మరో రెడ్డిని..ఢీకొట్టనున్న `కారు`?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ తరువాత..ఆపరేషన్ రెడ్డీస్ ఆరంభమైంది. ఇప్పటికే కొంతమంది రెడ్డి నేతలను కారు ఢీకొట్టగా..పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది. తాజాగా మరో కీలక రెడ్డి నేతను కారు ఢీకొట్టనుందని సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలకు అతీతంగా రెడ్డి కమ్యూనిటీ టార్గెట్ గా ఇది సాగుతోందని ఇప్పటికే కొందరు నేతలు ఆరోపించారు. అయితే జరుగుతున్న సంఘటనలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దాడులు..కేసులు..విమర్శలు రెడ్లపైనే! ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయినది రేవంత్‌రెడ్డే అయినా..తెరవెనుక బాసులు, […]
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ తరువాత..ఆపరేషన్ రెడ్డీస్ ఆరంభమైంది. ఇప్పటికే కొంతమంది రెడ్డి నేతలను కారు ఢీకొట్టగా..పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది. తాజాగా మరో కీలక రెడ్డి నేతను కారు ఢీకొట్టనుందని సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలకు అతీతంగా రెడ్డి కమ్యూనిటీ టార్గెట్ గా ఇది సాగుతోందని ఇప్పటికే కొందరు నేతలు ఆరోపించారు. అయితే జరుగుతున్న సంఘటనలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
దాడులు..కేసులు..విమర్శలు రెడ్లపైనే!
ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయినది రేవంత్‌రెడ్డే అయినా..తెరవెనుక బాసులు, కేసులు చాలానే ఉన్నాయి. అయితే రేవంత్.. రెడ్డి కావడంతోనే అడ్డంగా బుక్ చేశారని ఆ కమ్యూనిటీలో ఎవరు నమ్మటంలేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జేఏసీ చైర్మన్ కోదండరామిరెడ్డిని మాత్రం పథకం ప్రకారమే పక్కనబెట్టారనే విమర్శలున్నాయి. వనపర్తిలో చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ దాడి, మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు దాడికి పాల్పడిన సంఘటనలు ఆపరేషన్ రెడ్డీస్ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై సాప్ట్‌కార్నర్‌తో ఉన్న కిషన్‌రెడ్డి, జానారెడ్డి వంటి నేతలు తమ మనుగడకు ముప్పు ఏర్పడిందని గ్రహించి ఇప్పుడిప్పుడే సర్కారుపై నోరు చేసుకుంటున్నారు. దీంతో పెద్ద రెడ్లపై కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. టీడీపీ తొత్తులని, చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని, తెలంగాణ ద్రోహులనే ముద్ర వేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. తాజాగా జరగబోయేది మరో ఎత్తు అని మంత్రి తలసాని హెచ్చరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
విపక్ష పార్టీ అధ్యక్షుడినే డైరెక్టుగా జైలుకు పంపుతామని హెచ్చరించడం ఆపరేషన్ రెడ్డీస్ లక్ష్యంలో భాగమనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కాంలో ..అప్పటి గృహనిర్మాణశాఖా మంత్రి దోషి అని న్యాయస్థానం తేల్చితే..శిక్ష తప్పదు. కానీ విచారణ పూర్తి కాకుండానే ఇలాంటి హెచ్చరికలు చేయడం రెడ్డి సామాజికవర్గానికి చెందిన అగ్రనేతలను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నమనే ప్రచారం సాగుతోంది.
రెడ్లే లక్ష్యం ఎందుకంటే?
రెడ్డి కమ్యూనిటీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ ఎస్ ఈ ఆపరేషన్ కొనసాగిస్తోందని రేవంత్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఆరోపించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికవర్గంగా, ఓటు బ్యాంకు పరంగా బలమైన రెడ్లను దెబ్బ కొట్టడం ద్వారా తమకు ఎదురులేకుండా చేసుకోవాలనే వ్యూహంలో భాగమే ఇదంతా అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలకు రెడ్డి సామాజికవర్గనేతలే అధ్యక్షులుగా ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే టీటీడీపీకి కూడా రేవంత్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎదగాలన్నా, బలపడాలన్నా, పార్టీని బలోపేతం చేయాలన్నా, తన నాయకత్వాన్ని ఎదురు లేకుండా చేసుకోవాలన్నా..తెలంగాణలో అడుగడుగునా రెడ్లు అడ్డొస్తారు. అందుకే ఈ బలమైన సామాజికవర్గ నేతలను విడివిడిగా పడగొట్టి బలహీనపరచాలని పెద్దతలకాయల ఆలోచన అని తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కొందరు రెడ్డి కమ్యూనిటీ యువనేతలు ..పార్టీలకు అతీతంగా, రెడ్లంతా కలిసి పోరాడదామని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కమ్యూనిటీకి సంబంధించి ఓ వాట్సాప్ గ్రూప్ కూడా నడుస్తోందని సమాచారం. రెడ్డి కమ్యూనిటీ లక్ష్యంగా తెలంగాణలో జరుగుతున్న దాడులు, అందరూ ఐక్యం కావాలనే సందేశంతో దీనిలో పోస్టులు షేర్ చేస్తున్నారని తెలుస్తోంది.