Telugu Global
Arts & Literature

భారతీయ నవీన చిత్రకళా రీతిని ప్రపంచపు అంచులకు తీసుకొనిపోయిన... మక్బూల్‌ ఫిదా హుస్సేన్‌

చిత్రకళ పట్ల ప్రత్యేక అభిరుచి ఉన్నా లేకపోయినా, హుస్సేన్‌ అన్నపేరు విననివారుండరు.  హుస్సేన్‌ చిత్రకళను నేర్చుకున్నది జె.జె. స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్సు బొంబాయి. గురువు ఎన్‌.ఎస్‌. బెంద్రే. జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు చీకటి రోజులు. జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్సు నుండి డిప్లమో పొందిన తరువాత జీవన రథం నడవడానికి సినిమాలకు అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం చెక్కబోర్డులపై నటీనటుల చిత్రాలను చిత్రించాడు. నాలుగణాలు (25 పైసలు)కొక చదరపు అడుగు లెఖ్ఖన ఒకసారి 40 అడుగుల చిత్రాన్ని మండుటెండలో బొంబాయి మధ్యలోనున్న […]

భారతీయ నవీన చిత్రకళా రీతిని ప్రపంచపు అంచులకు తీసుకొనిపోయిన... మక్బూల్‌ ఫిదా హుస్సేన్‌
X
husain
మక్బూల్‌ ఫిదా హుస్సేన్‌

చిత్రకళ పట్ల ప్రత్యేక అభిరుచి ఉన్నా లేకపోయినా, హుస్సేన్‌ అన్నపేరు విననివారుండరు. హుస్సేన్‌ చిత్రకళను నేర్చుకున్నది జె.జె. స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్సు బొంబాయి. గురువు ఎన్‌.ఎస్‌. బెంద్రే.

జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు చీకటి రోజులు. జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్సు నుండి డిప్లమో పొందిన తరువాత జీవన రథం నడవడానికి సినిమాలకు అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం చెక్కబోర్డులపై నటీనటుల చిత్రాలను చిత్రించాడు. నాలుగణాలు (25 పైసలు)కొక చదరపు అడుగు లెఖ్ఖన ఒకసారి 40 అడుగుల చిత్రాన్ని మండుటెండలో బొంబాయి మధ్యలోనున్న బోదర్‌ బాగ్‌లో నిలబడి వేశాడు. సినిమా బోర్డులపై వేసిన బొమ్మల గురించి మాట్లాడుతూ ”కొన్ని గంటలు కష్టపడి వేసిన ఈ చిత్రాల జీవితం అత్యల్పం, సినిమా మారిపోయిన వెంటనే క్షణాలలో వాటిని తొలగిస్తారు. చిత్రంగా లేదూ?” అంటాడు. హోర్డింగ్‌ పెయింటర్‌గా కొంతకాలం బ్రతుకీడ్చి, నిర్మాతలు ఇచ్చే అరకొర డబ్బు చాలక, పిల్లల బొమ్మల తయారీలో నెలకు 300 రూపాయల వేతనంకోసం రోజులో 24 గంటలు పని చేసిన సందర్భాలున్నాయి. పగలంతా ఫర్నిచరు డిజైన్‌ చేస్తూ, రాత్రంతా పెయింట్‌ చేస్తూ ఫుట్‌పాత్‌పై పరుండేవాడు.

