Telugu Global
Others

బాధిత రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర క్యాబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమైన తెలంగాణ సర్కారు ఈసారి కార్యాచరణకు పూనుకునే దిశలో సిద్ధమైంది. ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. పంట నష్టాలతో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని ఒక్కసారిగా నాలుగు రెట్లు పెంచింది. ఇప్పటిదాకా ఇస్తున్న రూ.1.50 లక్షల నష్ట పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కేబినెట్‌ […]

బాధిత రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం
X
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర క్యాబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమైన తెలంగాణ సర్కారు ఈసారి కార్యాచరణకు పూనుకునే దిశలో సిద్ధమైంది. ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. పంట నష్టాలతో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని ఒక్కసారిగా నాలుగు రెట్లు పెంచింది. ఇప్పటిదాకా ఇస్తున్న రూ.1.50 లక్షల నష్ట పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కేబినెట్‌ ప్రకటించింది. మంత్రివర్గం నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెబుతూ ప్రతిపక్షాలు రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయడం మానేసి వారిలో స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించాలని హితవు చెప్పారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి పగటిపూట 9 గంటలపాటు కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయించామని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా రైతులకు తెలియజేయాలని కోరారు. తాము ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఆరు లక్షల్లో 5 లక్షలు బాధిత కుటుంబానికి, లక్ష రూపాయలు వారు చేసిన అప్పుల చెల్లింపునకు ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాల్లో పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లలుంటే వారికి కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరుస్తామని కడియం తెలిపారు.
శాంతిభద్రతల రక్షణకు కొత్త బెటాలియన్లు
నక్సల్స్‌, శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, సమన్వయంతో వీటిని ఏర్పాటు చేస్తాయని ఆయన తెలిపారు. వీటిని అదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నామని, వీటిద్వారా కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ వరకు 3,896 అదనపు పోస్టులు అందుబాటులోకి వస్తాయని కడియం చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికంగా బలపడేందుకు కేబినెట్‌ కొన్ని నిర్ణయాలు తీసుకుందని శ్రీహరి చెప్పారు. కొన్ని దేశాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశామని, ఇలా మూడు గ్రూపులుగా విభజించామని, వీటి నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు, రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రచారం చేసేందుకు ఇవి పని చేస్తాయని, ఈ గ్రూపులకు ఉన్నతాధికారులు నేతృత్వం వహిస్తారని కడియం తెలిపారు.
First Published:  20 Sept 2015 4:37 AM IST
Next Story