ఇది దేశీయ విపణి
జైపూర్‌లో జోహారీ బజార్, న్యూఢిల్లీ హట్, ఖారీ బౌలీ, చాందినీ చౌక్, కోల్‌కతాలో చౌరింఘీలేన్, ముంబయి నగరం దాదర్ ఏరియాలో ఫ్లవర్ మార్కెట్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కనోజ్ మార్కెట్, జోధ్‌పూర్‌లో సర్దార్ మార్కెట్, సూరత్‌లో మహింద్రాపురా డైమండ్ మార్కెట్, ఇంఫాల్‌లో ఇమ్రాన్ మార్కెట్, కొచ్చిన్‌లో జ్యూ టౌన్, గోవాలో ఫ్లీ మార్కెట్, హైదరాబాద్‌లో లాడ్ బజార్… ఇవన్నీ వాణిజ్య సముదాయాలు. ఇక్కడ జరిగే లావాదేవీలను తెలుసుకుంటే చాలు. మనదేశ చారిత్రక, సాంస్కృతిక ముఖచిత్రం అర్థమైపోతుంది. ఈ […]
- జోహారీ బజార్‌లో జాతిరాళ్లు, రత్నాల ఆభరణాలు, కుందన్ ఆభరణాలు, మీనాకారీ వర్క్, థెవా వర్క్, పోల్కీ వర్క్‌లో రూపొందిన సంప్రదాయ రాజస్థాన్ శైలి ఆభరణాలు దొరుకుతాయి. బంగారు ఆభరణాలతోపాటు ఇతర లోహాల ఆభరణాలు కూడా ఉంటాయి. దీనికి పక్కనే ఉన్న బాపూ బజార్, నెహ్రూ బజార్‌లలో అందమైన రాజస్థానీ దుస్తుల దుకాణాలుంటాయి. జోధ్‌పూర్‌లోని సర్దార్ మార్కెట్ మెహరాన్‌ఘర్ కోట దగ్గర ఉంటుంది. బంధేజ్ దుస్తులు, మోజ్రీ (రాజస్థానీ చెప్పులు), హస్తకళా ఖండాలు, గాజులు ఉంటాయి.
ఢిల్లీలోని భారీ ఖారీబౌలి 17వ శతాబ్దం నుంచి ప్రసిద్ధి చెందిన సుగంధద్రవ్యాల విపణి. ఇక్కడ వంటలలో ఉపయోగించే అన్ని రకాల సుగంధద్రవ్యాలు, చెట్టు వేళ్ల మూలికలు, గింజలు, డ్రైఫ్రూట్స్ దొరుకుతాయి. ఇది ప్రపంచంలోని అతి పెద్ద సుగంధద్రవ్యాల మార్కెట్లలో ఒకటి. ఇక ఢిల్లీహట్‌లో సంప్రదాయ, ఆదునిక జీవనశైలికి అవసరమైన అన్ని రకాల వస్తువులూ ఉంటాయి. అవన్నీభారతీయ సంప్రదాయ శైలిలో తయారైనవే. చాందినీ చౌక్ మూడు వందల ఏళ్ల నుంచి ఢిల్లీ వాసుల ఫ్యాషన్ మార్కెట్. తినుబండారాలు, దుస్తులు, సంప్రదాయ ఆభరణాల నుంచి ఎలక్ర్టానిక్ వస్తువుల వరకు ఇక్కడ దొరుకుతాయి.
ముంబయి లోని ఫ్లవర్ మార్కెట్‌ను చూడడమే గొప్ప అనుభూతి. దేశం నలుమూలల నుంచి రకరకాల పూలు రోజూ తెల్లవారు జామునే ఇక్కడికి వస్తాయి. నగరంలోని చిల్లర పూల వ్యాపారులంతా ఇక్కడి నుంచే పూలు కొనుగోలు చేస్తారు. ఉదయాన్నే ఈ మార్కెట్‌కెళ్లే పూలరెక్కలకు ప్రకృతి ఇచ్చిన వందలాది షేడ్లు కనిపిస్తాయి.
కనోజ్ మార్కెట్ గంగానది తీరప్రాంతంలో విస్తరించింది. ఇక్కడి వారికి పరిమళద్రవ్యాల తయారీ కుటీర పరిశ్రమ. 650 రకాల పరిమళ ద్రవ్యాలు ఇక్కడ తయారవుతాయి. అన్నీ ప్రాచీన పద్ధతులలోనే తయారవడం విశేషం. ప్రతి ఇంటికీ వెనుక వైపు అత్తరు తయారు చేసే బట్టీ ఉంటుంది.