అతని కష్టాన్ని చూసి, ఇంటికి పిలిచి తన పిల్లలతో పాటు అతనికి భోజన సదుపాయం సమకూర్చిన దయామయి మాతృమూర్తి మెహమూదా బీ. ఆమె అప్పటికి విధవ. తన కూతురు, కుమారునితో జీవిస్తూ ఉండేది. ఆ అభిమానం క్రమేపీ పెరిగి పెద్దదై తన కూతురు ఫజిల్‌ బీబీని 1941లో హుస్సేన్‌కు ఇచ్చి వివాహం జరిపించింది (ఫజిల్‌ బీబీ 1998లో మరణించింది). ఆమె వల్ల హుస్సేన్‌ ఆరుగురు పిల్లల తండ్రయినాడు. ‘ఆమె లేకపోతే నాన్న ఇంతటి వాడయ్యేవాడు’ కాదంటాడు హుస్సేన్‌ కుమారుడు షంషాద్‌ (ఇతనూ చిత్రకారుడే). ఇదే విషయాన్ని హుస్సేన్‌ తన ఆత్మకథలో ఒప్పుకున్నాడు. ఎంతటి గడ్డు రోజుల్లో కూడా హుస్సేన్‌కు తన చిత్ర కళపై నమ్మకం సడలలేదు. ఎప్పటికయినా గొప్ప చిత్రకారుణ్ణవుతానన్న ఆత్మవిశ్వాసం తోడుగా ఉండేది.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత చిత్రకారులకు పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే ప్రఖ్యాత చిత్రకారుడు ఒకనాడు అనుకోకుండా హుస్సేన్‌ చిత్రాలను జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బొంబాయిలో చూడటం తటస్థించింది. వెంటనే తనంత తానుగా స్నేహహస్తం చాచి అతనిని ప్రోగ్రెసివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూప్‌ (Progressive Artists Group) లో సభ్యునిగా చేర్చుకున్నాడు. ” సౌజా నాకెప్పుడూ మార్గదర్శకుడే, ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అయితే నేనేమీ గొప్ప చిత్రకారుణ్ణి కాదు అని నా గురించి అనేవాడు. దానికి నేనేమీ బాధపడలేదు” అంటాడు హుస్సేన్‌. ఎవ్వరతనిని ఏవిధంగా విమర్శించినా ప్రతిస్పందించక పోవటం అతని బలమూ, బలహీనత.

2ఈ ప్రో.ఆ. గ్రూపు, పాశ్చాత్య ధోరణిలో వేసే వాస్తవ చిత్రీకరణ చిత్రాలను బహిష్కరించటంతో పాటుగా రవివర్మ, బెంగాలు శైలి చిత్రాలను కూడా నిరసించే చిత్రకారుల కూటమి. ఆధునిక శైలిలో భారతీయతను మిళితం చేస్తూ ప్రో.ఆ గ్రూప్‌ వేసిన చిత్రాలు మొదటి సారిగా 1947వ సం|| లో ప్రదర్శించబడి, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాయి. రూడీ వాన్‌ లూడెన్‌ (Rudy-Van-Leydan) అనే జర్మనీ దేశస్థుడు అప్పటిలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారపు సంచికలో చిత్రకళా విమర్శకునిగా పనిచేసేవాడు. హుస్సేన్‌ను మొదటి సారిగా భుజం తట్టిందితనే, 1950లో హుస్సేన్‌ చిత్రకళా ప్రదర్శన బొంబాయిలో విజయవంతంగా ప్రదర్శితమై 50 రూపాయల నుండి 300 రూపాయల మధ్య ఖరీదుతో ప్రదర్శనకు ఉంచినవన్నీ అమ్ముడయ్యాయి. ఆరోజు నుంచి ఈరోజు వరకూ పెద్ద పెద్ద అంగలతో ఒకటే పరుగుగా సాగింది హుస్సేన్‌ చిత్రకళా జీవితం.
పో.ఆ గ్రూపులోని సౌజా, రజాలు తమ చిత్రాలకు, ఐరోపాలోని బైజాంటైన్‌ చిత్రకళ నుంచి ప్రేరణ పొందితే, హుస్సేన్‌ మధుర, ఖజురహో దేవాలయపు శిల్పాలు, పహరీ, భారతీయ జానపద చిత్రాల నుంచి ప్రేరణ పొందాడు. మొదట్లో, విద్యార్థి దశలో హుస్సేన్‌ నెదర్‌లాండ్స్‌ చిత్రకళను ఇష్టపడేవాడు. సౌజా స్నేహంతో ఐరోపా ఆధునిక చిత్రాలను అర్థం చేసుకుని మెచ్చుకున్నా, అవి భారతీయ నవీన చిత్రకళకు ఆదర్శం కారాదని భావించి, నెమ్మదిగా సౌజా, రజాల భావజాలం నుంచి బయటపడ్డాడు. మొదటి రోజుల్లో అతను వేసిన రెండు చిత్రాలు అతనికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చాయి. ఇందులో జమీన్‌ (భూమి) అన్న చిత్రం – 1955లో ‘నేషనల్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌’లో మొదటి బహుమతిని గెలుచుకుంది.

