కేబినెట్ నుంచి పీ`కేఈ`నున్నారా?
పేరుకు ఏపీ డిప్యూటీ సీఎం …కానీ ఒక్కరంటే ఒక్క ఉద్యోగిని కూడా బదిలీ చేయలేరు. అందరికీ తెలిసి ఆయన రెవెన్యూ శాఖా మంత్రి. కానీ ఆయన శాఖలో ఆయనకు తెలియకుండానే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. ఆయనే కేఈ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్. కానీ పార్టీ వ్యవహారాలకు ఈ పెద్దాయనను దూరం పెట్టారు. తాజాగా తన శాఖ పరిధిలో మంత్రిగా కేఈ చేసిన బదిలీలను నేరుగా సీఎం చంద్రబాబే ఆపేశారు. దీంతో కేఈ, బాబు […]
పేరుకు ఏపీ డిప్యూటీ సీఎం …కానీ ఒక్కరంటే ఒక్క ఉద్యోగిని కూడా బదిలీ చేయలేరు. అందరికీ తెలిసి ఆయన రెవెన్యూ శాఖా మంత్రి. కానీ ఆయన శాఖలో ఆయనకు తెలియకుండానే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. ఆయనే కేఈ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్. కానీ పార్టీ వ్యవహారాలకు ఈ పెద్దాయనను దూరం పెట్టారు. తాజాగా తన శాఖ పరిధిలో మంత్రిగా కేఈ చేసిన బదిలీలను నేరుగా సీఎం చంద్రబాబే ఆపేశారు. దీంతో కేఈ, బాబు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
సీనియర్లతో బాబు లడాయి
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన కేబినెట్‌లో సీనియర్లకు మధ్య గ్యాప్ రాను రాను పెరిగిపోతోంది. ఒకప్పుడు తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న సీనియర్లను క్రమంగా బాబు దూరం పెడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కేఈ విషయంలో మొదటి నుంచీ బాబు అసంతృప్తిగా ఉన్నారని..జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కేఈ కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. రెవెన్యూ శాఖ అప్పగించారు. కానీ పవర్ అంతా మంత్రి నారాయణదే. రెవెన్యూ శాఖలో పనులు చేసేది, చేయించేది అంతా మున్సిపల్ శాఖా మంత్రి నారాయణేనని సాక్షాత్తు కేఈయే చెప్పుకున్నారు. రాజధాని ఎంపిక నుంచి..భూసమీకరణ వంటి అంశాలను కేఈ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బాబుతోపాటు చినబాబు లోకేశ్ కూడా కేఈపై గుర్రుగా ఉన్నారట. అయితే కేఈని పొమ్మనకుండా పొగబెడుతూ వస్తున్న బాబు .. రెవెన్యూ శాఖలో ఏ ఒక్క ఫైలు తన అనుమతి లేకుండా కదిలే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారట. తనను ఉత్సవవిగ్రహంగా మార్చేశారనే ఆవేదనతో ఉన్న కేఈ తీవ్ర అసహనంతో ఉన్నారట. ఒకానొక దశలో తనను గవర్నర్‌గా పంపాలని బాబుకు విన్నవించారట.
డిప్యూటీసీఎం..సీఎం మధ్య ఫైల్ ఫైట్
ఏపీలో 22 మంది రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూ మంత్రి కార్యాలయం మంగళవారం జీవోలను వెలువరించింది. వీరిలో కొందరికి పదోన్నతులు కల్పించారు. ఒక్కరోజు గడవకముందే బదిలీలను నిలిపేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీచేసింది. బదిలీలు పారదర్శకంగా జరగలేదని సీఎంవో చెబుతుంటే..అంతా సవ్యంగానే చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సమస్యంతా సీఎం, డిప్యూటీ సీఎం మధ్యే అన్నది అధికారులకు తెలియనిది కాదు. అందుకే బదిలీల్లో లీలలున్నాయంటూ 24 గంటల్లో మరో కొత్త జీవో జారీ అయిపోయింది. కేఈ చాంబర్ నుంచి వెళ్లే ఫైళ్లపై సీఎం నిఘా కొనసాగుతోందని, సీఎంవో అనుమతి లేనిదే ఏ ఒక్క ఫైలు కదలడంలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్న మాట. ఈ దెబ్బతో ఇక రేపో మాపో కేఈ స్వచ్ఛందంగా వెళ్లిపోవడమో, సాగనంపడమో జరగడం ఖాయమంటూ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.