ఉపముఖ్యమంత్రులతో ఉపయోగమేంటి?
రాష్ర్టం ఏదైనా డిప్యూటీ సీఎం పదవి అంటే ఆరో వేలు లాంటిదని అర్థం. ఆ పదవి దక్కిందంటే..గవర్నర్‌కు ఎక్కువ..ముఖ్యమంత్రికి తక్కువ అనేలా ఉంటుందని నేతలు అంటుంటూరు. గతంలోకి తొంగి చూసినా, వర్తమానాన్ని పరిశీలించిన, భవిష్యత్‌ను అంచనా వేసినా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి పదవులంటేనే ఆరోవేలనే నానుడి స్థిరపడిపోయింది. రాష్ర్టపతి, గవర్నర్ పదవులను రబ్బర్‌స్టాంపులంటూ జోకులేస్తుంటారు. అయితే డిప్యూటీ పీఎం, సీఎంల వ్యవస్థ రబ్బరు స్టాంపు కంటే హీనమనే పరిస్థితి ప్రస్తుతం ఉందని..ఆ పదవులు అనుభవిస్తున్న నేతలే […]
రాష్ర్టం ఏదైనా డిప్యూటీ సీఎం పదవి అంటే ఆరో వేలు లాంటిదని అర్థం. ఆ పదవి దక్కిందంటే..గవర్నర్‌కు ఎక్కువ..ముఖ్యమంత్రికి తక్కువ అనేలా ఉంటుందని నేతలు అంటుంటూరు. గతంలోకి తొంగి చూసినా, వర్తమానాన్ని పరిశీలించిన, భవిష్యత్‌ను అంచనా వేసినా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి పదవులంటేనే ఆరోవేలనే నానుడి స్థిరపడిపోయింది. రాష్ర్టపతి, గవర్నర్ పదవులను రబ్బర్‌స్టాంపులంటూ జోకులేస్తుంటారు. అయితే డిప్యూటీ పీఎం, సీఎంల వ్యవస్థ రబ్బరు స్టాంపు కంటే హీనమనే పరిస్థితి ప్రస్తుతం ఉందని..ఆ పదవులు అనుభవిస్తున్న నేతలే వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంతా ఆయనే..!
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సామాజికవర్గ సమీకరణాలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ఉపముఖ్యమంత్రులను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. అయితే ఇద్దరిలో ఒకరైన చినరాజప్ప కాపు..వినయవిధేయతల కోటాలో ఎంపిక కాగా, మరొక డిప్యూటీ కేఈ కృష్ణమూర్తి బీసీ..సీనియర్ వాటాలో పోస్టు దక్కించుకున్నారు. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంలకు డిజిగ్నేషన్ మాత్రమే మిగిలింది. డిప్యూటీ సీఎంల బాధ్యతలతోపాటు ఇద్దరికి అప్పగించిన శాఖల పనులను సీఎం చంద్రబాబు, చినబాబు లోకేశ్, ఆయన కోటరీ మనుషులే చక్కబెట్టేస్తున్నారని, దీంతో తాము ఆరో వేలులా మిగిలిపోయామని ఆవేదనలో డిప్యూటీలున్నారు. ఈ విషయంలో చినరాజప్ప బయటపడకపోయినా, కేఈ మాత్రం తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కేస్తున్నారు.
సీఎం వెర్సస్ డిప్యూటీ సీఎం
తనకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి రెవెన్యూ శాఖను కట్టబెట్టినా.. ఏనాడూ కేఈ సంతృప్తిగా లేరు. తన రెవెన్యూ శాఖ వ్యవహారాలను మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ చక్కబెడుతున్నారని కేఈ తరచూ వాపోయేవారు. రాజధాని ఎంపిక నుంచి..భూసమీకరణ, సేకరణను కేఈ శాఖ చూడాల్సి ఉండగా, నారాయణ ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో రాజధాని భూసేకరణకు తాను వ్యతిరేకమంటూ కేఈ ప్రకటించారు. వివిధ జిల్లాలకు ఇన్‌చార్జిలను నియమించేటప్పుడు కూడా కేఈని పక్కనబెట్టారు.
ఏపీలో 22 మంది రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను బాబు నిలిపేశారు. కలెక్టర్ల సమావేశంలో కేఈని నిలబెట్టి మరీ రెవెన్యూశాఖ అవినీతిలో ఫస్ట్‌ప్లేస్ ఉందని బాబు క్లాస్ పీకారు. ఈ ఘటనలతో సీఎం డిప్యూటీ సీఎం మధ్య వార్ నడుస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.
డమ్మీ డిప్యూటీ నిమ్మకాయల
డిప్యూటీ సీఎం కమ్ హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డమ్మీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోంశాఖలో బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారం కూడా చినరాజప్పకు తెలియదంటే అతిశయోక్తి కాదని, టీడీపీ నేతలే ఆఫ్‌ది రికార్డ్‌గా చెబుతున్నారు. అంతా బాబు, చినబాబే చూసుకుంటున్నప్పుడు తానెందుకు వేలు పెట్టాలనే ఆలోచనతో నిమ్మకాయల కూడా పెద్దగా ఏ వ్యవహారాన్ని పట్టించుకోవడంలేదని ప్రచారం సాగుతోంది. ఏనాడూ మంత్రి పదవి మొఖం చూడని చినరాజప్పకు డిప్యూటీ సీఎం కమ్ హోం డిజిగ్నేషన్ ఇవ్వడమే గౌరవంగా భావిస్తూ..రిస్క్ తీసుకోవడం ఎందుకని పాలనను, బాధ్యతలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలోనూ అంతే..
తెలంగాణ కేబినెట్ ఏర్పాటైన కొత్తలో సామాజికవర్గ సమీకరణాల ప్రాతిపదికన ఇద్దరు డిప్యూటీ సీఎంలను తీసుకున్నారు. మైనారిటీలకు చెందిన మహమూద్ అలీ, ఎస్సీ వర్గానికి చెందిన రాజయ్యలు డిప్యూటీ సీఎం బాధ్యతలతోపాటు శాఖలు కేటాయించారు. ఆ తరువాత అవినీతి ముద్ర వేసి ఇంటికి పంపించేశారు. ఇక మహమూద్ అలీ పాతబస్తీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ నామ్‌కే వాస్తే డిప్యూటీగా మిగిలిపోయారనే విమర్శలున్నాయి.
సమైక్య రాష్ర్టంలోనూ..డిప్యూటీతో ఢీ
రాష్ర్ట విభజనకు ముందు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ డిప్యూటీ సీఎం లొల్లి నడిచింది. కాంగ్రెస్ శైలి రాజకీయాలతో సీఎం కిరణ్ , డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎంగా, తనకు అప్పగించిన శాఖాపరంగా దామోదర రాజనర్సింహ తీసుకున్న నిర్ణయాలకు సీఎం కిరణ్ మోకాలడ్డేవారు. ఇద్దరి మధ్య వార్ పతాకస్థాయి చేరి ..రెండువర్గాలుగా కూడా విడిపోయారు.
రాష్ర్టం ఏదైనా, పాలకులు ఎవరైనా సీఎం, డిప్యూటీ సీఎం లొల్లి కామన్ అనే విధంగా మారింది పరిస్థితి. ఆరో వేలు లాంటి డిప్యూటీ డిజిగ్నేషన్ ఇవ్వడం.. డమ్మీలను చేయడం ఎందుకు? మంత్రులుగా ఉంచితే చాలదా అనే వాదన కొందరి నుంచి వ్యక్తమవుతోంది.