ఈ చిత్రం బిమల్‌ రాయ్‌ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దో బీఘా జమీన్‌’ అన్న చలన చిత్రం ప్రేరణతో వేసినది. రెండవది ‘దీపానికి సాలెపురుగుకి మధ్య’ అన్న చిత్రం. ఈ చిత్రంలో ఐదుగురు స్త్రీలు చిత్రించబడ్డారు. వారి వెనుకనున్న గోడపై అస్పష్టంగా సంస్కృతాన్ని పోలిన (అర్ధమాగధి) లిపిలో కొన్ని అక్షరాలు వుంటాయి. ఒకామె చేతిలో సాలెపురుగును దారంతో పట్టుకుని వుంటుంది. కొందరు విమర్శకులు ఈ ఐదుగురునీ పంచ పతివ్రతలయిన అహల్య, కుంతి, ద్రౌపది, తార, మండోదరి లాంటి పాత్రలతో పోల్చారు. ఈ చిత్రం ఎంతగానో చర్చకి తావిచ్చినా దీని ఖరీదు 800 రూపాయలుగా నిర్ణయించటంతో కొనడానికెవరూ ముందుకు రాలేదు. దానితో దీనిని అమ్మే ప్రయత్నం విరమించుకొని తనవద్దనే వుంచుకున్నాడు.

హుస్సేన్‌ వేసిన చిత్రాలను చూసి ముచ్చటపడిన వారిలో మొదటివాడు భారతీయ సోషలిష్టు పార్టీ అధినేత రామ్‌మనోహర్‌ లోహియా. భారతీయ ఇతిహాస, పౌరాణిక గాథలను ఆధునిక రీతిలో చిత్రించి, ఆధునిక భారతీయ చిత్రకళను సామాన్యుని చెంతకు తీసుకుని వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చాడు. ఈ సలహాననుసరించిన హుస్సేను ఆ గ్రంథాలను పఠించి తనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి సారిగా వీటిని అప్పటి Illustrated Weekly of India ఇంగ్లీషు వారపత్రికకు ఎడిటర్‌గా ఉన్న రామన్‌ మెచ్చుకుని, తన పత్రికలో రంగులలో ముద్రించాడు. ఇదంతా 1960-70ల నాటి సంగతి. ప్రపంచ కళా జీవులందరినీ ఆకర్షించిన హిందూతత్త్వ విచారణే హుస్సేన్‌ చిత్రాలలోనూ కనిపిస్తుంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ నవీన భారతీయ చిత్రకళా ధోరణి ఎక్కువ మందిని ఆకర్షించింది. ఎంత డబ్బయినా పెట్టి కొనడానికి ముందుకొచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. హుస్సేన్‌ తన చిత్రాల విలువను వందల నుంచి వేలకు, లక్షలకు, చివరకు కోట్ల వరకూ పెంచుకుంటూ పోయాడు. త్యేబ్‌ మెహతా లాంటి అతని మిత్రులు ఈ ధోరణి ఎంతోకాలం సాగదని, హుస్సేన్‌ పని అయిపోయిందని భావించారు. అలవి కాని ఖరీదును నిర్ణయించి కళను సామాన్యులకు దూరం చేశాడని, కళను కోటీశ్వరులకు పరిమితం చేశాడనీ విమర్శించారు. అయితే హుస్సేన్‌ ఆంతరంగికులెవరూ దీనిని ఒప్పుకోరు. అవధులు దాటిన దయాగుణం, త్యాగశీలత అతనిలో వున్నాయని, అనేక మందికి విరాళాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటమే కాక చిన్న చిన్న చిత్రకారులకు అతను చేసిన గుప్తదానాలను ఉదహరిస్తారు. సామాన్యంగా మంది ఎక్కువయితే మజ్జిగ పల్చబడుతుంది. చిత్రాల సంఖ్య పెరిగేకొలది వాటి విలువ తగ్గాలి కానీ హుస్సేన్‌ వేసే చిత్రాల విషయంలో అది విలోమానుపాతంలో జరగటం కళాజగత్తులో ఒక వింత.

1హైదరాబాద్‌ నివాసి బద్రీవిశాల్‌ పిట్టీ, రామ్‌ మనోహర్‌ లోహియా ప్రోద్బలంతో హుస్సేను రామాయణంపై వేసిన 150 చిత్రాలను 1960 వ సం|| లో కొనుగోలు చేశాడు. 1980 వ సం|| నుంచీ హుస్సేను వేసిన ఏ చిత్రాన్నయినా ఎంత ధరయినా పెట్టి కొంటాడు అమెరికాలోని బోస్టన్‌ నివాసి అయిన హెర్స్‌. జి.ఎస్‌. శ్రీవాత్సవ అనే పారిశ్రామికవేత్త హుస్సేన్‌ నుంచి 125 చిత్రాలను 100 కోట్లకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకుని 25 చిత్రాల వరకు తీసుకున్నాడు. అయితే ఆదాయపు పన్ను శాఖవారి తనిఖీలతో ఇదో పెద్ద గందరగోళానికి దారి తీసింది.

