయం తేల్చారు. మేం తాగడానికి ఉపయోగిస్తున్న భూగర్భ జలాలలో కొన్ని రకాల ఖనిజాలు కలుస్తున్నాయని, వాటి వల్ల గానీ, మేం వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల వల్ల గానీ ఇలా జరుగుతుండవచ్చని వారు చెప్పారు” అని ఆసిఫ్ వెల్లడించాడు.