కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ రివ్యూ
కొరియర్ -ఒక భయంకర్ రేటింగ్ 2/5 సినిమా కథలకు బోలెడు ఫార్ములాలుంటాయి. 1970 లో నిధి రహస్యం, 1980 లో ముక్కోణపు ప్రేమకథలు, రాజ్యమేలాయి, ఆతరువాత కుటుంబ కథలు, హీరో అందర్ని ఉతికి పారేస కథలొచ్చాయి. మధ్యలో ఆటలో అరటి పండులా మెడికల్ మాఫియా కథలొస్తుంటాయి.ఇవి రెండు రకాలు. ఒక సైంటిస్ట్ ఏదైనా మంచి విషయాన్ని కనిపెడితే..దాన్ని విలన్ వేటాడి వెంటాడి ఫినిష్ చేయాలని చూడటం. మధ్యలో హీరో రక్షించడం. ఇక రెండో తరహా కథల్లో విలనే […]
కొరియర్ -ఒక భయంకర్
రేటింగ్ 2/5
సినిమా కథలకు బోలెడు ఫార్ములాలుంటాయి. 1970 లో నిధి రహస్యం, 1980 లో ముక్కోణపు ప్రేమకథలు, రాజ్యమేలాయి, ఆతరువాత కుటుంబ కథలు, హీరో అందర్ని ఉతికి పారేస కథలొచ్చాయి. మధ్యలో ఆటలో అరటి పండులా మెడికల్ మాఫియా కథలొస్తుంటాయి.ఇవి రెండు రకాలు. ఒక సైంటిస్ట్ ఏదైనా మంచి విషయాన్ని కనిపెడితే..దాన్ని విలన్ వేటాడి వెంటాడి ఫినిష్ చేయాలని చూడటం. మధ్యలో హీరో రక్షించడం. ఇక రెండో తరహా కథల్లో విలనే ఒక డాక్టరై ఉండి ప్రజలకు హాని చేసే విషయాన్ని హీరో కని పెట్టి అతని ఆట కట్టించడం.
కొరియర్ బాయ్ కళ్యాణ్ కూడా ఇదే ఫార్ములా. పిండం ఏర్పడుతున్న దశలో అబార్షనయేలా చూసి ఆ పిండంలోని స్టెమ్ సెల్స్ ని సేకరించి దాంతో వైద్యం చేసి కోట్లు సంపాదించడం. ఇది విలన్ అశుతోష్ రాణా ఆలోచన. ఇది అమలు కావాలంటే ఉద్దేశ పూర్వకంగా అబార్షన్లు జరిపించాలి. దీన్ని ఒక వార్డ్ బాయ్ కనిపెట్టి సత్యమూర్తి అనే సమాజసేవకుడికి( నాజర్) ఆ శాంపిల్స్ కొరియర్ పంపుతాడు. అది అతనికి చేరవేసే పనిలో కొరియర్ బాయ్ కళ్యాణ్ ( నితిన్) వుండగా ఏమి జరిగిందన్నేది సినిమా.
ఇలాంటి కథలు లైన్ అనుకుంటున్నప్పుడు బాగానే వుంటాయి. కానీ దాన్ని స్క్రీన్ పై బోర్ కొట్టకుండా ఎలా చూపించడమన్నదే ప్రశ్న. ఈ పనిలో దర్శకుడు ప్రేమ్ సాయి పూర్తిగా విఫలమై చేతులెత్తేశాడు. ఈ బరువు మోయలేక నితిన్ చతికిల పడ్డాడు.
కథాబలం లేని సినిమాలో నటించడం వల్లనే నితిన్ బోలేడు ప్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత మెల్లగా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఇంత జీవం లేని పిచ్చి కథను ఎందుకు ఎంచుకున్నాడన్నదే ప్రశ్న. చెప్పదలచుకున్న కథలోనైనా ప్రేక్షకుల్ని లీనం చేసారా అంటే అది లేదు. టీవీ సిరియల్ లా కథ నడుస్తుంది. మధ్యలో లవ్ ఎపిసోడ్.
హీరోయిన్ యామి గౌతమ్ ఖాదీ బండారులో పని చేస్తుంటుంది. ఫ్రెండ్ తరుపున కొరియర్ ఇవ్వడానికి వచ్చిన హీరో ఆమెను చూసి ప్రేమలో పడి కొరియర్ బాయ్ ఉద్యోగంలో కుదురుకుంటాడు. ఆమెకి లైన్ వేయడానికి తనే స్వయంగా కవర్లు తయారు చేసి ప్రతిరోజు డెలివరి ఇస్తుంటాడు. ప్రేమ సన్నివేశాలైనా కొత్తగా వున్నాయంటే అది లేదు. పాత చింతకాయ పచ్చడి సీన్స్. హీరోయిన్ అందంగా వుంది కానీ..ఆమెకి నటించడానికి అవకాశమే లేదు. కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం తప్ప , సినిమాలో తను చేసింది ఏమి లేదు నితిన్ కి ఆమెతో కెమిస్ట్రి కుదరలేదు.
పాటలు బాగున్నాయి, కొరియో గ్రఫి ఓ. కే, సినిమా మొదటి సన్నివేశంలోనే నితిన్ దెబ్బలు తిని కింది పడి వుంటాడు. ఆ తరువాత స్టెమ్ సెల్స్ ఎపిసోడ్. మొదటి ఎసిపోడ్ లోనే చివరకు ఏం జరుగుతుందో మన ఊహకి అందచేసి దర్శకుడు మన శ్రమ తగ్గిస్తాడు.
సంపూర్ణేష్ బాబు పై ఒక సైటర్ సీన్ వుంది. దాని అవసరమేంటో తీసిన వారికే తెలియాలి. తనకున్న పరిధిలో నితిన్ బాగా నటించడానికి చిన్న ప్రయత్నం చేశాడు కానీ ప్రేక్షకుడికి ఏ సీన్ రిజిస్టర్ కాక పోవడం వల్ల అది వృధా అయ్యింది.
సినిమా చివరలో హీరో హీరోయిన్ తో ఫీల్ లేదు అంటాడు. ప్రేక్షకుల అభిప్రాయం కూడా అదే. మనికి అన్నిటికంటే రిలీఫ్ కలిగించే విషయమేమంటే సినిమా గంట నలభై నిముషాల్లో అయిపోవడం.తెర పై నడిచే సన్నివేశాలని ప్రేక్షకుడు తన సొంతం అనుకుంటేనే సినిమా పండుతుంది. అలా కాకుండా ఎవడి గోల వాడిదే అన్నట్టు సినిమా నడిస్తే ప్రేక్షకులు జడుసుకుంటారు. ప్రేక్షకులు ఎంతో తెలివి మీరిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎందుకొస్తాయంటే ప్రేక్షకుల పై దర్శకులకు గౌరవం లేక పోవడం వల్ల.
– జి ఆర్. మహర్షి