హుస్సేను తనను ఎవరయినా ‘పండర్‌పూర్‌ కా లడ్కా’ అని పిలిస్తే చాలా సంతోషిస్తాడు. అతని స్వీయ జీవిత చరిత్ర పుస్తకం పేరు కూడా అదే. మన తెలుగు వాడయిన ‘నగేష్‌ కకునూర్‌’ క్రికెట్‌ ఆధారంగా నిర్మించిన ‘ఇక్బాల్‌’ అన్న చలనచిత్రం అతన్నెంతగానో ఆకర్షించింది. ఆ చిత్రం పట్ల ఆకర్షణతో ఆ చిత్రాన్ని భూమికగా తీసుకొని కొన్ని చిత్రాలు వేశాడు. అంతేకాదు ఆ చిత్రంలో ముఖ్య భూమికలో నటించిన శ్రేయాతల్పాడేను తన ఆత్మకథ ఆధారంతో నిర్మించబడే చిత్రంలో తన పాత్ర ధరించడానికి ఎన్నుకున్నాడు. ”దీనికి కారణం అతను నాలానే మహరాష్ట్రియన్‌, ఎంతయినా ప్రాంతీయాభిమానం పోదుకదా” అని నిజాయితీగా ఒప్పుకుంటాడు. ”ఆశల పల్లకిపై నా ప్రయాణం ఆలస్యంగా మొదలయింది, అందుచేతనే నాశక్తి నిలబడింది.” ఇది అతను తరచుగా చెప్పే మాట.

70 స||ల సుదీర్ఘ చరిత్ర గలిగిన చిత్రరచనా వ్యాసంగంలో ఇప్పటి వరకూ వేసిన చిత్రాలు 25 వేలకు పైమాటే. ఇందులో తనలోని10 శాతం అంతరంగం మాత్రమే ప్రస్ఫుటితమయిందని చెబుతాడు హుస్సేన్‌. అతను చిత్రాలు వేయడానికి సమయం, ప్రదేశం, ఏదీ అడ్డంకి కాదు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, అది ఆర్ట్‌గ్యాలరీ కావచ్చు, ఇల్లు కావచ్చు. సినిమాహాలు కావచ్చు, మార్కెట్‌ కావచ్చు, ఆయన పిలిస్తే చాలు కేన్వాస్‌ పై అద్వితీయ రాగాలాపన చేస్తుంది ఆయన కుంచె. చిత్రకళా రచన అతనికొక యజ్ఞం. సామాన్యంగా చిత్రకారులు ఏకాంతాన్ని అభిలషిస్తారు. ఆ ఏకాంతంలో తమలోని భావాలను బయటకు రప్పించుకుంటారు. కానీ హుస్సేన్‌ అలాకాదు. జన సందోహం మధ్యలో అందరూ చూస్తూండగానే చిత్రాలు గీస్తాడు. ”ఒక సంగీత విద్వాంసునిలా అందరూ చూస్తుండగానే నాకు ఉత్సాహం కలుగుతుంది. వారి మధ్యలో వారి స్పందన, ప్రతిస్పందనల మధ్య చిత్రాలు గీయటం నాకిష్టం. నాది “Live Art” అని చెబుతాడు. హుస్సేన్‌ చిత్రకారుడే కాదు చక్కటి కవికూడా. ఇతని కవిత్వంలో సూఫీతత్త్వం తొంగి చూస్తుంది ఒక కవితలో తన చిత్రకళా కౌశల్యం గురించి చెబుతూ-

”విశాలమైన ఆకాశాన్ని కేన్వాస్‌గా మలచి / నీవు చేతులతో చాచిపట్టుకో

ఎందుకంటే నా కుంచెకున్న విస్తృతి ఎంతో నాకే తెలియదు.”