సూరత్‌లోని మహింద్రపురా డైమండ్ మార్కెట్ ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటుంది. వజ్రాన్ని అపురూపంగా పెట్టెలో పెట్టి దాచడమే తెలిసిన మనకు ఇక్కడి దృశ్యాలు ఆశ్చర్యానికి లోను చేస్తాయి. నిపుణులైన పనివాళ్లు వజ్రాలను పరిమాణం, ఆకారం, నాణ్యతల ఆధారణంగా వేరు చేయడం, మెరుగుపెట్టడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. మరో పక్క… జనరల్ స్టోర్‌లో పప్పు దినుసులు కొన్నంత సులభంగా నిమిషాల్లో వజ్రాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిపోతుంటాయి.
ఇంఫాల్‌లోని ఇమా మార్కెట్‌కు మరో పేరు మదర్స్ మార్కెట్. ఇది మణిపూర్‌లోని మహిళల సాధికారతకు ప్రతీక. మూడు కిలోమీటర్ల దూరంలో విస్తరించిన ఈ మార్కెట్‌లో మూడువేల దుకాణాలుంటాయి. అన్ని దుకాణాల్లోనూ వ్యాపారం నిర్వహించేది. మహిళలే. ఇక్కడ చేతితో నేసిన శాలువాలు, లెహెంగాలు, దుప్పట్లు, ఇంటికి కావల్సిన అన్ని రకాల పాత్రలు, ఇతర గృహోపకరణాలు, కూరగాయలు, పండ్లు, తేనె, చేపలు… అది ఇది అనే తేడా లేకుండా ప్రతిదీ దొరుకుతుంది.
కొచ్చిన్‌లోని జ్యూ టౌన్ పేరుకు తగ్గట్టే యూదుల నివాసప్రాంతం. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాల్లో తయారయ్యే ప్రాచీన లోహపు గృహాలంకరణ వస్తువులు ఒకే చోట కనిపిస్తాయి. ఈ వ్యాపారాన్ని యూదు కుటుంబాలే నిర్వహిస్తాయి. దాంతో ఈ మార్కెట్‌కు అదే పేరు వచ్చింది.
గోవాలోని ప్లీ మార్కెట్ ప్రాచీన కాలంలో హిప్పీల వస్తు మార్పిడితో మొదలైన వ్యాపార కేంద్రం. ఇప్పుడు అక్కడ ప్రతి బుధవారం పరిససర గ్రామాల్లోని మహిళలు వచ్చి పండ్లు, పచ్చళ్లు, లవంగాలు, సంప్రదాయ ఆభరణాల వంటి వాటిని విక్రయిస్తుంటారు.
కోల్‌కతాలోని చౌరింఘీ లేన్‌లో బొమ్మలు, కీ చెయిన్‌లు, కోల్‌కతా వైభవాన్ని ప్రత్యేకతను తెలిపే కళాఖండాలు, దుస్తులు ఉంటాయి.
హైదరాబాద్‌లోని లాడ్ బజార్… లక్క గాజుల మార్కెట్. ఇది చార్మినార్ దగ్గర ఉంది. ముత్యాలు పొదిగిన లక్కగాజులు, ఒక మోస్తరు విలువ కలిగిన రంగురాళ్లు పొదిగిన గాజులు, చమ్కీ గాజులు, వందలు కాదు వేల రకాలు ఉంటాయి. ఇరుకు వీథుల్లో దుకాణాలను చూసుకుంటూ పోతే ఎక్కడ నుంచి వచ్చామో ఎటు వెళ్తే బయటపడతామో తెలియనంత పెద్ద మార్కెట్.
ఇక ప్రపంచంలో మరెక్కడా లేని మార్కెట్ ముంబయిలోని చోర్‌బజార్. పాత ఢిల్లీలో ఒక చోర్ బజార్ ఉంది. కానీ ముంబయి చోర్ బజార్‌తో పోలిస్తే అది చిన్నదే. ముంబయిలో వాడుకలో ఉన్న ఒక నానుడి ఏమిటంటే… -మీ వస్తువు ఏదైనా పోతే ఎక్కడ వెతికినా ప్రయోజనం ఉండదు. చోర్ మార్కెట్‌కెళ్తే కనిపిస్తుంది- అని. దొంగలు దొంగిలించిన వస్తువులను ఇక్కడ అమ్మేస్తుంటారని ప్రతీతి. దుకాణదారులు తక్కువ ధరకు కొని మారుబేరానికి అమ్ముతుంటారు. ఇక్కడ కొనడం నైతికంగా తప్పే. కానీ తెలుసుకోవడం తప్పు కాదు కదా! ఇక్కడ దొరికే ప్రాచీన వస్తువులు మరెక్కడా కనిపించవంటే అతిశయోక్తి కాదు.