“As I begin to paint / Hold the sky in your hands
As the stretch of my canvas is unknown to me”

హుస్సేన్‌కు ఈనాటికీ తనకంటూ ఒక స్థిరనివాసం లేదు. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, హైదరాబాద్‌, న్యూయార్క్‌, లండన్‌, దుబాయ్‌ ఇలా ప్రపంచంలో అతనెక్కడయినా ఉండవచ్చు. ప్రపంచమంతా ప్రయాణించినా అతనికి నచ్చిన ప్రదేశాలు ఐదే. అవి రోమ్‌, బీజింగ్‌, ఇస్తాంబుల్‌, మన దేశంలో కలకత్తా, బెనారస్‌లు.

హుస్సేన్‌కు సినిమాలంటే ఇష్టం. దిలీప్‌ కుమార్‌ లాంటి మరొక నటుడు ఇంతవరకూ రాలేదని అతని భావన. అతనికి నచ్చిన చిత్రం సత్యాజిత్‌ రాయ్‌ తీసిన ‘పథేóర్‌ పాంచాలి’ అయితే ‘రే’ తీసిన మిగిలిన చిత్రాలేమీ ఆ స్థాయిని అందుకోలేదని చెబుతూ భారత దేశపు గొప్ప దర్శకునిగా ఆదూర్‌ గోపాలక్రిష్ణన్‌ చిత్రాలను ఇష్టపడతానంటాడు. నటీమణులలో ఒకనాటి నూతన్‌, ఇప్పటి తారలలో మాధురీ దీక్షిత్‌, టబూలను మెచ్చుతాడు. కేవలం మాధురీ దీక్షిత్‌ కోసమే ‘హమ్‌ ఆప్‌కో హై కౌన్‌’ చిత్రాన్ని 65 సార్లు చూశాడు. ‘త్రూది ఐస్‌ ఆఫ్‌ ఏ పెయింటర్‌’ (Through the Eyes of a Painter) అన్న డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం బెర్లిన్‌ చిత్రోత్సవంలో ‘బంగారు ఎలుగు’ బహుమతిని గెల్చుకుంది. ఈ చిత్రాన్ని మృణాల్‌ సేన్‌ ఎంతగానో మెచ్చుకున్నాడు. మాధురీని నాయకిగా పెట్టి తీసిన ‘గజగామినీ’ అన్న చిత్రం ప్రశంసలను, విమర్శలను సమానంగా పొందింది. ఈ చిత్రపు నేపథ్యం వారణాసి గంగానది ఒడ్డున ఉండే ఘాట్‌. దీనిని సెట్‌గా వేశారు. పూర్తిగా స్టుడియోలో నిర్మించబడ్డ ఈ చిత్రాన్ని, అధ్యాయాలుగా, భాగాలుగా విభజించి చూస్తే కావలసినంత కళాసృష్టి వుందని భావించే వారున్నారు. అయితే ‘సమగ్రత’ లోపమే ఆ చిత్ర అపజయానికి కారణం. ఈ చిత్రం మహిళా ప్రపంచానికి నా నివాళి అన్నాడు. హుస్సేన్‌ తీసిన మరో చిత్రం పేరు ‘మీనాక్షి’ లేదా ‘మూడు నగరాల కథ’ అంతర్జాతీయంగా బహుమతినందుకొన్న చిత్రం. ఈ చిత్రం లక్నోలో ప్రదర్శించబడినపుడు, ఇందులోని ఒక ఖవ్వాలీ పాట, మహమ్మద్‌ ప్రవక్తను, ఖురాన్‌ను కించపరచేదిగా వున్నదని కొందరు ముస్లిం వాదులు ఆ సినిమా నడుస్తున్న హాలుపై దాడి చేశారు. ఈ చిత్రంలో కొంత భాగానికి హుస్సేన్‌ కుమారుడయిన ‘ఒవైసీ’ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో టబూ కథానాయిక. స్త్రీల విషయంలో అతనికొక ప్రత్యేక దృష్టి వుంది. తల్లి చిన్ననాడే మరణించింది. ఆమె రూపు రేఖలు సరిగా గుర్తులేవు. అందుచేతనే అతను వేసిన స్త్రీ చిత్రాలలో చాలా చోట్ల ముఖాన్ని ఖాళీగా వుంచుతాడు.

31953 వ సం|| లో జెకోస్లోవేకియా వెళ్ళినపుడు అక్కడ ‘మేరియా’ అనే ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతని చిత్రాలకు ఆమె భాష్యం చెప్పేది. ఆమెకు తాను వేసిన 50 చిత్రాలను బహుమతిగా ఇచ్చాడు. పెండ్లి చేసుకోమని అభ్యర్థించాడు. చివరకు గెడ్డం తొలగించుకొని, క్రాపు చేయించుకున్నాడు. భారతదేశం రావడానికి, రెండవ భార్యగా వుండటానికి ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతము ఆమె తన భర్తతో మెల్‌బోర్న్‌లో నివసిస్తుంది. హుస్సేన్‌ నిర్మించిన ‘మూడు నగరాల కథ’ (Tale of Three Cities) అన్న చిత్రంలో ఆమె ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది.

1966లో ప్రభుత్వం అతనికి పద్మశ్రీ బహుమతి ప్రదానం చేసింది. 1987లో అప్పటి ప్రభుత్వ అభ్యర్థిగా రాజ్యసభకు నియమించబడ్డాడు. కానీ పార్లమెంటులో ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు. రాజకీయ జీవితాన్ని ‘సన్‌సద్‌ పరిషత్‌’ అన్న కొన్ని చిత్రాలలో చిత్రించి చూపాడు. అదే సంవత్సరం పద్మవిభూషణ్‌గా మరో గుర్తింపు లభించింది.

హుస్సేన్‌ చిత్రాల గురించి చెప్పేటప్పుడు అతని ‘అశ్వశక్తి’ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. 1952లో హుస్సేన్‌ చైనా వెళ్ళినపుడు, అక్కడ 90 సం||ల వయస్సు వున్న చైనీస్‌ చిత్రకారుడు బి-పి-హంగ్‌ను కలిసాడు. అతను ఒక పెద్ద కాన్వాస్‌పై సుమారు వెయ్యి గుఱ్ఱాలను చిత్రించాడు. అతని నుంచి ప్రేరణ పొంది హుస్సేన్‌ గుఱ్ఱాలను చిత్రించి, తన చిత్రాలలో కనిపించేవి ‘సప్తాశ్వ రథమారూఢం’ అయిన సూర్యుని గుఱ్ఱాలని చెబుతాడు.

1950 నాటికే అతని సహాధ్యాయులైన సౌజా, రజాలు, ఒకరు లండన్‌కు, మరొకరు పారిస్‌కు తరలి పోయారు. హుస్సేన్‌ ఇండియాను వదలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దీనివల్లనే అతనికి అంతర్జాతీయ గుర్తింపు ఆలస్యంగా వచ్చిందని అతని అభిమానులు అంటారు. వంద కోట్ల భారతీయులకు నా చిత్రాలు అర్థం కావాలి. అందుకోసమే మార్మికతను నేను ఎన్నుకోలేదు. పాశ్చాత్య నిర్మాణ కౌశలం, భారత దేశపు ఆధ్మాత్మికత రెంటినీ సమన్వయ పరుస్తూ బొమ్మలు వేసుకుంటాను. అది నా అభిలాష. ఆ సమన్వయం ద్వారా మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి నా చిత్రాలు. ఇది అతను తన చిత్రాల గురించి తాను చెప్పుకునే మాట.

హుస్సేన్‌ చిత్రాలు ఆధునికమైన ఫారమ్‌ చెడని వక్రగీతలు, చిత్రలలోని రేఖలు, రంగులు ఏవీ కూడా ఒక క్రమగతిని వుండకపోయినా చూసిన వెంటనే అర్థాన్ని స్ఫురింపజేస్తాయి. అతని చిత్రాలలో పాశ్చాత్య ధోరణి కనిపించదు. ప్రాచీన భారతీయ చిత్రాలలానే రెండు ఆయతనాలలోనే చిత్రం ఉంటుంది. అందులో అతని కుంచె యొక్క వేగాన్ని మనం ప్రస్ఫుటంగా గమనించవచ్చు. అతని చిత్రాలలో దిద్దుబాట్లు, ఒక రంగుపై మరొక రంగును వేయటం మచ్చుకైనా కానరాదు.

డబ్బు, పేరు ప్రతిష్ఠలు ఇవేమీ అతనిలో మార్పును తీసుకుని రాలేకపోయాయి. ఎప్పటిలానే అతను ఇప్పటికీ హైదరాబాద్‌ ఇరానీ హోటల్‌లో కూర్చుని కులాసాగా చాయ్‌ సేవించగలడు. 5 నక్షత్రాల హోటలయినా, రోడ్డు ప్రక్కన వుండే ధాబా అయినా అతినికొకటే. పాదాలతో భూమిని స్పృశించటంలో ముఖ్యంగా గడ్డిపై నడిచేటప్పుడు ఒక అనూహ్య ఆనందాన్ని పొందటం కోసం చాలాకాలం చెప్పులు లేకుండా నడిచేవాడు. (ఆరోగ్య రీత్యా డాక్టర్ల సలహాతో ఇప్పుడు లేదు.) దాని కోసం కొన్ని 5 నక్షత్రాల హోటల్స్‌ అతని ప్రవేశాన్ని నిషేధించినా, వారిని నిందించలేదు, విమర్శించలేదు, మౌనంగా ఉండిపోయాడు.

హుస్సేన్‌ ఇష్టపడే చిత్రకారులలో సహజత్వానికి పెద్ద పీట వేసిన జె.పి. సింఘాల్‌ ఉన్నాడు. గజగామిని చిత్రపు విడుదల ముందు మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాన్ని అతనే డిజైన్‌ చేశాడు. హుస్సేన్‌ అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. హైదరాబాద్‌ చిత్రకారులలో శ్రీలక్ష్మాగౌడ్‌, సూర్యప్రకాష్‌లు హుస్సేన్‌ను తమ శ్రేయోభిలాషిగా భావిస్తారు.

4ఒకప్పుడు పికాసోతో కలసి చిత్రకళా ప్రదర్శనను పంచుకున్న హుస్సేన్‌, చిత్రకళలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన వలసివచ్చింది. 1950-70 కాలాల మధ్య అతను వేసిన చిత్రాల ప్రదర్శన ఇంగ్లండ్‌ లోని ఆసియా హౌస్‌లో 2007లో జరిగినపుడు, హిందూత్వ వాదుల తీవ్రనిరసనతో అర్ధాంతరంగా ముగిసింది. హిందూ దేవతలను కావాలనే నగ్నంగా చిత్రీకరించాడనేది ముఖ్య ఆరోపణ. ముఖ్యంగా 1964 లో అతను చిత్రించిన ‘దుర్గ,’ ‘ద్రౌపది’. ఇందులో ద్రౌపది అన్న చిత్రం, పికాసో చిత్రాలతో కలసి ‘సావ్‌పాలో’ జరిగిన బైఎనల్‌లో 1964వ సంవత్సరంలో ప్రదర్శితమయింది. వీటితో పాటు భారత మాత, సరస్వతి అన్న చిత్రాలపై కూడా తీవ్ర నిరసన వెల్లువలు పెల్లుబుకాయి. నఫీజా ఆలీ అనే ఒకప్పటి బ్యూటీ క్వీన్‌, సినీనటి హుస్సేన్‌ వేసిన భారత మాత అనే చిత్రాన్ని వెబ్‌లో వుంచి 60 లక్షల రూపాయలు ప్రారంభ విలువగా వేలం మొదలు పెట్టినపుడు, ఈ చిత్రపు నకలు నొకదానిని ఫిబ్రవరి 6, 2006న ఇండియా టుడే ప్రచురించినపుడు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. వ్యక్తి పరంగా, కళపరంగా హుస్సేన్‌ వివాదాస్పదుడైనాడు. హుస్సేన్‌ చేతులు ఖండించి తెచ్చిన వారికి 50 కోట్ల రూపాయల బహుమతి ప్రకటించింది ఒక వెబ్‌సైట్‌. తన స్వస్థలమైన పండర్‌పూర్‌తో కలుపుకొని 7 కోర్టు కేసులు, 1050 పోలీసు కేసులు అతనికి వ్యతిరేకంగా నమోదయినాయి. ఇందులో 3 కేసులు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రాజ్‌కోట్‌, ఇండోర్‌, భోపాల్‌, హరిద్వార్‌ల నుంచి అతనిపై అనేక అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఇవి మరీ అంత సీరియస్‌ కేసులు కావు. అయినప్పటికీ అవి హుస్సేన్‌ను దుబాయి వెళ్ళేలా తరిమికొట్టాయి. ఇవి ఒక కొలిక్కి రావడానికి కొన్ని ఏళ్ళు పట్టవచ్చు.

ఒకప్పుడు ఇటలీని సందర్శించినపుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని కళాకృతిగా భావించబడుతున్న మైఖెలాంజిలో శిల్పాల కన్నా భారత దేశంలో విజయనగర సామ్రాజ్య కాలం నాటి (17వ శతాబ్దం) ‘శివతాండవం’ (నటరాజు) శిల్పాన్ని ప్రపంచంలో అత్యున్నత శిల్పంగా భావిస్తానని చెప్పిన హుస్సేన్‌లో, కొందరు, హిందూ మతాన్ని భ్రష్టుపట్టించే ఒక ముస్లింను చూడగలగటం దురదృష్టం. ఈ విమర్శలు ఏవీ అతని చిత్రాల విలువలను తక్కువ చేయలేక పోయాయి.

లండన్‌లోఅంతర్జాతీయ చిత్రకళా వేదికలు, ప్రముఖమైన క్రీస్తీ సంస్థ చేపట్టిన వేలంపాటలో హుస్సేన్‌ చిత్రాలలో వివాదాస్పద చిత్రాలలో ఒకటైన ‘గంగా జమునా’ 1.6 మిలియన్‌ పౌండ్లు అంటే సుమారు 6.4 కోట్ల ధర పలికింది. ఇప్పుడతను వేసిన వివాదస్పద చిత్రాలకది కనీస విలువగా స్థిరపడింది. ఈ వేలం ఏప్రిల్‌, 2008 సం||లో జరిగింది.

ప్రీతిష్‌ నంది శృంగార భరిత సంస్కృత శ్లోకాలు కొన్నిటిని ఆంగ్లంలోకి Careless whispers అన్న పేరుతో అనువాదం చేశాడు. అందులోని శృంగార భావాలకు అనుగుణంగా అతను వేసిన రేఖా చిత్రాలు భావగర్భితాలు, ఒక పట్టాన మన కంటికి సులువుగా అందని Erotic Sketches.

హుస్సేన్‌ లో మంచి చక్కటి వాస్తు శిల్పి ఉన్నాడు. అహ్మదాబాద్‌లో నిర్మించిన గుఫా (గుహ) అన్న మ్యూజియం దేశ విదేశస్థుల నెందరినో విభ్రమ పరిచింది.

ఈ మధ్యనే ఒక టీవీ ఛానెల్‌, హుస్సేన్‌కు భారతరత్న ఇవ్వాలనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరినప్పుడు ఆ ఛానెల్‌పై దాడి జరిగింది. 2007లో రాజా రవివర్మ అవార్డు హుస్సేన్‌కు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం భావించినా హిందుత్వవాదుల నిరసనతో విరమించుకోవలసి వచ్చింది.

చివరిగా హుస్సేను మాటలతో ఈ వ్యాసాన్ని ముగించటం సమంజసమని భావిస్తున్నాను. ”నా చిత్రాలు ఆధునిక శైలిలో వేయబడ్డ భారతీయ చిత్రాలు. వాటి వేర్లు ఈ దేశపు మట్టిలోనే వున్నాయి.

నా చిత్రకళకు మూలం, ఆధారం భారత దేశమే. ఇక్కడి జానపద కళల యొక్క మౌలిక స్వరూపాలలోనికి వెళ్ళి అక్కడ వున్న ప్రతీకలతో

తాదాత్మ ్యం చెంది నేను పొందిన అనుభూతులను నా శైలిలో చిత్రాలుగా మలుస్తాను. నాది పూర్తిగా సింబాలిక్‌ ఆర్ట్‌. పశ్చిమ దేశపు ప్రతీకలను నేనెన్నడూ ఉపయోగించుకోలేదు. నేను వేసిన కొన్ని హిందూ పౌరాణిక పాత్రల చిత్రాలు ఆ మతం యొక్క సున్నితమైన అంశాలను కించపరిచేవిగా ఉన్నాయన్న ఆరోపణలను ఎరుర్కొన్నాను. 5 వేల సంవత్సరాల సంస్కృతి గల భారత దేశంలో నేనొక భాగాన్ని. ఈ దేశంలో పుట్టడం నా సుకృతం. చిత్రకళ అనే పవిత్ర కార్యం మనస్సు ప్రక్షాళన కోసమే తప్ప విధ్వంసం కోసం కాదు. నా చిత్రాలను భద్రపరచడమా, ధ్వంసం చేయడమా అనేది భారత దేశ ప్రజల ఇష్టం. విభిన్న వైరుధ్య సంస్కృతులతో భాసించే ఈ దేశంలో ఇటువంటి అభిప్రాయాలు రావటం భయావహం!!”

హుస్సేన్‌ చిత్రాలు సేకరించిన అనేక మందిలో సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ఒకప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి లాంటి వారెందరో ఉన్నారు.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

First Published:  18 Sept 2015 12:30 AM IST
Next Story